Komatireddy Venkat Reddy: కోట్లు ఖర్చు పెట్టి.. కూలిపోయే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిన కేసీఆర్
ABN , Publish Date - Jan 26 , 2025 | 03:39 PM
Komatireddy Venkat Reddy: గత కేసీఆర్ పాలనపై మరోసారి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. కోట్లు ఖర్చు పెట్టి కూలిపోయే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారన్నారు. అలాగే గత పదేళ్ల పాలనలో పేదలకు ఒక్క ఇళ్లు కూడా నిర్మించిన ఇవ్వలేదన్నారు.

ఖమ్మం, జనవరి 26: గత పదేళ్లలో పేదలకు ఇళ్లు సైతం నిర్మించి ఇవ్వ లేదంటూ కేసీఆర్ ప్రభుత్వంపై సినిమాటోగ్రఫ్రీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ముదిగొండ మండలం ఖానాపురంలో 107 మందికి ఇళ్లు, 32 మందికి రేషన్ కార్డులను ఆయన అందజేశారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పేదల కోసం నాలుగు పథకాలు ప్రారంభించుకుంటున్నామన్నారు.
పేద వారికి పథకాలు అందజేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతోపాటు 200 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తుందని గుర్తు చేశారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు సైతం భర్తీ చేస్తున్నామని సోదాహరణగా వివరించారు. రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ను అభివృద్ధి చేసుకొందామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన పిలుపు నిచ్చారు. దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా సీఎం రేవంత్ రెడ్డి రూ. లక్ష 75 వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకు వచ్చారని తెలిపారు.
రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీని సైతం ప్రారంభించామన్నారు. జిల్లాలో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు సైతం త్వరలోనే పూర్తికా నుందని చెప్పారు. కోట్లు ఖర్చు పెట్టి.. కూలిపోయే కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను కేసీఆర్ నిర్మించారని ఆయన వ్యంగ్యంగా అన్నారు. అయితే రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తిప్పికొట్టారు.
Also Read: న్యూఢిల్లీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు..
నాలుగేళ్లలో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని ఆయన స్పష్టం చేశారు. పేదవారికి న్యాయం చేసేదే నిజమైన ప్రభుత్వమని ఆయన పేర్కొన్నారు. నల్గొండ, ఖమ్మం జిల్లాలు వేర్వేరు కాదని.. అందుకు తనకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్‌ఛార్జీగా తనను నియమించారని గుర్తు చేశారు. పార్టీలకు అతీతంగా పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు పథకాలు ఎలా అమలు చేశామో.. ప్రస్తుతం అలాగే అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అయితే ఉపాది హామీ పథకాన్ని దేశంలో ప్రవేశపెట్టింది.. కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గుర్తు చేశారు.
For Telangana News And Telugu News