Kishan Reddy: ప్రభుత్వాన్ని కూలిస్తే మాకేం వస్తుంది
ABN , Publish Date - Apr 16 , 2025 | 03:44 AM
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలిపోతే బీజేపీకి ఎలాంటి లాభం లేదని ప్రశ్నించారు. ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంలో భూములు, మద్యం అమ్మకాలు, అప్పుల ద్వారా వ్యవస్థ నడుస్తోందని విమర్శించారు. కిషన్‌రెడ్డి బీజేపీ కొత్త అధ్యక్షుడిని త్వరలో నియమించనున్నట్లు చెప్పారు

వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ.. అధికారం ఖాయం.. త్వరలోనే రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడి నియామకం
జాతీయ అధ్యక్ష పదవికి నా పేరు ప్రతిపాదన లేదు
కాంగ్రెస్, బీఆర్‌ఎ్‌సలకు బిగ్‌బాస్ అసదుద్దీన్ ఒవైసీ
భూ ఆక్రమణదారులే వక్ఫ్ బోర్డు చట్ట సవరణ వ్యతిరేకులు..
మీడియాతో చిట్‌చాట్‌లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు
హైదరాబాద్, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలిస్తే తమకేం వస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లు ఉండాలని రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే స్పష్టం చేశామని, ఆ మాటకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో కిషన్‌రెడ్డి చిట్‌చాట్‌లో మాట్లాడారు. గుజరాత్ వ్యాపారులతో కలిసి బీజేపీ తమ ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర చేస్తోందంటూ కాంగ్రెస్ చేసిన ఆరోపణపై స్పందించారు. ‘‘ఇక్కడ ప్రభుత్వాన్ని కూలగొడితే మాకేం వస్తుంది? గుజరాత్ వ్యాపారులకు అక్కడేం పనిలేదా? అక్కడ వారు వ్యాపారాలు చేసుకోరా?’’ అని ప్రశ్నించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ కు ఘోర పరాజయం తప్పదన్నారు. భూములను అమ్మడం ద్వారానే ప్రభుత్వాన్ని నడిపే పద్ధతి తెలంగాణాలో మాత్రమే ఉందని విమర్శించారు. భూములు, మద్యం అమ్మకం, అప్పులు తీసుకురావడం ద్వారానే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందని, గతంలో బీఆర్‌ఎస్ కూడా ఇలాగే చేసింద ని అన్నారు. మద్యం అమ్మకాల్లో దేశంలోనే మొదటిస్థానంలో తెలంగాణ ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అటవీ చట్టాలను ఉల్లంఘించి కంచ గచ్చిబౌలిలో చెట్లను నరికివేయించిందని ఆరోపించారు. అర్ధరాత్రి బుల్టోజర్లు పెట్టి చెట్లు నరికివేసిన ప్రభుత్వం తెలంగాణాలో తప్ప ఎక్కడా లేదని విమర్శించారు. తనది యంగ్ ఇండియా బ్రాండ్ అన్న సీఎం రేవంత్ ప్రకటనపై కిషన్‌రెడ్డి స్పందిస్తూ.. ఆయనది ఏ బ్రాండో వచ్చే ఎన్నికల్లో తెలుస్తుందన్నారు. తన బ్రాండ్ మాత్రం నేషనలిజమేనన్నారు. తమిళనాడులో ఎన్డీఏ కూటమి పునరుద్ధరణే తప్ప.. కొత్త పొత్తు కాదని స్పష్టం చేశారు.
త్వరలోనే కొత్త అధ్యక్షుడు..
రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడి నియామకం త్వరలోనే జరిగే అవకాశం ఉందని కిషన్‌రెడ్డి తెలిపారు. దక్షిణాదిన తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు కొత్త అధ్యక్షుల నియామకం జరిగిందని, ఇంకా తెలంగాణతోపాటు ఏపీ, కర్ణాటక, పుదుచ్చేరిలకు జరగాల్సి ఉందని పేర్కొన్నారు. జాతీయ పార్టీకి కూడా కొత్త అధ్యక్షుడు రానున్నారని, అయితే.. ఈ పదవికి తన పేరు మాత్రం ప్రతిపాదనలో లేదని చెప్పారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీచేసి అధికారంలోకి వస్తామని ప్రకటించారు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా పొత్తులపై ఎలాంటి చర్చ జరగలేదని, ఈ ఎన్నికల్లో బీజేపీకి, మజ్లిస్‌కు మధ్యే పోటీ అని అన్నారు. మోదీ ప్రభుత్వం పేదలకు 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తోందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే దీనికి అదనంగా సన్నబియ్యం ఇవ్వాలని సవాల్ చేశారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి రాగానే సింగరేణి కార్మికుల ఆదాయ పన్నును రీయింబర్స్‌మెంట్ చేస్తామని చెప్పారు.
ఆందోళనలు చేస్తున్నది భూ ఆక్రమణదారులే..
భూ బకాసురులు, భూ ఆక్రమణదారులే వక్ఫ్ చట్ట సవరణను వ్యతిరేకిస్తున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. భూ ఆక్రమణదారులతోనే మజ్లిస్ పార్టీ ధర్నాలు చేయిస్తోందని మండిపడ్డారు. వక్ఫ్ బోర్డుతో ఒక్క పేద ముస్లిం కుటుంబానికైనా న్యాయం చేశారా? అని మజ్లిస్ నేతలను నిలదీశారు. వక్ఫ్ బోర్డు పేరుతో భూ దందాలు చేసేవారే ఇప్పుడు ఆందోళనలు చేస్తున్నారన్నారని అన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్లకు బిగ్‌బాస్ మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ అని, ఆ రెండు పార్టీలను ఆయనే కంట్రోల్ చేస్తున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణాలో మజ్లిస్ విస్తరణకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, దేశమంతా ఒకవిధంగా, తెలంగాణాలో మరో విధంగా మజ్లిస్ వైఖరి ఉంటోందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో అన్ని స్థానాల్లో మజ్లిస్ ఎందుకు పోటీ చేయదని ప్రశ్నించారు. రాష్ట్రంలోని రెండు జాతీయ పార్టీల్లో ఒకటి మూటలు మోసేది అని, మరోటి చెప్పులు మోసేది అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యపై కిషన్‌రెడ్డి మండిపడ్డారు. కేటీఆర్ దారుస్సలాం అడుగులకు మడుగులొత్తుతున్నారని అన్నారు.