Harish Rao: హరీశ్ అరెస్ట్ వద్దన్న ఆదేశాలను తొలగించండి
ABN, Publish Date - Jan 10 , 2025 | 04:50 AM
ఫోన్‌ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న హరీశ్‌రావును అరెస్ట్ చేయరాదంటూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలంటూ హైకోర్టులో పంజాగుట్ట పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు.
హైకోర్టులో పంజాగుట్ట పోలీసుల కౌంటర్
హైదరాబాద్, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న హరీశ్‌రావును అరెస్ట్ చేయరాదంటూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలంటూ హైకోర్టులో పంజాగుట్ట పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. హరీశ్‌రావుకు వ్యతిరేకంగా ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, దర్యాప్తు ప్రారంభ దశలోనే ఉందని.. ఈ దశలో న్యాయస్థానం జోక్యం చేసుకోవడం వల్ల దర్యాప్తునకు తీవ్ర విఘాతం కలుగుతుందని పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట నుంచి హరీశ్‌రావుపై పోటీ చేసిన జీ చక్రధర్‌గౌడ్ అనే వ్యక్తి..
సిద్దిపేట నియోజకవర్గంలో తాను పలు సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు హరీశ్‌రావు తనపై కక్షగట్టి క్రిమినల్ కేసుల్లో ఇరికించారని, తన ఫోన్ ట్యాపింగ్ చేయించారని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు కేసును కొట్టేయాలని అభ్యర్థిస్తూ హరీశ్‌రావు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. హరీశ్‌రావును అరెస్ట్ చేయరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా గురువారం ఈ పిటిషన్ జస్టిస్ కే లక్ష్మణ్ ధర్మాసనం ఎదుటకు వచ్చింది. అయితే, విచారణకు సమయం లేకపోవడంతో శుక్రవారానికి వాయిదా పడింది.
Updated Date - Jan 10 , 2025 | 04:50 AM