ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

New Year: 500 పాయింట్లు ఊదేశారు.. 900 కోట్లు తాగేశారు

ABN, Publish Date - Jan 02 , 2025 | 04:42 AM

రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఏడాది సంబరాలకు మద్యం భారీగా కొనుగోలు చేసేశారు. మద్యం ప్రియులు రికార్డు స్థాయిలో కొనుగోళ్లు చేశారు. డిసెంబరు నెల చివరి 9 రోజుల్లో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. 9 రోజుల్లోనే రూ.2166 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి.

  • మద్యం అమ్మకాల్లో కొత్త ఏడాది జోష్‌

  • హైదరాబాద్‌లో డ్రంకెన్‌ డ్రైవ్‌లో బీఏసీ కౌంట్‌ 500

  • దాటిన కేసులు 9.. గరిష్ఠంగా 550 కౌంట్‌

  • డిసెంబరు చివరి రెండ్రోజుల్లో 900 కోట్ల విక్రయాలు!

హైదరాబాద్‌/సిటీ, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఏడాది సంబరాలకు మద్యం భారీగా కొనుగోలు చేసేశారు. మద్యం ప్రియులు రికార్డు స్థాయిలో కొనుగోళ్లు చేశారు. డిసెంబరు నెల చివరి 9 రోజుల్లో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. 9 రోజుల్లోనే రూ.2166 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. అంటే మందుబాబులు ఎంతలా ‘స్టాగేశారో’ అర్థం చేసుకోవచ్చు! వందలాది ఫాంహౌ్‌సలు, హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లు, పబ్‌లు, క్లబ్‌ల్లో నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. యువత మద్యం మత్తులో ఉర్రూతలూగారు. మందు, విందుతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. రాష్ట్రవ్యాప్తంగా డిసెంబరు నెల చివరి 9 రోజుల్లో రూ.2166 కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా.. ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే రూ.757.2 కోట్ల విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్‌ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ఇక డిసెంబరులో రాష్ట్రంలో తలసరి మద్యం వినియోగం రూ.1250గా నమోదైంది. అంటే రాష్ట్ర జనాభా దాదాపు 4 కోట్లు ఉంటే.. ఒక్క నెలలో రూ.5 వేల కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. మద్యం విక్రయాల్లో ఇదో కొత్త రికార్డు అని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.


ఎక్పైజ్‌ అధికారవర్గాలు తెలిపిన అంచనా గణాంకాల ప్రకారం డిసెంబరు 31 వరకు ఎక్పైజ్‌ శాఖ రూ.3600 కోట్ల విలువైన మద్యాన్ని దుకాణాలకు విక్రయించింది. గరిష్ఠ విక్రయ ధర (ఎంఆర్‌పీ)పై ప్రభుత్వం 20 శాతం తక్కువకు లైసెన్స్‌ షాపులకు సరఫరా చేస్తుంది. వారి కమిషన్‌ను లెక్కిస్తే రూ.720 కోట్లు అవుతుంది. అంటే డిసెంబరులో మొత్తం మద్యం విక్రయాలు రూ.4320 కోట్లు జరిగాయి. కొత్త సంవత్సరం వేడుకల్లో సహజంగానే ఏటా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణా జరుగుతుంది. అలాగే రాష్ట్రంలోని మద్యం తయారీ కేంద్రాల నుంచి ప్రభుత్వ అనుమతుల్లేకుండా మద్యం బయటికి వస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. అక్రమ మద్యం, ఐదు జిల్లాల పరిధిలో గుడుంబా విక్రయాలు కలిపితే రూ.500 కోట్లకు పైనే ఉంటుంది. ఈ లెక్కన రాష్ట్ర ప్రజలు గత నెలలో మద్యపానం కోసం చేసిన ఖర్చు దాదాపు రూ.5 వేల కోట్లవుతుంది. ఇందులో డిసెంబరు 30, 31 తేదీల్లో మద్యం విక్రయాల వాటా దాదాపు రూ.900-1000 కోట్ల వరకు ఉంటుందని అంచనా.


అడుగడుగునా డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు

కొత్త సంవత్సర వేడుకల్లో ఎలాంటి అపశృతులు, రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. మద్యం అనుమతులు ఉన్న ఈవెంట్ల నిర్వాహకులు మద్యం సేవించిన వారి కోసం ప్రత్యేకంగా డ్రైవర్లను ఏర్పాటు చేసుకోవాలని షరతులు విధించారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, హెచ్చరికలు చేసినా మందు బాబులు మాత్రం తగ్గేదే లేదంటూ రోడ్డెక్కారు. ఫుల్లుగా మద్యం తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో బ్లడ్‌ అల్కహాల్‌ కౌంట్‌ (బీఏసీ) 51-100 వరకు వచ్చినవారు 554 మంది, 101-200 వరకు 474, 201-300 వరకు 85, 301-400 వరకు 22, 401-500 వరకు 8 మంది, కౌంట్‌ 500 దాటినవారు ఐదుగురు ఉన్నారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిఽధిలో 839 మందిపై డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేశారు. వీరిలో బీఏసీ కౌంట్‌ 100-300 వరకు ఉన్నవారు 366 మంది, 300-500 వరకు వచ్చిన వారు 24 మంది, కౌంట్‌ 500 పైబడిన వారు నలుగురు ఉన్నారు. రాచకొండ పరిధిలో డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో పట్టుబడిన వారిలో అత్యధిక బీఏసీ కౌంట్‌ 339గా ఉంది. పంజాగుట్ట ద్వారకాపురిలో డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో టీఎ్‌స09ఈకే 3617 వాహనం నడుపుతున్న రియాజుద్దీన్‌ను ట్రాఫిక్‌ పోలీసులు పరీక్షించారు. బీఏసీ కౌంట్‌ 550 రావడంతో వాహనాన్ని సీజ్‌ చేసి, కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఆ వాహనంపై హెల్మెట్‌ లేకుండా నడిపిన 10 చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి.


287ఈవెంట్లకు ఎక్సైజ్‌శాఖ అనుమతి

నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా మద్యం పార్టీలకు రాష్ట్రవ్యాప్తంగా 287 ఈవెంట్లకు ఎక్సైజ్‌ శాఖ అనుమతిచ్చింది. వీటిలో అత్యధికంగా హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో 243 ఉండగా, ఇతర జిల్లాల్లో 44 ఉన్నాయి. ఈవెంట్‌లో పాల్గొనేవారి సంఖ్య, మద్యం వినియోగం ఆధారంగా ఈ అనుమతులను ఎక్పైజ్‌ శాఖ జారీచేస్తుంది. అనుమతి ధర రూ.5 వేల నుంచి రూ.2.50 లక్షల వరకు ఉంటుంది. మొత్తం ఈవెంట్లతో ఈసారి రూ.56.46 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. 2023లో 224 ఈవెంట్లకు అనుమతులివ్వగా రూ.44.76 లక్షల ఆదాయం వచ్చింది.


ఐదుగురికి డ్రగ్స్‌ పాజిటివ్‌!

డిసెంబరు 31 రాత్రి హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో తెలంగాణ నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారులు తనిఖీలు నిర్వహించారు. డ్రగ్‌ టెస్టింగ్‌ కిట్లతోపాటు మత్తుమందును పసిగట్టే పోలీసు జాగిలాలను రంగంలోకి దింపారు. పబ్బులు, రిసార్టులతో పాటు రోడ్ల మీద ఎన్‌సీబీ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వేర్వేరు ప్రాంతాల్లో మత్తుమందులు వాడిన ఐదుగురు యువకులు పట్టుబడ్డారని, డ్రగ్‌ టెస్టులో పాజిటివ్‌ రావడంతో వారిని అదుపులోకి తీసుకున్నామని ఎన్‌సీబీ డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్య ఓ ప్రకటనలో తెలిపారు. మరోవైపు ఎక్సైజ్‌ పోలీసులు 30 నుంచి 40 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. మంగళవారం రాత్రి పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కొందరు గంజాయితో పట్టుబడ్డారు. బంజారాహిల్స్‌ పరిధిలో రెండు చోట్ల 313 గ్రాముల గంజాయి దొరికింది. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఎస్‌ఆర్‌ నగర్‌ పరిధిలో 3.37 కేజీల గంజాయిని పట్టుకున్నారు.


హైదరాబాదీల మనసు విశాలం!

హైదరాబాద్‌ ప్రజలు ఎంతో విశాల హృదయం కలిగిన వారు! మనోళ్లు చేసిన ఖర్చు, ఇచ్చిన టిప్పులతో ఈ విషయం వెల్లడైంది! కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా మంగళవారం రాత్రి ఓ వ్యక్తి రూ.18 వేలు ఖర్చు చేశారని స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ వెల్లడించింది. అంతేనా ఓ ఆర్డర్‌ డెలివరీ చేసిన పార్ట్‌నర్‌కు రూ.1000 టిప్‌ ఇచ్చిన వ్యక్తి కూడా దేశం మొత్తం హైదరాబాద్‌లోనే ఉన్నారని తెలిపింది. బ్లింకిట్‌ అయితే దేశం మొత్తంమీద తమ ప్లాట్‌ఫామ్‌పై డెలివరీ పార్టనర్లకు టిప్‌ల రూపంలో డిసెంబరు 31న రూ.1.80 లక్షలు ఇచ్చారని.. హైదరాబాద్‌లో ఒక్కరే ఏకంగా రూ.2500 టిప్‌ ఇచ్చారని వెల్లడించింది.

Updated Date - Jan 02 , 2025 | 04:42 AM