CM Revanth Reddy: పార్టీ లైన్ దాటొద్దు
ABN , Publish Date - Apr 16 , 2025 | 05:45 AM
మంత్రివర్గ విస్తరణపై పార్టీ అధిష్ఠానం నిర్ణయాన్ని ఫ్రీజ్ చేయగా, ఎవరూ పార్టీ లైన్ దాటకూడదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం. మే 1 నుంచి 15 వరకు ఎమ్మెల్యేలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు

మంత్రివర్గ విస్తరణపై నిర్ణయాన్ని అధిష్ఠానం ఫ్రీజ్ చేసేసింది
ఇక దీనిపై ఎవరు ఏమి మాట్లాడినా ఉపయోగం ఉండబోదు
ఏదైనా చెప్పుకోవాలంటే అధిష్ఠానం వద్దకు వెళ్లి చెప్పుకోండి
మే 1 నుంచి 15 రోజులపాటు ఎమ్మెల్యేలతో ముఖాముఖి
మళ్లీ గెలిచేందుకు ఏం చేయాలో నివేదికలు సిద్ధం చేసుకోండి
వాటిని పరిశీలించి నిధులిస్తాం.. పథకాలపై ప్రచారం చేయండి
భారత్ సదస్సుకు రాహుల్, ప్రియాంక.. బాధ్యత మంత్రులదే
ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలకు పరిష్కారం చూపించాం
కులగణన, వర్గీకరణ, ఇందిరమ్మ ఇళ్లు.. గొప్ప నిర్ణయాలు
ప్రజల్లోకి తీసుకెళ్లండి.. సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి
కుల గణన, వర్గీకరణ.. గొప్ప గొప్ప నేతలే చేయలేదు: భట్టి
హైదరాబాద్, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): ‘‘మంత్రివర్గ విస్తరణపై నిర్ణయాన్ని అధిష్ఠానం ఫ్రీజ్ చేసేసింది. ఇక, దీనిపై ఎవరు ఏమి మాట్లాడినా ఉపయోగం ఉండబోదు. ఏదైనా చెప్పుకోవాలంటే అధిష్ఠానం దగ్గరకు వెళ్లి చెప్పుకోండి. అంతే తప్ప.. పార్టీ లైన్ దాటి ఎవరూ మాట్లాడవద్దు’’ అని కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. పార్టీ లైన్ దాటకుండా ఓపిగ్గా ఉంటే.. సమీకరణాలు కలిసొచ్చి అవకాశాలు వాటంతట అవే వస్తాయని చెప్పారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ మేరకు ఆయన స్పష్టత ఇచ్చారు. శంషాబాద్ విమానాశ్రయంలోని నోవాటెల్ హోటల్‌లో మంగళవారం కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష (సీఎల్పీ) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి ఎక్కడికి వెళితే అక్కడ కాబోయే మంత్రి ఎవరన్నది ప్రకటించి వస్తున్నాడు. అది ఆయన పరిధిలోని అంశం కాదు. అది ఆయన స్థాయీ కాదు’’ అని వ్యాఖ్యానించారు. క్రమశిక్షణ కలిగిన నాయకులుగా పార్టీ లైన్లోనే మాట్లాడాలని, పార్టీ బతికితేనే అందరమూ బతుకుతామని స్పష్టం చేశారు.
మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో.. వారు కూడా ఏమీ చేయలేరని పార్టీ నేతలకు చెప్పారు. తాను, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం పార్టీ లైన్లోనే పని చేస్తామని, పార్టీని కాదని ఏమీ చేయలేమని తేల్చి చెప్పారు. పదవి దక్కకపోయినా అద్దంకి దయాకర్ పార్టీ లైన్లోనే ఉంటూ వచ్చారని, అన్ని సమీకరణలు కలిసొచ్చి ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనకు అవకాశం దక్కిందని వివరించారు. పార్టీ లైన్లోనే ఓపిగ్గా ఉన్నందున.. ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వాలన్న భావనకు అందరూ వచ్చారని, ఆయనలాగే అందరూ పార్టీ లైన్ దాటకుండా ఓపిగ్గా ఉండాలని హితవు పలికారు.
ఎమ్మెల్యేలను కలుస్తా..!
వచ్చే నెల ఒకటో తేదీ నుంచి 15 రోజులపాటు పార్టీ ఎమ్మెల్యేలతో ముఖాముఖి భేటీలు నిర్వహిస్తానని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆయా నియోజక వర్గాల్లో మళ్లీ గెలవాలంటే ఏయే పనులు చేయాలో నివేదికను సిద్ధం చేసుకుని ఉండాలన్నారు. ముఖాముఖి భేటీల్లో ఆయా నివేదికలను పరిశీలించి పనులు పూర్తి చేయడానికి నిధులు మంజూరు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. అలాగే, మే ఒకటో తేదీ నుంచి జూన్ 2 వరకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై కార్యక్రమాలను నిర్వహించాలని ఎమ్మెల్యేలకు సూచించారు. వాటికి తాను హాజరవుతానని, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్దామని అన్నారు. ఇక, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.5 కోట్ల చొప్పున నిధులను విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీఎల్పీ సమావేశంలో వెల్లడించినట్లు తెలిసింది. వచ్చే నెల నుంచి నిధుల విడుదల కార్యక్రమం ఉంటుందని చెప్పినట్లు సమాచారం. కాగా.. ఇటీవల ఎమ్మెల్సీలుగా ఎన్నికై సీఎల్పీ సమావేశంలో తొలిసారిగా పాల్గొన్న విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్‌లకు సన్మానం... అభినందన కార్యక్రమం జరిగింది. ఇక, బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రె్‌సలో చేరిన ఎమ్మెల్యేల్లో కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు మాత్రమే సీఎల్పీ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహే్‌షకుమార్‌గౌడ్, మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
భారత్ సదస్సుకు రాహుల్, ప్రియాంక
ఈనెల 25, 26 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనున్న భారత్ సదస్సుకు ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ హాజరు కానున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. సదస్సును విజయవంతం చేసే బాధ్యతను మంత్రులు తీసుకోవాలని సూచించారు. ఆసక్తి ఉన్న ఎమ్మెల్యేలకూ బాధ్యతలు అప్పగించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు సూచించారు.