Konda Surekha: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్‌ఎస్‌ మద్దతు

ABN, Publish Date - Feb 23 , 2025 | 04:47 AM

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు బీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతు ఇస్తోందని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు.

Konda Surekha: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్‌ఎస్‌ మద్దతు
  • కేంద్ర క్యాబినెట్‌లో ఇద్దరున్నా తెచ్చింది సున్నా: కొండా సురేఖ

  • చార్మినార్‌ జోన్‌లోకి మెదక్‌ జిల్లా! : మంత్రి దామోదర

సంగారెడ్డి/మెదక్‌, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు బీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతు ఇస్తోందని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్‌రెడ్డిని గెలిపించాలని సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌ జిల్లా కేంద్రాల్లో జరిగిన సమావేశాల్లో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన రఘునందన్‌రావును మెదక్‌లో బీఆర్‌ఎస్‌ నేతలు క్రాస్‌ ఓటింగ్‌ చేసి గెలిపించారని ఆరోపించారు.


మాజీ సీఎం కేసీఆర్‌ బయటకు వస్తున్నానని అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెడతారని అనుకున్నానని.. కానీ ఆసుపత్రికి వెళ్లి స్కానింగ్‌ తీయించుకున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా బడ్జెట్‌లో గుండు సున్నా మాత్రమే తెచ్చారని దుయ్యబట్టారు. మంత్రి దామోదర మాట్లాడుతూ మెదక్‌ జిల్లాను చార్మినార్‌ జోన్‌లో కలిపేలా సీఎం దృష్టికి తీసుకెళ్లానని అన్నారు. వర్గీకరణ, కులగణనకు వ్యతిరేకం కాదని ఆయన తేల్చి చెప్పారు.

Updated Date - Feb 23 , 2025 | 04:47 AM