మసీదులు.. మందిరాల వద్ద రాజకీయాలా?
ABN , Publish Date - Apr 01 , 2025 | 11:19 PM
మసీదులు, మందిరాల దగ్గర బీఆర్‌ఎస్ నాయకులు రాజకీయం చేయడం సరికాదని డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్‌ఖాద్రి అన్నారు.

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి) : మసీదులు, మందిరాల దగ్గర బీఆర్‌ఎస్ నాయకులు రాజకీయం చేయడం సరికాదని డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్‌ఖాద్రి అన్నారు. రంజాన్ వేడుకల్లో భాగంగా ఈద్గా దగ్గర స్పెషల్ అధికారి పాలనలో మునిసిపల్ అధికారులు ముస్లింలకు కావల్సిన ఏర్పాట్లు చేశారన్నారు. ఇందులో భాగంగానే వేదిక దగ్గర ప్రోటోకాల్ పాటిస్తూ అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారుల పేరుతో కుర్చీలకు స్టిక్కర్లు వేశారని, దీనిపై మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేరు లేకపోవడంతో ఆయనకు ఇబ్బంది కలిగి ఉండవచ్చన్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు పదేళ్లలో ప్రతిపక్షాలను ఏనాడైనా గౌరవించారా? అని ప్రశ్నించారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారం పోవడంతో భవిష్యత్తు రాజకీయాల కోసం బీఆర్‌ఎస్ నాయకులు పండగల వద్ద తమను అవమానపరిచారంటూ రాజకీయాలు చేయడం సరికాదన్నారు. 15 నెలలుగా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి నాయకత్వంలో పాలమూరులో ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని, ఎవరి పనులు వాల్లు చేసుకుంటాన్నారని, ఈ ప్రశాంతతను దెబ్బతీసే ప్రయత్నం చేయరాదన్నారు. ఇకనైనా మసీదులు, మందిరాల వద్ద రాజకీయాలు చేయడం మానుకోవాలని సూచించారు. ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, మాజీ మునిసిపల్ చైర్మన్ ఆనంద్‌కుమార్ గౌడ్, నాయకుడు రాములుయాదవ్ పాల్గొన్నారు.
సంకలమద్ది శివారు హైవే రోడ్డు నిర్మాణ పనుల వద్ద లేని వేగనిరోధక సూచికలు
కనిపించని సూచికబోర్డులు
- తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా.. పట్టించుకోని హైవే అధికారులు
మూసాపేట, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి) : 44వ జాతీయ రహదారిపై చాలా చోట్ల సూచికబోర్టులు, వేగ నియంత్రణ సూచికల లేకపోవడంతో వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురువుతున్నారు. అడ్డాకుల, మూసాపేట, భూత్పూర్ మండలాల పరిధిలోని బలీదుపల్లి, అడ్డాకుల, కాటవరం, శాఖాపూర్, కందూరు, కొమిరెడ్డిపల్లి, వేముల స్టేజీ, సంకలమద్ది, మూసాపేట, జానంపేట, పోల్కంపల్లి, గాజులపేట, పోతులమడుగు, శేరిపల్లి(హెచ్) స్టేజీల వద్ద రోడ్డు వేగనిరోఽధక, ప్రమాద సూచికలు లేకపోవడంతో ఎదురుగా వచ్చే వాహనాలు అగుపించక ప్రమాదాలు జరుగుతున్నాయి. మరికొన్ని చోట్ల హైమాస్ట్ లైట్లు సరిగా వెలగకపోవడంతో వాహనదారులు నానా తంటాలు పడుతున్నారు. అడ్డాకుల అండర్‌పాస్ వంతెన దగ్గర సబ్ రోడ్డుపై వాహనాలు రాంగ్‌రూట్‌లో వెళ్లడం, కొమిరెడ్డిపల్లి, జానంపేట, అచ్చాయిపల్లి వద్ద రోడ్డు క్రాసింగ్‌లు దూరంగా ఉండటంతో వాహనదారులు రాంగ్‌రూట్‌లో వెళ్లి ప్రమాదాల బారిన పడుతున్నారు. అదే విధంగా వేముల స్టేజీ, జానంపేట, శేరిపల్లి (బి) వద్ద అండర్‌పాస్ వంతెన నిర్మాణ పనులు కొనసాగుతుండగా, నెలల తరబడి డ్రైనేజీకి సంబంధించిన కాల్వ గుంతలు పూడ్చకపోవడం, పనులు జరుగుతున్న ప్రదేశంలో సూచిక బోర్డులు, రెడ్ సింబల్స్ లేకపోవడం, మొర్రం, కంకర టిప్పర్లు రాంగ్‌రూట్‌లో వెళ్లడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికైనా హైవే అధికారులు స్పందింది వేగ నిరోధక బోర్డులతో పాటు సూచిక బోర్టులు ఏర్పాటు చేయడంతో పాటు రోడ్డు త్వరితగతిన పూర్తి చేయాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.