నవ వధువు బలవన్మరణం
ABN , Publish Date - Apr 14 , 2025 | 01:02 AM
వివాహమైన 25రోజులకే ఓ నవ వధువు బలవన్మరణానికి పాల్పడింది. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో ఈ విషాదం నెలకొంది.

పెళ్లయిన 25 రోజులకే చౌటుప్పల్‌లో విషాదం
చౌటుపల్ రూరల్, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): వివాహమైన 25రోజులకే ఓ నవ వధువు బలవన్మరణానికి పాల్పడింది. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో ఈ విషాదం నెలకొంది. సీఐ మన్మధకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి మండలం అనాజిపురానికి చెందిన జెల్లా గాయత్రి (19)కి చౌటుప్పల్ పద్మశాలి కాలనీకి చెందిన సంతో్‌షకుమార్‌తో మార్చి 16వ తేదీన వివాహమైంది. భర్త సంతో్‌షకుమార్ ఓ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. సంతోష్‌కుమార్ ఉదయం సమయంలో విధులకు వెళ్లగా, అత్తమామలు బంధువుల వివాహానికి వెళ్లారు. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి తలుపులు వేసి ఉండటంతో పోలీసులకు సమాచారమిచ్చారు. తలుపులు ధ్వంసంచేసి లోపలికి వెళ్లి చూడగా గాయత్రి చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఉండటాన్ని గుర్తించారు. అప్పటికే ఆమె మృతిచెందటంతో మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భర్త సంతో్‌షకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. గాయత్రి చిన్న వయసులోనే తల్లిదండ్రులు మృతిచెందటంతో మేనమామ వద్దే పెరిగింది. గాయత్రి ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.