Yadagirigutta: స్వర్ణ విమాన గోపురానికి ముహూర్తం ఖరారు
ABN , Publish Date - Feb 16 , 2025 | 04:22 AM
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి స్వర్ణ విమాన గోపురానికి మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమానికి ముహూర్తం ఖరారైంది. దేశంలోనే మొట్టమొదటి ఎత్తయిన స్వర్ణగోపురం పనులు యాదాద్రిలో పూర్తి కావొచ్చాయి.

19నుంచి 23 దాకా సంప్రోక్షణ..23న ప్రతిష్ఠా మహోత్సవం
యాదాద్రి, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి స్వర్ణ విమాన గోపురానికి మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమానికి ముహూర్తం ఖరారైంది. దేశంలోనే మొట్టమొదటి ఎత్తయిన స్వర్ణగోపురం పనులు యాదాద్రిలో పూర్తి కావొచ్చాయి. ఫిబ్రవరి 19 నుంచి 23వ తేదీ వరకు సంప్రోక్షణ కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 23న ఉదయం 11.54గంటలకు సుదర్శన లక్ష్మీ నారసింహ దివ్య స్వర్ణ విమాన గోపుర మహాకుంభాభిషేక ప్రతిష్ఠామహోత్సవం నిర్వహించనున్నారు.
కార్యక్రమాన్ని వానమామలై మఠం 31వ పీఠాధిపతి రామానుజ జీయర్‌స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించనున్నారు. కాగా, గోపురానికి బంగారం తాపడం అమర్చే పనులు ఈ నెల 19లోగా పూర్తి చేయనున్నారు. తాపడం అమర్చే పనులకు మొత్తం 60కిలోలకు పైగా బంగారాన్ని వినియోగించారు. సంప్రోక్షణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు హాజరుకానున్నారు.