Ponguleti: మూసీ ప్రక్షాళనకు సహకరించండి
ABN , Publish Date - Jan 25 , 2025 | 04:22 AM
హైదరాబాద్‌లోని మూసీనది ప్రక్షాళన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, కేంద్రం నుంచి నిధులు ఇప్పించి సహకరించాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ఖట్టర్‌ను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కోరారు.

కేంద్ర మంత్రి మనోహర్‌లాల్‌కు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి
హైదరాబాద్, కరీంనగర్, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని మూసీనది ప్రక్షాళన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, కేంద్రం నుంచి నిధులు ఇప్పించి సహకరించాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ఖట్టర్‌ను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కోరారు. శుక్రవారం కరీంనగర్‌లో స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు వరంగల్, కరీంనగర్, ఖమ్మం నగరాల్లో 65 లక్షల మంది, రాష్ట్రవ్యాప్తంగా 81.60 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కేంద్రం నుంచి ఇళ్లను మంజూరు చేయించుకోలేకపోయిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద తెలంగాణకు 8 శాతం ఇళ్లు ఇవ్వాల్సి ఉండగా కేవలం 0.7% మాత్రమే వచ్చాయన్నారు. రాష్ట్రానికి రావాల్సిన 8ు ఇళ్లను మంజూరు చేయాలని కోరారు.
హైదరాబాద్‌లో యూపీఏ ప్రభుత్వం 68 కిలోమీటర్ల మెట్రో రైలు మార్గాన్ని ఏర్పాటు చేసిందని, పీపీఏ పద్ధతిలో మరో 75 కిలో మీటర్ల మెట్రోలైన్ విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినందున కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయాలన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటా మేరకు సంక్షేమ పథకాలు, నిధులు తెచ్చేందుకు కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించాలని కోరారు. అంతకు ముందు రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంగా శుక్రవారం శంషాబాద్ విమానాశ్రయంలో కేంద్ర మంత్రి మనోహర్‌లాల్‌ఖట్టర్‌ను మంత్రికి పొంగులేటి స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఇద్దరు కలిసి కరీంనగర్ జిల్లా పర్యటనకు వెళ్లారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత నిర్వహించిన సమావేశంలో మంత్రి పొంగులేటి.. గృహ నిర్మాణ శాఖ, గృహ నిర్మాణ సంస్థల అంశాలను ప్రస్తావించారు.
‘‘తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకనుగుణంగా గత పదేళ్లలో పేదల ఇండ్ల నిర్మాణం జరగలేదు. ఇండ్ల నిర్మాణానికి ప్రజల నుంచి భారీ ఎత్తున డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకం (2.0) కింద కనీసం 20 లక్షల ఇండ్లు మంజూరు చేయండి’’అని మంత్రి పొంగులేటి కేంద్ర మంత్రి ఖట్టర్‌కు విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం గృహనిర్మాణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని తెలిపారు. కాంగ్రె స్ ప్రభుత్వం పేదల ఇండ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. వచ్చే నాలుగేళ్లలో 20 లక్షల ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 26 జిల్లాల్లోని 6,867 గ్రామాలను ఇటీవల అర్బన్ డెవల్‌పమెంట్ అఽథారిటీ కిందికి తెచ్చామని, వాటిని కేంద్ర ప్రభుత్వ పోర్టల్‌లో చేర్చాలని కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Virender Sehwag: విడాకులు తీసుకోనున్న వీరేంద్ర సెహ్వాగ్..
Kaleshwaram Commission: నేటి కాళేశ్వరం విచారణ.. అత్యంత కీలకం