Uttam Kumar Reddy: ఉగాదికి హుజూర్‌నగర్‌లో సన్న బియ్యం పథకం ప్రారంభం

ABN, Publish Date - Mar 26 , 2025 | 05:00 AM

రేషన్‌ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ఉగాది రోజున, మార్చి 30న, సీఎం రేవంత్‌ రెడ్డి హుజూర్‌నగర్‌లో ప్రారంభించనున్నారని పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం తర్వాత సీఎం రామస్వామి గట్టు వద్ద మోడల్‌ కాలనీ ఇళ్ల నిర్మాణం పరిశీలిస్తారు.

 Uttam Kumar Reddy: ఉగాదికి హుజూర్‌నగర్‌లో సన్న బియ్యం పథకం ప్రారంభం
  • సీఎం రేవంత్‌ చేతుల మీదుగా కార్యక్రమం

  • అనంతరం భారీ బహిరంగ సభ: మంత్రి ఉత్తమ్‌

హైదరాబాద్‌, హుజూర్‌నగర్‌ , మార్చి 25 (ఆంధ్రజ్యోతి): రేషన్‌ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ఉగాది రోజు (ఈ నెల 30)న సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభిస్తారని పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. ఆ రోజు సాయంత్రం 5 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచిసీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు హెలికాప్టర్‌లో బయలుదేరి సాయంత్రం 5.45 గంటలకు హుజూర్‌నగర్‌లోని రామస్వామి గట్టు వద్ద హెలీప్యాడ్‌లో దిగుతారు. అనంతరం ఆ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న 2,160 మోడల్‌ కాలనీ ఇళ్లను సీఎం పరిశీలిస్తారు. అక్కడినుంచి రోడ్డు మార్గంలో పట్టణంలోని ఫణిగిరి గట్టుకు వెళ్లే దారిలోని రాజీవ్‌ ప్రాంగణానికి 6.15 గంటలకు చేరుకుంటారు. ఉగాది పర్వదినం సందర్భంగా బహిరంగ సభలోనే సన్న బియ్యం పంపిణీ పథకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారు. 6.15 గంటల నుంచి 7.30 గంటల వరకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 7.30 గంటలకు హుజూర్‌నగర్‌ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 9.45 గంటలకు హైదరాబాద్‌కు వెళతారు. ఈ సభలో మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.


సభ ఏర్పాట్ల పరిశీలన

పట్టణంలో ఈ నెల 30న నిర్వహించనున్న సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభాస్థలాన్ని, పట్టణంలోని సభా ప్రాంగణం, హెలీప్యాడ్‌ స్థలం, హౌసింగ్‌ మోడల్‌ కాలనీలను పౌర సరఫరాల శాఖ జాయింట్‌ సెక్రటరీ ప్రియాంక, కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌పవార్‌లు మంగళవారం పరిశీలించారు. సీఎం సభకు సుమారు 50 వేల మంది వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వేసవి అయినందున సభకు వచ్చే వారికి చల్లని నీరు, మజ్జిగ ప్యాకెట్లు ఏర్పాటు చేయాలన్నారు. ఫణిగిరి గట్టు వద్ద హెలీకాప్టర్‌ దిగే స్థలంలో విద్యుత్‌ లైన్లు, స్తంభాలు తొలగించాలని ఆదేశించారు.

Updated Date - Mar 26 , 2025 | 05:01 AM