ఆఫీసు లీజుల్లో తెలంగాణ వెనకడుగు: కేటీఆర్
ABN , Publish Date - Apr 06 , 2025 | 05:26 AM
తెలంగాణలో కొత్త ఐటీ పార్కుల కోసం ఆలోచించే ముందు గణనీయంగా తగ్గిపోతోన్న ఆఫీసు లీజింగ్ స్థలాల విషయంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కోరారు.

హైదరాబాద్, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణలో కొత్త ఐటీ పార్కుల కోసం ఆలోచించే ముందు గణనీయంగా తగ్గిపోతోన్న ఆఫీసు లీజింగ్ స్థలాల విషయంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కోరారు. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 41 శాతం ఆఫీసు వసతి లీజు తెలంగాణలో తగ్గిపోయిందని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. గతంలో హైదరాబాద్‌లో ఆఫీసు వసతి లీజుకి విపరీతమైన డిమాండ్ ఉండేదని, నేడు ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల పెద్ద కంపెనీలు ఇటువైపు చూసే పరిస్థితి కన్పించడం లేదని ఆయన అన్నారు.
బుల్డోజర్లతో ఉద్యోగాలు రావని, సరైన పారిశ్రామిక నిర్ణయాలు, భరోసాతోనే అవి సాధ్యమవుతాయని కేటీఆర్ పేర్కొన్నారు. బెంగళూరులో గత ఏడాది తొలి త్రైమాసికంలో ఆఫీసు వసతి లీజు 4.0గా ఉంటే ఈ ఏడాది 4.5కి పెరిగిందని ఇది 13 శాతం పెరుగుదల అని, తెలంగాణలో గత ఏడాది 2.9 ఉంటే ఈ ఏడాది 1.7కి చేరుకుందని, ఇది మైనస్ 41 శాతం అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.