ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: కొత్త కంపెనీలు బీర్లు..

ABN, Publish Date - Jan 12 , 2025 | 03:36 AM

రాష్ట్రంలో త్వరలోనే కొత్త బ్రాండ్లతో కూడిన బీర్లు రానున్నాయి. ఈ మేరకు బీర్ల ఉత్పత్తి కోసం మద్యం కంపెనీలను ఆహ్వానించాలని.. దరఖాస్తులకు త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఫిబ్రవరిలో ఎంపిక పూర్తి.. మార్చిలో కొత్త సరుకు

  • దరఖాస్తులకు త్వరలో నోటిఫికేషన్‌

  • సంస్థల ఎంపికలో పారదర్శకత

  • నాణ్యత, ప్రమాణాలకు పెద్దపీట

  • ధరలపై కమిటీ సిఫార్సుల పరిగణన

  • ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్రలో పరిశీలన

  • పెంచాలనే బెదిరింపులకు తలొగ్గం

  • సర్కారును నియంత్రించాలని చూస్తే సహించేది లేదు: సీఎం రేవంత్‌

  • ఎక్పైజ్‌ శాఖపై ఉన్నతస్థాయి సమీక్ష

  • బీర్ల తయారీ నిలిపివేతపై కంపెనీలకు సీఎం పరోక్ష హెచ్చరికలు

  • గతంలోని బకాయిలు క్రమంగా చెల్లింపు

హైదరాబాద్‌, జనవరి 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో త్వరలోనే కొత్త బ్రాండ్లతో కూడిన బీర్లు రానున్నాయి. ఈ మేరకు బీర్ల ఉత్పత్తి కోసం మద్యం కంపెనీలను ఆహ్వానించాలని.. దరఖాస్తులకు త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరిలోపు కంపెనీలను ఖరారు చేసి, మార్చి నుంచే కొత్త బ్రాండ్లు షాపుల్లోకి వచ్చే విధంగా ముందుకెళ్లాలని నిర్ణయించింది. ప్రభుత్వం బకాయిలు చెల్లించడం లేదంటూ రాష్ట్రంలోని ప్రముఖ బీర్ల తయారీ కంపెనీ యునైటెడ్‌ బ్రూవరీస్‌(యూబీ) బీర్ల ఉత్పత్తిని నిలిపివేసిన విషయం తెలిసిందే. బీర్ల విక్రయాల్లో ఈ కంపెనీ దాదాపు 70శాతం వాటా కలిగి ఉండటంతో రాష్ట్రంలో త్వరలో బీర్ల కొరత ఏర్పడే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డి శనివారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఖజానాకు అధిక ఆదాయం కావాల్సినప్పుడల్లా గత ప్రభుత్వం ఽమద్యం ధరలు పెంచి వినియోగదారులపై భారం మోపింది. ప్రస్తుతం రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ ప్రభుత్వం ధరలు పెంచలేదు. పెంచాల్సిందే అంటూ మద్యం తయారీదారులు పేర్కొనడం.. ప్రభుత్వాన్ని నియంత్రించాలని చూడటమే అవుతుంది. అలాంటి బ్లాక్‌మెయిలింగ్‌ బెదిరింపులకు ప్రభుత్వం తలొగ్గదు’’ అని వ్యాఖ్యానించారు.


రాష్ట్రంలో మద్యం సరఫరా చేసేందుకు ముందుకొచ్చే కంపెనీలను ఎంపిక చేసేందుకు పారదర్శక విధానం పాటించాలని, దరఖాస్తులను నిశితంగా పరిశీలించాలని, ప్రధానంగా కంపెనీల నాణ్యత ప్రమాణాలనూ పరిగణనలోకి తీసుకోవాలని, ఎలాంటి వివాదాలకు తావివ్వొద్దని అధికారులను సీఎం ఆదేశించారు. కొత్త కంపెనీల నుంచి దరఖాస్తులు తీసుకునేందుకు వెంటనే నోటిఫికేషన్‌ జారీ చేయాలని, నెల రోజుల గడువు ఇవ్వాలని సూచించారు. కొత్త బ్రాండ్లు సరఫరా చేసేందుకు సులభతర వాణిజ్య విధానం అనుసరించాలని చెప్పారు. ఇటీవల యునైటెడ్‌ బేవరేజెస్‌ కంపెనీ బీర్ల రేట్లను 33.1 శాతం పెంచాలని ఒత్తిడి చేసిందని సీఎం దృష్టికి అధికారులు తీసుకువచ్చారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. కంపెనీల ఒత్తిడికి తలొగ్గేది లేదని పరోక్షంగా యూబీ కంపెనీని ఉద్దేశించి పేర్కొన్నట్లు తెలిసింది. ప్రత్యామ్నాయ అవకాశాలపై దృష్టి పెట్టాలని అన్నారు.


ఏపీ, మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న బీర్ల ధరలను పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. హైకోర్ట్‌ రిటైర్డ్‌ జడ్జి నేతృత్వంలోని త్రిసభ్య ధరల నిర్ణయ కమిటీ (ప్రైస్‌ ఫిక్సేషన్‌ కమిటీ) నివేదిక ఆధారంగా ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. గత ఏడాదిగా ఎక్సైజ్‌ శాఖకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు క్రమంగా క్లియర్‌ చేయాలని ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 9 మద్యం, 6 బీర్ల తయారీ కంపెనీలున్నాయి. మొత్తం 51 కంపెనీలు 1031 రకాల మద్యాన్ని తెలంగాణ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ (టీజీబీసీఎల్‌)కు సరఫరా చేస్తున్నాయి. కొత్త కంపెనీలను ఆహ్వానించడంతో మరిన్ని కంపెనీలు, మరిన్ని కొత్త మద్యం బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, ఎక్సైజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ, కమిషనర్‌ హరికిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2025 | 03:36 AM