Share News

Mahabubabad: పీడీఎస్‌ బియ్యం కేసులో తొర్రూరు సీఐ అరెస్టు

ABN , Publish Date - Jan 07 , 2025 | 03:54 AM

సీజు చేసిన రేషన్‌ బియ్యం లారీని విడిచేందుకు రూ.5లక్షల లంచం డిమాండ్‌ చేసిన మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు సీఐ కె.జగదీశ్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.

Mahabubabad: పీడీఎస్‌ బియ్యం కేసులో తొర్రూరు సీఐ అరెస్టు

  • లారీని విడిచిపెట్టేందుకు రూ.5లక్షల లంచం డిమాండ్‌

  • ఫోన్‌లో రికార్డు చేసి ఏసీబీకి ఇచ్చిన బాధితులు

  • విచారించి సీఐను అదుపులోకి తీసుకున్న అధికారులు

తొర్రూరు (మహబూబాబాద్‌ జిల్లా), జనవరి 6 (ఆంధ్రజ్యోతి): సీజు చేసిన రేషన్‌ బియ్యం లారీని విడిచేందుకు రూ.5లక్షల లంచం డిమాండ్‌ చేసిన మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు సీఐ కె.జగదీశ్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. మహబూబాబాద్‌ జిల్లాలోని దంతాలపల్లిలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్‌ బియ్యం లారీని 2024 అక్టోబరు 2వ తేదీన పోలీసులు పట్టుకుని ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. లారీని విడిచిపెట్టేందుకు తనకు రూ.5 లక్షలు లంచం ఇవ్వాలని సీఐ జగదీశ్‌ డిమాండ్‌ చేయగా బాధితులు రూ.2లక్షలు చెల్లించారు. మరో 3 లక్షలు ఇవ్వాల్సిందేనని సీఐ పట్టుపట్టగా వారు విసుగుచెంది ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.


సీఐ జగదీశ్‌కు అనుమానం రావడంతో వారి నుంచి నేరుగా డబ్బులు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో మిగతా రూ.3 లక్షలు ఇవ్వాలని ఫోన్‌లో అడగగా బాధితులు రికార్డు చేసి ఏసీబీ అధికారులకు అందించారు. దాంతో సోమవారం ఏసీబీ అధికారులు తొర్రూరులో ఉన్న సీఐ ఇంట్లో సోదాలు నిర్వహించారు. బాధితుల వద్ద నుంచి తాను రూ.2 లక్షలు తీసుకున్నానని సీఐ జగదీశ్‌ విచారణలో తెలపడంతో అతన్ని అరెస్టు చేసి ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.

Updated Date - Jan 07 , 2025 | 03:54 AM