KTR: రేవంత్ గోడలు దూకేది మాకు తెల్వదా?
ABN , Publish Date - Mar 18 , 2025 | 04:36 AM
మేమూ రేవంత్‌రెడ్డి లెక్కనే మాట్లాడితే బయట తిరగలేడు. రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ గోడలు దూకుతాడో మాకు తెలవదా? సాగర్ సొసైటీలో ఎంత సమయం గడిపేవాడో తెలుసు.

సాగర్ సొసైటీలో ఎంత సేపు ఉండేవాడో తెలుసు
సెల్ఫ్ డ్రైవింగ్ కథలు, ప్రైవేట్ కార్ల వివరాలూ చెప్తాం
ఎక్కువ మాట్లాడితే ఫొటోలు కూడా బయటపెడతాం
మేము మొదలుపెడితే రేవంత్‌రెడ్డి బయట తిరగలేరు
తెలంగాణ పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది
ఆత్మహత్యలతో తల్లడిల్లుతుంటే.. అందాల పోటీలా?
కాంగ్రెస్ సర్కార్ అట్టర్‌ఫ్లాప్.. చిట్‌చాట్‌లో కేటీఆర్
హైదరాబాద్, మార్చి 17(ఆంధ్రజ్యోతి): ‘‘మేమూ రేవంత్‌రెడ్డి లెక్కనే మాట్లాడితే బయట తిరగలేడు. రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ గోడలు దూకుతాడో మాకు తెలవదా? సాగర్ సొసైటీలో ఎంత సమయం గడిపేవాడో తెలుసు. సాగర్ సొసైటీ, మైహోం భూజా వ్యవహారాల గురించి మాట్లాడగలం. ఆయన ఎక్కువ మాట్లాడితే ఫొటోలు కూడా బయట పెడతాం. రేవంత్ సెల్ఫ్ డ్రైవింగ్ కథలు, ప్రైవేట్ కార్ల వివరాలూ చెప్తాం’’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో రేవంత్ రెడ్డి దూకిన గోడలు, హైదరాబాద్‌లో దాటిన రేఖల గురించి బయట పెట్టాలా? అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. అసెంబ్లీలోని బీఆర్‌ఎ్‌సఎల్పీలో కేటీఆర్ మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. తాము నోరు విప్పితే రేవంత్‌కు ఇంట్లో అన్నం కూడా పెట్టరని పేర్కొన్నారు. ‘నామీద 15 కేసులు పెట్టిన రేవంత్‌కు ప్రజాసామ్య విలువలు ఈ రోజు గుర్తుకు వచ్చాయా? ఆయనకు ఈ రోజు కుటుంబం గుర్తుకు వచ్చిందా? నాకు అడ్డమైనవారితో లింకులు పెట్టిన నాడు.. మా కుటుంబాలు బాధ పడలేదా? మాకు సంబంధాలు అంటగట్టినప్పుడు, మా పిల్లల్ని రాజకీయాల్లోకి లాగిన రోజు మీకు విలువలు లేవా? ఈ రోజు ముఖ్యమంత్రి తన పిల్లలు, భార్య గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది’ అని వ్యాఖ్యానించారు. పదిహేనేళ్లుగా రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్‌లో పత్తాలు ఆడేవారితో గాసిప్స్ నడపటం అలవాటని ఆరోపించారు. రాష్ట్ర ఆదాయం రూ.70వేల కోట్ల ఆదాయం తగ్గిందని బడ్జెట్ కంటే ముందే సీఎం ఒప్పుకొన్నారని, ఇది ముమ్మాటికీ తెలంగాణ ఫాలింగ్ అని, ఇంతకంటే ఘోరమైన అవమానం ఇంకొకటి ఉండదని పేర్కొన్నారు.
జాతిపిత గాంధీని చంపింది గాడ్సే అయితే.. తెలంగాణ జాతిపిత లాంటి కేసీఆర్‌పై చిల్లర మాటలు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి అభినవ గాడ్సే అని విమర్శించారు. రేవంత్ నెగటివ్ పాలిటిక్స్ వల్లే తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందన్నారు. ఆదాయం పెంచే తెలివి ఈ ప్రభుత్వానికి లేదని, సర్కార్ అట్టర్ ఫ్లాప్ అయిందని విమర్శించారు. కేసీఆర్‌పై ద్వేషంతో కాళేశ్వరం ప్రాజెక్టును బంద్ పెట్టి, వ్యవసాయ రంగాన్ని నాశనం చేశారని దుయ్యబట్టారు. ‘‘ఢిల్లీకి 40 సార్లు కాకపోతే 400 సార్లు పోయి ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కాళ్లు పట్టుకో.. మాకేం సమస్య లేదు కానీ తెలంగాణకి ఎన్ని నిధులు తెచ్చావు? కేంద్రంతో సఖ్యతగా ఉండి ఏం సాధించావు?’’ అని కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ నేతల రహస్య సమావేశాలపై రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలను సీఎం ఎందుకు ఖండించడం లేదు? రాజాసింగ్‌ను సస్పెండ్ చేసే దమ్ము బీజేపీ నాయకులకు ఉందా? అని నిలదీశారు. తెలంగాణ వాళ్లకు నాయకత్వ లక్షణాలు లేవని, పాలన చేతకాదని నాటి సమైక్యాంధ్ర పాలకుల వ్యాఖ్యలు.. నేడు రేవంత్ హయాంలో నిజమవుతున్నాయన్నారు. భూములు అమ్మకూడదని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు చేస్తున్న ధర్నాలపై రాహుల్‌గాంధీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ‘నీతో కలిసి వచ్చినప్పుడు యూట్యూబర్లంతా జర్నలిస్టులుగా కనిపించారా? ఇవాళ నిన్ను విమర్శించగానే వాళ్లు జర్నలిస్టులు కాదంటూ మాట్లాడుతావా? జర్నలిస్టుల బట్టలు విప్పిస్తానని మాట్లాడడం సిగ్గుచేటు’ అని ధ్వజమెత్తారు.
అందాల పోటీలతో ఏం సాధిస్తావు?
‘అందాల పోటీలు పెట్టి రేవంత్ ఏం సాధించాలనుకుంటున్నారు? కరెంటు కోతలు, వ్యవసాయ సంక్షోభంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే అందాల పోటీలు నిర్వహిస్తామనడం సిగ్గుచేటు’ అని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఫార్ములా-ఈ తో ఏకపక్షంగా ఒప్పందం రద్దు చేసుకుని రూ.46 కోట్లు పోవడానికి రేవంత్ కారణమయ్యాడని, ఈ విషయమై తాము అధికారంలోకి రాగానే విచారణ జరుపుతామన్నారు.