Jayashankar University: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ నుంచి
ABN , Publish Date - Apr 14 , 2025 | 04:58 AM
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఐదు ఉత్తమ మొక్క జొన్న హై బ్రిడ్ రకాలను విడుదల చేసిందని వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ఆదివారం తెలిపారు.

ఐదు ఉత్తమ మొక్క జొన్న హైబ్రిడ్ రకాలు విడుదల
రాజేంద్రనగర్, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఐదు ఉత్తమ మొక్క జొన్న హై బ్రిడ్ రకాలను విడుదల చేసిందని వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ఆదివారం తెలిపారు. ఇటీవల భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) ఆధ్వర్యంలో తమిళనాడులోని కోయంబత్తూరులో నిర్వహించిన అఖిల భారత మొక్క జొన్న పరిశోధన సమన్వయ సమావేశంలో.. దక్కన్ హైబ్రిడ్ మక్కా 144, డీహెచ్‌ఎం 182, డీహెచ్‌ఎం 193, డీహెచ్‌ఎం 206, డీహెచ్‌ఎం 218 రకాలను విడుదల చేసినట్లు ఆయన చెప్పారు.
అందులో డీహెచ్‌ఎం 144 (తెలంగాణ మక్కా-6) రకంలో అధిక పిండి పదార్థాలు ఉండటం వల్ల ఇథనాల్ ఉత్పత్తికి బాగా అనుకూలంగా ఉంటుందని తెలిపారు. అదే విధంగా డీహెచ్‌ఎం 206 (తెలంగాణ మక్కా-3) మెట్ట సాగుకు అనుకూలమైందని, ఎండు తెగులును సమర్థవంతంగా తట్టుకుంటుందని తెలియజేశారు. ప్రస్తుతం రైతాంగానికి అందుబాటులో ఉన్న వివిధ మొక్క జొన్న వంగడాలతో పోలిస్తే డీహెచ్‌ఎం అన్ని విధాలుగా మేలైందిగా పరిశోధనలో తేలినట్లు చెప్పారు. ఈ రకాలను రాబోయే కాలంలో రైతాంగం ఉపయోగించుకోవాలని కోరారు. తమ విశ్వవిద్యాలయం నుంచి మొత్తంగా 24 మొక్క జొన్న హైబ్రిడ్ రకాలు విడుదలయ్యాయని, వాటిలో 16 రకాలను ఇటీవల కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ అధికారిక ప్రకటిత రకాలుగా గుర్తించిందని ప్రొఫెసర్ జానయ్య తెలిపారు.