Former Police Prabhakar Rao: అరెస్టు చేయరాదని ఉత్తర్వులిస్తే వారంలో వచ్చేస్తా
ABN , Publish Date - Apr 16 , 2025 | 03:13 AM
ఫోన్‌ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావు, అరెస్ట్ చేయరాదని హైకోర్టును కోరుతూ మధ్యంతర ఉత్తర్వులు కోరారు. అరెస్ట్ కాకపోతే వారంలో భారత్‌కు వస్తానని హామీ ఇచ్చారు

హైకోర్టును కోరిన ఫోన్‌ట్యాపింగ్ నిందితుడు ప్రభాకర్‌రావు
హైదరాబాద్, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ట్యాపింగ్ కేసులో తనను అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇస్తే వారంలో ఇండియా వచ్చేస్తానని ప్రధాన నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ ఇప్పటికే దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌కు అనుబంధంగా మరో దరఖాస్తు చేశారు. ఆ దరఖాస్తుపై జస్టిస్ జే శ్రీనివాసరావు ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ప్రభాకర్‌రావు తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదిస్తూ.. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న ఐన్యూస్ ఎండీ శ్రవణ్‌రావును అరెస్ట్ చేయకుండా సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. అదేతరహాలో ప్రభాకరరావును సయితం అరెస్టు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఆయన దర్యాప్తు అధికారి ఎదుట హాజరుకావడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లూథ్రా వాదిస్తూ.. ప్రభాకర్‌రావు పాస్‌పోర్ట్ రద్దయిందని, రెడ్ కార్నర్ నోటీసు జారీఅయిందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఆయన వారంలో తిరిగి వస్తానని ఎలా చెబుతారన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. పిటిషనర్ మధ్యంతర పిటిషన్ తమ రికార్డుల్లోకి రాలేదని తెలిపింది. వచ్చిన తర్వాత వాదనలు వింటామని పేర్కొంటూ విచారణను 25కు వాయిదా వేసింది.