KTR: ప్రమాణపత్రాలు ఎందుకు?
ABN, Publish Date - Jan 04 , 2025 | 03:52 AM
రాష్ట్ర రైతాంగాన్ని ఇబ్బంది పెట్టేందుకే రైతుభరోసా చెల్లిస్తాం.. ప్రమాణ పత్రాలు ఇవ్వండంటూ కాంగ్రెస్ సర్కారు కుట్రచేస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
రైతులపై కేసులు పెట్టేందుకేనా..
భరోసా కోసం రైతులు అడుక్కోవాలా?
అన్నదాతలకు రూ.26,500 కోట్లు ఎగ్గొట్టారు
ఎంతమందికి రుణమాఫీ చేశారో గ్రామాల్లో ప్రభుత్వమే ప్రమాణపత్రాలివ్వాలి: కేటీఆర్
హైదరాబాద్, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రైతాంగాన్ని ఇబ్బంది పెట్టేందుకే రైతుభరోసా చెల్లిస్తాం.. ప్రమాణ పత్రాలు ఇవ్వండంటూ కాంగ్రెస్ సర్కారు కుట్రచేస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. అన్నదాతలను దొంగలుగా చిత్రీకరించేందుకు, కేసులు పెట్టేందుకు కుట్ర చేస్తున్నారని, రైతు భరోసా కోసం రైతులు అడుక్కోవాలా? అని ప్రశ్నించారు. రైతులను కేసీఆర్ శాసించే స్థితికి తీసుకువస్తే... రేవంత్‌రెడ్డి 13నెలల పాలనలో రైతాంగాన్ని యాచించే స్థితికి దిగజార్చుతున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వం 11సార్లు రైతుబంధు డబ్బులిస్తే... కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా రైతులకు ఇవ్వలేదన్నారు. రైతులు యాచించాలని ప్రభుత్వం కోరుకొంటోందని, వానాకాలంలో ఎగ్గొట్టిన రైతుబంధు కూడా ఇవ్వాల్సిందేననని డిమాండ్ చేశారు. ‘‘ప్రమాణ పత్రం ఇవ్వాల్సింది రైతులు కాదు.. ఎంతమందికి రుణమాఫీ చేశారనే దానిపై ఊరురా కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రమాణపత్రాలు ఇవ్వాలి’’ అని వ్యాఖ్యానించారు.
శుక్రవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.ప్రజాపాలన పేరిట రూ.1.6కోట్ల మందితో దరఖాస్తులు తీసుకున్నారని, అందులో రైతుభరోసా లబ్ధికి సంబంధించిన సమాచారం కూడా ఉందని, అలాంటప్పుడు రైతులు మళ్లీ దరఖాస్తు చేసుకోవడం ఎందుకని ప్రశ్నించారు. మొన్నటివరకు కులగణన సర్వే పేరుతో డ్రామాలు చేసిన కాంగ్రెస్.. ఇప్పుడు ప్రమాణపత్రాలంటూ రైతులను భయాందోళనకు గురిచేస్తోందని ఆరోపించారు. హామీలు అమలుచేసే సత్తా లేకుంటే చేతగానివాళ్లమంటూ రైతన్నలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక్కొక్క రైతుకు ఎకరాకు రూ.17,500 చొప్పున ప్రభుత్వం బాకీపడిందని, దీనిపై ఊరూరా పోస్టర్లు వేసి మరీ రైతులకు తెలియజేస్తామన్నారు. రైతుబంధును లేకుండాచేయాలని రేవంత్‌రెడ్డి చిల్లరప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రైతులు అడుక్కుంటారా?అని వ్యవసాయశాఖ మంత్రి మాట్లాడుతున్నారని, ఈ ప్రభుత్వం ధోరణి దారుణంగా ఉందన్నారు. గత ప్రభుత్వం హయాంలో రైతుబంధు పంపిణీలో రూ.22వేలకోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్.. ఆ డబ్బు ఎక్కడికి వెళ్లిందో చెప్పాలన్నారు. పత్తి, కంది, చెరుకు వంటి వాటికి రెండోపంట ఉండదని.. అయినా రైతుబంధు ఇచ్చామన్నారు.రాష్ట్ర రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.26,500కోట్లు ఎగ్గొట్టిందని విమర్శించారు.
Updated Date - Jan 04 , 2025 | 03:52 AM