Mahesh Kumar Goud: కేసీఆర్‌వి ఉత్తరకుమార ప్రగల్భాలు..
ABN , Publish Date - Feb 01 , 2025 | 03:43 AM
కాంగ్రెస్ ఏడాది పాలన, బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనపై చర్చ కోసం ఎన్నిసార్లు సవాలు విసిరినా స్పందించని కేసీఆర్.. ఫాంహౌ్‌సలో కూర్చుని ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నాడంటూ టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ వ్యాఖ్యానించారు.

ఆయన ఫాంహౌస్ కలలు మానుకోవాలి
కవితపై మరో లిక్కర్ స్కాంను పక్కదారి పట్టించేందుకే ఇదంతా: మహేశ్ గౌడ్
హైదరాబాద్, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ఏడాది పాలన, బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనపై చర్చ కోసం ఎన్నిసార్లు సవాలు విసిరినా స్పందించని కేసీఆర్.. ఫాంహౌ్‌సలో కూర్చుని ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నాడంటూ టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ వ్యాఖ్యానించారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో సాధించలేని ప్రగతిని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే సాధించడంతో దిక్కుతోచని కేసీఆర్.. వాస్తవ పరిస్థితులకు భిన్నంగా మాట్లాడుతున్నారని ఓ ప్రకటనలో విమర్శించారు. ఆయన ఫాంహౌస్ కలలు మానుకుంటే మంచిదన్నారు. రాష్ట్ర ప్రజలు ఫాంహౌస్ పాలనను కోరుకోవట్లేదని.. ఇందిరమ్మ రాజ్యం, ప్రజా పాలనను కోరుకుంటున్నారని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కూరుకుపోయిన కేసీఆర్ కుమార్తె కవితపై తాజాగా మరో లిక్కర్ స్కామ్ ఆరోణలు వచ్చాయని గుర్తుచేశారు. ఈ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే కేసీఆర్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. రానున్న స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీకి మరోమారు భంగపాటు తప్పదని జోస్యం చెప్పారు.
సీఎం రేవంత్ దెబ్బకు కేసీఆర్ మైండ్ బ్లాక్..
సీఎం రేవంత్‌రెడ్డి దెబ్బకు కేసీఆర్ మైండ్ బ్లాక్ అయి ఫాంహౌ్‌సకే పరిమితమయ్యారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఇన్ని రోజులూ కుంభకర్ణుడిలా ఫాంహౌ్‌సలో పడుకున్న ఆయన.. పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే బయటికొస్తానంటున్నారని విమర్శించారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బసవేశ్వర, సంగమేశ్వరల గురించి మాట్లాడుతున్న కేసీఆర్.. కాళేశ్వరం గురించి ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నించారు.