SC Reservation: తెలంగాణలో వర్గీకరణ జరిగి తీరుతుంది
ABN, Publish Date - Jan 12 , 2025 | 04:04 AM
ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణను శాస్త్రీయ పద్ధతిలో అమలుచేయాలని మాదిగ మేధావుల వేదిక సదస్సు ముక్తకంఠంతో నినదించింది.
ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం
మాదిగ మేధావులు, ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సంఘీభావ సభ
ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు విద్యావంతులు, మేధావుల మద్దతు
ప్రొ. హరగోపాల్, లోక్‌సత్తా జేపీ, కె.శ్రీనివాస్ తదితరుల సంఘీభావం
మందకృష్ణ మాదిగ పోరాట స్ఫూర్తిని కీర్తించిన వక్తలు
హైదరాబాద్ సిటీ, జనవరి11(ఆంధ్రజ్యోతి): ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణను శాస్త్రీయ పద్ధతిలో అమలుచేయాలని మాదిగ మేధావుల వేదిక సదస్సు ముక్తకంఠంతో నినదించింది. మాదిగ మేధావుల వేదిక, మాదిగ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సంయుక్తంగా శనివారం ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆవరణలోని ఠాగూర్ ఆడిటోరియంలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అమలుకై మేధావుల సంఘీభావ సభ నిర్వహించింది. తెలంగాణ శాసనమండలి సభ్యుడు ప్రొ. కోదండరాం మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం అతి త్వరలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రిజర్వేషన్ల వర్గీకరణను అమలుచేస్తుందని చెప్పారు. సామాజికవేత్త హరగోపాల్ మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ కేవలం మాదిగల పోరాటం మాత్రమే కాదని, న్యాయంకోసం సాగిన మహత్తర ప్రజాస్వామిక ఉద్యమమని కొనియాడారు.
మందకృష్ణ మాదిగ దార్శనికత, పోరాట పటిమ ప్రజాస్వామిక పోరాటాలకు ఆదర్శమని ప్రశంసించారు. సీనియర్ పాత్రికేయులు, కె. శ్రీనివాస్ మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై కొందరు మాలనాయకులు చేస్తున్న విమర్శలు వింటుంటే, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆధిపత్యకులాలకు చెందిన వ్యక్తులు మాట్లాడిన తీరు గుర్తొస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కడగొట్టు బిడ్డకు మొదటిముద్ద దక్కాలి అన్న అంతర్గత న్యాయసూత్రం ఆధారంగా షెడ్యూల్ కులాలన్నింటికి రిజర్వేషన్ ఫలాలు సమంగా అందేలా వర్గీకరణ అమలుకావాలని ఆకాంక్షించారు. లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు సంఘీభావం ప్రకటించారు. రాజ్యాంగ విలువలను, బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆలోచనలను గౌరవించేవారెవ్వరూ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణను వ్యతిరేకించరని జేపీ ఉద్ఘాటించారు.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి గురువు ఎమ్మార్పీఎస్ ఉద్యమం
కవి నందిని సిధారెడ్డి మాట్లాడుతూ మాదిగలు లేనిదే తెలంగాణ జీవనం లేదన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి గురువు ఎమ్మార్పీఎస్ ఉద్యమమని అభివర్ణించారు. షెడ్యూల్ కులాల్లోని డక్కలి, చిందు, రెల్లి తదితర అనుబంధ కులాలన్నింటికి రిజర్వేషన్ ఫలాలు అందేలా ఏ,బీ,సీ,డీ వర్గీకరణ సాగాలని, దానికి జనాభా ప్రాతిపదికన కాకూడదని గజవెల్లి ఈశ్వర్ చిందు డిమాండ్ చేశారు. ఇవాళ్టికీ కొన్నిమాదిగ అనుబంధ కులాల్లో పదోతరగతి వరకు చదువుకోనివారున్నారని ప్రొ. సూరేపల్లి సుజాత తెలిపారు. కులాలు ఎవైనా, వర్గాలు ఎవైనా, న్యాయం పక్షాన నిలిచిన వారే మానవులవుతారని సామాజిక విశ్లేషకుడు ప్రొ. కె. నాగేశ్వర్ పేర్కొన్నారు. మాదిగల పోరాటంలో న్యాయం ఉంది కనుక తాను ఈ వేదిక ద్వారా సంఘీభావం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలోని బీసీలంతా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు మద్దతుగా ఉండాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కోరారు.
వర్గీకరణకు సంఘీభావం
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు మద్దతుగా ఉమ్మడి ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి చంద్రకుమార్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, కొండా నాగేశ్వర్, ప్రజాగాయని విమలక్క, పృద్వీరాజ్ యాదవ్, నల్గొండ గద్దర్ నర్సిరెడ్డి, తెలంగాణ విఠల్, ఇస్మాయిల్, కులనిర్మూలన పోరాట సమితి అధ్యక్షుడు అభినవ్ తదితరులు సదస్సులో మాట్లాడారు. ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ కాశీం సభాధ్యక్షత సాగిన ఈ కార్యక్రమంలో యువ కవులు, కళాకారులు మిట్టపల్లి సురేందర్, పసునూరి రవీందర్, నలిగంటి శరత్, బిస్మిల్లాఖాన్ అవార్డు గ్రహీత అందె భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jan 12 , 2025 | 04:04 AM