రూ.100 కోట్లు కృష్ణార్పణం
ABN , Publish Date - Apr 08 , 2025 | 11:10 PM
కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీన వైఖరి వల్ల రూ.100 కోట్లు నీటి పాలయ్యాయి. కృష్ణానదిలో.. శ్రీశైలం ప్రాజెక్టు ముందు భాగంలో.. వజ్రాల మడుగు వద్ద 2004లో నిర్మాణం చేపట్టిన టెయిల్‌పాండ్(సపోర్టు డ్యాం)కు నాసిరకం పనుల వల్ల గండి పడింది.

కృష్ణానదిలో వజ్రాల మడుగు వద్ద 2004లో టెయిల్‌పాండ్ నిర్మాణం
ఒక టీఎంసీ నీటిని నిల్వ ఉంచి రివర్స్ పంపింగ్ ద్వారా నిరంతరం విద్యుత్ ఉత్పత్తి చేయడమే లక్ష్యం
నాసిరకం పనులతో నిర్మాణం పూర్తి కాకుండానే గండి
అప్పటికే రూ.99 కోట్ల బిల్లులు చెల్లించిన ప్రభుత్వం
నాణ్యతను పట్టించుకోని కాంట్రాక్టర్‌పై చర్యలు శూన్యం
పదేళ్లుగా పట్టించుకోని గత ప్రభుత్వం
దానిని కూల్చి కొత్తగా నిర్మించాలని ప్రభుత్వానికి తాజాగా ఐఐటీ నిపుణుల బృందం నివేదిక
కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీన వైఖరి వల్ల రూ.100 కోట్లు నీటి పాలయ్యాయి. కృష్ణానదిలో.. శ్రీశైలం ప్రాజెక్టు ముందు భాగంలో.. వజ్రాల మడుగు వద్ద 2004లో నిర్మాణం చేపట్టిన టెయిల్‌పాండ్(సపోర్టు డ్యాం)కు నాసిరకం పనుల వల్ల గండి పడింది. దాంతో.. దీని ద్వారా ఒక టీఎంసీ నీటిని నిల్వ చేసి, ఆ నీటిని మళ్లీ జలాశయంలోకి మళ్లించి నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి చేయాలన్న లక్ష్యం నీరుగారిపోయింది. బాధ్యులపై ఇంత వరకు చర్యలు తీసుకోలేదు. కాగా, ఇటీవల హైదరాబాద్ నుంచి వచ్చిన ఐఐటీ నిపుణుల బృందం టెయిల్‌పాండ్‌ను పరిశీలించి, గండిని పూడ్చడం వల్ల మరోసారి కూలిపోయే ప్రమాదం ఉందని, దానిని పూర్తిగా తొలగించి కొత్తగా నిర్మించాలని ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది.
- దోమలపెంట (ఆంధ్రజ్యోతి)
శ్రీశైలం భూగర్భ జల విద్యుత్ కేంద్రం నిర్మాణం ఆసియా ఖండంలోనే అత్యద్భుతం. జపాన్ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ విద్యుత్ కేంద్రంలో పంపు మోడ్ పద్ధతిలో(నదిలోకి నీటి మళ్లించడం) ద్వారా నిరంతరం విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు శ్రీశైలం జలాశయానికి 14.500 కిలో మీటర్ల దూరంలో.. వజ్రాల మడుగు పరుపుల బండ దగ్గర టెయిల్‌పాండ్(సపోర్టు డ్యాం) నిర్మాణం కోసం 2003-04లో అప్పటి ఉమ్మడి ఆంధ్రపదేశ్ ప్రభుత్వం తలపెట్టింది. రూ.125 కోట్లతో ప్రతిపాదనలను సిద్ధం చే సింది. నిర్మాణ పనులు చేపట్టేందుకు టెండర్లు పిలువగా, గతంలో శ్రీశైలం ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రం నిర్మాణం కోసం సొరంగం(టన్నెల్) పనులు పూర్తి చేసిన పటేల్ కంపెనీ రూ.100 కోట్లకు టెండర్లు దక్కించుకుంది. 2004-05 సంవత్సరంలో పనులు ప్రాంభించింది. కృష్ణానదిలో.. సాగర్ బ్యాక్ వాటర్‌లో.. వజ్రాల మడుగు ప్రాంతంలో.. ఉమ్మడి మహబూబ్‌నగర్-కర్నూల్ జిల్లా సరిహద్దులో 512 మీటర్ల పొడవు, 170 మీటర్ల ఎత్తున ఈ టెయిల్‌పాండ్ నిర్మించడం వల్ల శ్రీశైలం జలాశయం వైపు ఒక టీఎంసీ నీరు నిల్వ ఉంటుంది. 2004లో నిర్మాణ పనులు చేపట్టిన పటేల్ కంపెనీ సీజన్లలో అడుగు భాగం నుంచి 70 మీటర్ల ఎత్తు వరకు నిర్మాణం చేపట్టింది. ప ర్యావరణ అనుమతులు లేవనే అటవీ శాఖ అభ్యంతరాలతో 2006 నుంచి 2009 వరకు పనులు ఆగిపోయాయి. సదరు కాంట్రాక్టు సంస్థ చేసిన పనులకు జెన్‌కో నుంచి రూ.36 కోట్లు చెల్లించారు. 2010లో అటవీ శాఖ ఇబ్బందులతో తాము పనులు పూర్తి చేయలేమని పటేల్ కంపెనీ కాంట్రాక్టును రద్దు చేసుకుంది. మిగతా పనులను పూర్తి చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన బీవీఎ్‌సఆర్ కన్‌స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 2014లో వర్క్స్ ప్రాంభించింది. 512 మీటర్ల పొడవులో ఉన్న టెయిల్‌పాండ్‌ను ఎడమ వైపునకు 170 మీటర్ల ఎత్తు వరకు 30 మీటర్ల పనులు పూర్తి చేశారు. మిగతా 168.3 మీటర్ల ఎత్తుకు కాంక్రీట్ పనులు జరుగుతున్న క్రమంలో 2015 నవంబరు 19న ఎడమ గట్టు విద్యుత్ కేంద్రంలో 3 యూనిట్లు, కుడి గట్టు విద్యుత్ కేంద్రంలో 4 యూనిట్ల ద్వారా(ఒక్కోటి 150 మెగా వాట్ల సామర్థ్యం) విద్యుత్ ఉత్పత్తి చేసి, 36 వేల క్యూసెక్కుల నీటిని బయటికి విడుదల చేయగా టెయిల్‌పాండ్‌కు గండి పడింది. అప్పటికే బీవీఎ్‌సఆర్ కన్‌స్ట్రక్షన్‌కు రూ.41 కోట్ల బిల్లులు చెల్లింపులు జరిగిపోయాయి. రూ.కోటి మాత్రమే చెల్లించాల్సి ఉన్నది. కాగా, టెయిల్‌పాండ్ అడుగు భాగం నుండే నాసిరకమైన మెటీరియల్ వాడుతూ పనులు చేస్తున్నారని స్థానిక కార్మిక నాయకులు ప్రశ్నించినా అప్పట్లో అధికారులు పెడచెవిన పెట్టడం వల్లే రూ.100 కోట్ల నిధులు బూడిదలో పోసిన పన్నీరయ్యాయని దోమలపెంట, ఈగలపెంట గ్రామాలకు చెందిన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిర్మాణం పూర్తి చేసి ఉంటే..
టెయిల్ పాండ్ నిర్మాణం పూర్తయి ఉంటే శ్రీశైలం జలాశయం వైపునకు ఒక టీఎంసీ నీరు నిల్వ ఉండేది. దీంతో పంపుమోడ్ పద్ధతిలో శ్రీశైలం జలాశయంలోకి నీటిని మళ్లించి, అదే నీటితో కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాలలో నిరంతరాయంగా విద్యుత్ ఉత్పాదన కొనసాగించే అవకాశం ఉండేది. ప్రస్తుత పరిస్థితుల్లో జలాశయాల్లో నీటి మట్టం తగ్గుముఖం పట్టినా నిల్వ ఉన్నఒక టీఎంసీ నీటితో కోతలు లేకుండా విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకునే పరిస్థితి ఉండేదని ఉద్యోగ విరమణ పొందిన ఇంజనీర్లు చెబుతున్నారు.
ఐఐటీ నిపుణుల పరిశీలన
నీటి కోతకు గురై, గండి పడిన టెయిల్ పాండ్‌ను పునఃర్నిర్మాణం చేసేందుకు ఇటీవల హైదరాబాద్ నుంచి ఐఐటీ నిపుణుల బృందం పరిశీలించి, ప్రభుత్వానికి డీపీఆర్ అందిం చింది. ప్రస్తుత పరిస్థితుల్లో పడిన గండిని పూడ్చటం వల్ల మరోసారి కూలిపోయే ప్రమాదం ఉన్నందున్న పూర్తిగా తొలగించి అదే స్థానంలో టెయిల్‌పాండ్ నిర్మాణం చేపట్టేందుకు నివేదికను సిద్ధం చేసినట్లు సమాచారం. త్వరలోనే నిర్మాణం కోసం అవసరమయ్యే నిధులను కేటాయించేందుకు తెలంగాణ ప్రభుత్వ సిద్ధంగా ఉన్నదని కొందరు ఇంజనీరు చెబుతున్నారు.
చర్యలు శూన్యం..
మొదటి నుంచి టెయిల్‌పాండ్ పనులు నాసిరకంగా జరుగుతున్నా పర్యవేక్షించాల్సిన సివిల్ ఇంజనీరింగ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం వల్ల కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు చేపట్టారు. డ్యాం మధ్యలో కాంక్రీట్‌కు బదులు నదిలో ఉండే పెద్దపెద్ద బండరాళ్లను నింపడంతో పనులు జరుగుతున్న సమయంలోనే గండి పడింది. ఇందుకు బాధ్యులు ఎవరు, నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టరా?, ఇంత జరుగుతున్నా వారిచ్చే మామూళ్లకు ఆశపడి కళ్లు మూసుకున్న అధికారులదా? అనేది తేలాల్సి ఉంది. సంఘటన జరిగి పదేళ్లు అవుతున్నా గత ప్రభుత్వం బాధ్యులపై చర్యలు తీసుకోలేదు.