కాంగ్రెస్, బీజేపీ బాహాబాహీ.. నలుగురికి రిమాండ్
ABN, Publish Date - Jan 09 , 2025 | 04:35 AM
బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల వద్ద మంగళవారం జరిగిన దాడులకు సంబంధించి పోలీసులు 11 మంది నిందితులను బుధవారం న్యాయస్థానంలో హాజరుపరిచారు.
అఫ్జల్‌గంజ్/మంగళ్‌హాట్, ములుగు, నిజామాబాద్ అర్బన్, హైదరాబాద్, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల వద్ద మంగళవారం జరిగిన దాడులకు సంబంధించి పోలీసులు 11 మంది నిందితులను బుధవారం న్యాయస్థానంలో హాజరుపరిచారు. వీరిలో ఆబిడ్స్ ఇన్‌స్పెక్టర్‌పై దాడి చేసిన రహమత్ బాబా, హాజీ, మహ్మద్ ఫయాజ్, మంజునాథ్ అనే నలుగురిని కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. మిగిలిన ఏడుగురికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఘటన జరిగిన ప్రదేశంలోసి సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా పోలీసులు మరో 30 మంది నిందితులను కూడా గుర్తించారు. వాళ్లని కూడా అదుపులోకి తీసుకునే అవకాశముంది. కాగా, బీజేపీ కార్యాలయంపై దాడికి నిరసనగా ములుగు, నిజామాబాద్‌లో బీజేపీ శ్రేణులు బుధవారం ఆందోళనలు చేశాయి. ములుగులో రాస్తారోకో చేసిన బీజేపీ శ్రేణులు.. మంత్రి సీతక్క క్యాంపు కార్యాలయం ముట్టడికి చేసిన యత్నాన్ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ప్రతిగా కాంగ్రెస్ శ్రేణులు బీజేవైఎం నేత నాగరాజుకు చెందిన దుకాణాన్ని ధ్వంసం చేశాయి.
ప్రభుత్వాన్ని నివేదిక అడగండి..గవర్నర్‌కు కిషన్‌రెడ్డి లేఖ
రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణ నిష్పక్షపాతంగా జరిగేలా జోక్యం చేసుకోవాలని కోరుతూ కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు బుధవారం లేఖ రాశారు. బీజేపీ కార్యాలయంపై దాడి ఘటనపై ప్రభుత్వం నుంచి నివేదిక కోరాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ యువనేతలు చేసిన దాడిలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, బీబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, దళిత మోర్చా నాయకుడు నందు గాయపడ్డారని వివరించారు. పోలీసులు అక్కడే ఉన్నా ప్రేక్షకపాత్ర పోషించారని, దాడికి ముందు 200 మంది యువకులు సమావేశం అయిన విషయం తెలిసి కూడా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు.
Updated Date - Jan 09 , 2025 | 04:35 AM