Share News

Bhu Bharathi Pass Books: ఆ 4 మండలాల్లో రెవెన్యూ సదస్సులు

ABN , Publish Date - Apr 16 , 2025 | 05:59 AM

భూ భారతి అమలులో ఉన్నప్పటికీ, పాస్‌ పుస్తకాల మార్పు లేదని సీసీఎల్‌ఏ కార్యాలయ వర్గాలు తెలిపాయి. జూన్‌ తర్వాతే మార్పులు జరగవచ్చు.

Bhu Bharathi Pass Books: ఆ 4 మండలాల్లో రెవెన్యూ సదస్సులు

  • ఈనెల 17 నుంచి దరఖాస్తులు

  • కొత్త చట్టం ప్రకారం పరిష్కారం

  • తొలిరోజు సాంకేతిక సమస్యలపై సీసీఎల్‌ఏ సమీక్ష

  • 15 మందితో వార్‌ రూమ్‌.. 8 మందితో హెల్ప్‌ లైన్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): భూ భారతి చట్టాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న నాలుగు మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి.. ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు అవసరమైన ఏర్పాట్లు అధికారులు చేశారు. దరఖాస్తుల నమూనాలను ఖమ్మం, నారాయణపేట, కామారెడ్డి, ములుగు జిల్లాల కలెక్టర్లకు పంపారు. బుధవారం వారు వాటిని ముద్రించి ఎంపిక చేసిన నాలుగు మండలాలకు పంపనున్నారు. అనంతరం, ఈనెల 17 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తారు. వాటిలోనే దరఖాస్తులను స్వీకరించనున్నారు. వీటిలో వచ్చే ఫిర్యాదులకు కొత్త చట్టం నిబంధనల ప్రకారం పరిష్కారం చూపనున్నారు. ఇక, భూ భారతి చట్టం, నిబంధనలపై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు.

తొలిరోజు రిజిస్ట్రేషన్లపైనే దృష్టి

భూ భారతి అమలును ప్రయోగాత్మకంగా చేపట్టిన నాలుగు మండలాల్లో మొదటి రోజు రిజిస్ట్రేషన్లపైనే దృష్టిసారించారు. నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్లు చేయడానికి ఏమైనా సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయా అనే కోణంలో సీసీఎల్‌ఏ నుంచి సమీక్షిస్తున్నారు. నారాయణపేట జిల్లా మద్దూరు, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, కామారెడ్డి జిల్లా లింగంపేట, ములుగు జిల్లా వెంకటాపురం మండలాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను సీసీఎల్‌ఏ అధికారులు స్వయంగా పర్యవేక్షించారు. రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌, అప్పీల్‌, రివిజన్‌, నాలా తదితర సేవలకు సంబంధించి అన్ని పత్రాలూ సక్రమంగా ఉంటే జాప్యం లేకుండా వెంటనే పని పూర్తయ్యేలా ఏర్పాట్లు చేశారు. వీటితోపాటు సమాచారం కోసం లాగిన్‌ అయ్యే వారికి ఈ-చలానా, ఈసీ వివరాలు, నిషేధిత భూముల జాబితా, భూ హక్కుల రికార్డు, మార్కెట్‌ విలువల వివరాలు, రిజిస్ట్రేషన్‌ దస్తావేజులు అందుబాటులో ఉంచారు.


అయితే, ప్రస్తుతానికి ఈసీ, అప్పీల్‌, రివిజన్‌కి సంబంధించిన సేవలు ఇంకా అందుబాటులోకి రాలేదని చూపుతోంది. గతానికి భిన్నంగా.. సాఫ్ట్‌వేర్‌ లోపాలను పరిష్కరించేందుకు రెండు, మూడు రోజులకోసారి అప్‌డేట్‌ అయ్యేలా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా కొన్ని సమస్యలూ గుర్తించారు. పోర్టల్‌ అధికారిక లాగిన్‌ను మండల స్థాయిలో ఆపరేటర్‌, తహసీల్దార్‌కు ఇచ్చారు. వీరితోపాటు ఆర్డీవో, అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ), కలెక్టర్‌కూ ఉంది. వీరిలో ఆపరేటర్‌ ఒక్కరే తాత్కాలిక ఉద్యోగి. అయితే, రెవెన్యూలో రెగ్యులర్‌ ఉద్యోగులుగా ఉన్న సీనియర్‌ అసిస్టెంట్‌, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లకు లాగిన్‌ ఇస్తే.. తహసీల్దార్‌ బిజీగా ఉన్నా రెగ్యులర్‌ ఉద్యోగులు పెండింగ్‌ కేసులు పర్యవేక్షించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. సోమవారం సీఎం నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో కూడా తాత్కాలిక ఉద్యోగుల చేతిలో ఉండే లాగిన్‌ను రెగ్యులర్‌ ఉద్యోగులకు ఇవ్వాలని ప్రతిపాదించారు. దీంతోపాటు మరో సమస్యను తహసీల్దార్లు లేవనెత్తారు. రైతు భరోసా అమలు చేస్తున్న వ్యవసాయ శాఖ అధికారులకు ఇచ్చిన లాగిన్‌లో ఏ రైతుకు రాష్ట్రంలో ఎన్ని జిల్లాల్లో ఎంత భూమి ఉందో తెలుసుకునే అవకాశం ఉందని.. తహసీల్దార్లకు మాత్రం ఆ మండలం వరకే వివరాలు తెలిసేలా చేశారని, పూర్తి వివరాలు తెలిస్తే ఈడబ్ల్యూఎస్‌ ధ్రువీకరణ వంటి విషయాల్లో ఉపయుక్తంగా ఉంటుందని ప్రతిపాదించారు.

15 మందితో వార్‌ రూమ్‌

భూ భారతి చట్టం, నిబంధనలు, గ్రామ పాలనాధికారుల వ్యవస్థ, పోర్టల్‌.. ఈ నాలుగు అంశాలపై పాలనపరమైన నిర్ణయాలు, మార్పులు, చేర్పులు చేసేందుకు 15 మందితో వార్‌రూమ్‌ ఏర్పాటు చేశారు. భూ భారతిని ప్రజల్లోకి తీసుకెళ్లడం దగ్గర నుంచి అమలు వరకు ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తున్నారు. మరో 8 మంది సభ్యుల బృందంతో హెల్ప్‌ సెంటర్‌ కూడా సీసీఎల్‌ఏ పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. పోర్టల్‌ లాగిన్‌ సంబంధిత సమస్యలు, సాంకేతిక ఇబ్బందులు, క్షేత్రస్థాయి అధికారులు, ప్రజల సందేహాలను నివృత్తి చేయడానికి ఈ సెంటర్‌ పని చేస్తుంది. ఇందుకు 040-2931 3999 నంబరును కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.


పాత పద్ధతిలోనే పాస్‌ పుస్తకాలు

భూ భారతి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పాస్‌ పుస్తకాలు మళ్లీ మారుస్తారనే చర్చ జరుగుతోంది. అయితే, ఈ అంశంపై ప్రస్తుతానికి ఎటువంటి మార్పు లేదని సీసీఎల్‌ఏ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఏమైనా మార్పులు చేయాలనుకుంటే జూన్‌ తర్వాతే సర్కారు విధాన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు. భూ భారతి హక్కుల రికార్డులో నమోదైన వారందరికీ ప్రభుత్వం తనంత తానుగా కానీ, భూ యజమాని దరఖాస్తు చేసినా రూ.300 ఫీజు తీసుకుని పాస్‌ పుస్తకాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆర్వోఆర్‌లో యాజమాన్య హక్కు కలిగిన వ్యక్తి లైసెన్స్‌డ్‌ సర్వేయర్‌తో తన భూమిని సర్వే చేయించుకుని, మ్యాప్‌ తయారు చేయించుకుంటే.. మండల సర్వేయర్‌ పరిశీలన అనంతరం తహసీల్దార్‌ ఆమోదంతో పాస్‌ పుస్తకంతోపాటు సర్వే మ్యాప్‌ను ముద్రించి ఇస్తారు. అలాగే, పాస్‌ పుస్తకం, ఆర్వోఆర్‌ల్లోని వివరాల్లో వ్యత్యాసం ఉందని, సరి చేయాలని దరఖాస్తు పెట్టుకుంటే కూడా రికార్డులను పరిశీలించి తహసీల్దార్‌ కొత్త పాస్‌ పుస్తకం జారీ చేస్తారు. ఒకవేళ, పాస్‌ పుస్తకాల జారీలో తహసీల్దార్‌ నిర్ణయంపై అభ్యంతరాలుంటే ఆర్డీవోకు, ఆపైన కలెక్టర్‌కు అప్పీల్‌ చేసుకోవచ్చు.

Updated Date - Apr 16 , 2025 | 06:01 AM