స్వచ్ఛత ఏదీ?
ABN , Publish Date - Apr 12 , 2025 | 11:35 PM
పాలమూరులో స్వచ్ఛతకు బీటలు వారుతున్నాయి.

- ప్రజల మధ్యనే ప్లాస్టిక్ వ్యర్థాలు
- రైల్వేగేట్ నుంచి ఎక్స్‌రోడ్ వరకు చెత్తకేంద్రాలు
- మునిసిపాలిటీ అనుమతిలేకున్నా యథేచ్ఛగా నిర్వహణ
పాలమూరు, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి) : పాలమూరులో స్వచ్ఛతకు బీటలు వారుతున్నాయి. పట్టణ పరిశుభ్రతే లక్ష్యంగా మునిసిపల్ సిబ్బంది ప్రజల నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి ఊరి బయటకు తరలిస్తున్నారు. మైకులు, ఇతర ప్రచార సాధనాలతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు తిరుమల దేవునిగుట్ట (టీడీ గుట్ట) వార్డులో జనావాసాల మధ్యనే ప్లాస్టిక్ వ్యర్థాల కొనుగోలు కేంద్రాలు నెలకొల్పడం ఇబ్బందిగా మారింది. అక్కడ గుట్టలు, గుట్టలుగా పోగైన చెత్త రోగాలకు కారణమవుతోందని స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ పాలమూరు అనే నినాదాలతో పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచటానికి ఎమ్మెల్యే, కౌన్సిల్, మునిసిపల్ అధికారులు నిత్యం కృషి చేస్తున్నారు. అయినప్పటికీ టీడీగుట్ట రైల్వేగేట్ నుంచి రెండు సడాకుల (కోయిలకొండ ఎక్స్‌రోడ్డు) వరకు రోడ్డు వెంబడి వ్యాపారులు ప్లాస్టిక్ వ్యర్థాల కొనుగోలు కేంద్రాలను విచ్చలవిడిగా ప్రారంభించారు. వీరికి మునిసిపాలిటీ నుంచి ఎలాంటి అనుమతులు లేవు. రైల్వేగేట్‌కు పక్కనే జడ్పీహెచ్‌ఎస్ పాఠశాల ఉన్నప్పటికీ చెత్తను కుప్పలుగా పోస్తున్నారు. దీంతో విద్యార్థుల ఆరోగ్యం పాడవుతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఊరికి దూరంగా చెత్త, పాత ఇనుప సామగ్రి కొనుగోలు కేంద్రాలు ఉండాలి. కానీ కిందిస్థాయి నుంచి పైస్థాయి అధికారుల వరకు వ్యాపారుల నుంచి మామూళ్లు తీసుకుని వారిని పట్టించుకోవడం లేదు. కాలనీ యువకులు మాత్రం మునిసిపల్ కమిషనర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌కు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. చెత్తను వేరు చేయగా మిగిలిన వాటిని కాల్చే సమయంలో భరించలేని దుర్వాసన వస్తోంది. దీంతో క్యాన్సర్, టీబీ, ఇతర రోగాలు వస్తాయని కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైన చెత్తకేంద్రాలను ఊరి చివరకు తరలించాలని కోరుతున్నారు. ఈ మధ్య అటునుంచి వెళ్తున్న కలెక్టర్ ప్లాస్టిక్ సేకరణ కేంద్రాన్ని చూసి ఇదేమిటిని ప్రశ్నించారు. అయినప్పటికీ అక్కడి నుంచి కదలటం లేదని కాలనీవాసులు, యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.