NIMS Hospital Hyderabad: నిమ్స్‌లో తొలి రోబోటిక్ కిడ్నీ మార్పిడి
ABN, Publish Date - Mar 26 , 2025 | 03:10 AM
హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రి వైద్యులు రోబోటిక్ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స ద్వారా 33 ఏళ్ల రోగికి కొత్త జీవితం ప్రసాదించారు. ఈ చికిత్సను ‘ఆరోగ్యశ్రీ పథకం’ కింద ఉచితంగా నిర్వహించడం విశేషం.

దక్షిణాదిన ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇదే మొదటిది!
అరుదైన ఘనతను సాధించిన నిమ్స్ వైద్యులు
వారిని అభినందించిన మంత్రి దామోదర
నిమ్స్ ఆస్పత్రిలో రికార్డు స్థాయిలో
మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్సలు
హైదరాబాద్ సిటీ, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): రాజధాని హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రి వైద్యులు రోబోటిక్ కిడ్నీ మార్పిడి ద్వారా ఒక రోగికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. దక్షిణాదిన ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోబోటిక్ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించడం ఇదే మొదటిసారి. కార్పొరేట్ ఆస్పత్రుల్లో అయితే రూ.20 లక్షలు ఖర్చయ్యే ఈ చికిత్సను.. నిమ్స్‌లో ‘ఆరోగ్యశ్రీ పథకం’ కింద పూర్తిగా ఉచితంగా చేయడం విశేషం. బాధితుడు నల్లగొండ జిల్లాకు చెందిన 33 ఏళ్ల యువకుడు. దశాబ్దకాలంగా చివరిదశ మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న అతడికి 2017లో ఒకసారి కిడ్నీ మార్పిడి చేశారు. అప్పట్లో ఆయనకు తెలిసినవారి నుంచి కిడ్నీ తీసుకుని ఆయనకు అమర్చారు. కానీ, ఆయన శరీరం దాన్ని తిరస్కరించడంతో రెండోసారి మార్పిడి తప్పనిసరయింది. ఈసారి.. చనిపోయిన వ్యక్తి నుంచి సేకరించిన కిడ్నీని నిమ్స్ యూరాలజిస్టులు ఆయనకు రోబోటిక్ విధానంలో అమర్చారు. ఎంతో క్లిష్టమైన ఈ శస్త్రచికిత్సను సురక్షితంగా నిర్వహించామని.. అతడికి అమర్చిన కిడ్నీ బాగా పనిచేస్తోందని, మూత్రవిసర్జన సాఫీగా జరుగుతోందని, రోగి కోలుకుంటున్నాడని.. చికిత్స విజయవంతమైందనడానికి ఇదే రుజువని నిమ్స్ యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ రాహుల్ దేవ్‌రాజ్ తెలిపారు.
ఆయనతోపాటు సీనియర్ ప్రొఫెసర్, హెచ్‌వోడీ డాక్టర్ రామ్ రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ధీరజ్ ఎస్‌ఎ్‌సఎస్ నేతృత్వంలో జరిగిన ఈ రోబోటిక్ కిడ్నీ మార్పిడి ప్రక్రియలో వైద్యులు విద్యాసాగర్, చరణ్‌కుమార్, రామచంద్రయ్య, రఘువీర్, పూవరసన్, సూరజ్‌కుమార్, షారుఖ్, అనంత్, అభిషేక్, అనుపమ, రాకేశ్, మధుసూదన్, నిశాంత్, సృజన్, ఠాగూర్, వేదప్రకాశ్ పాల్గొన్నారు.. నెఫ్రాలజిస్టులు డాక్టర్ గంగాధర్, డాక్టర్ శ్రీభూషణ్ రాజు, డాక్టర్ స్వర్ణలత రోగికి శస్త్రచికిత్సకు ముందు, తర్వాత అవసరమైన మద్దతు అందించారు. ఈ సర్జరీని విజయవంతంగా నిర్వహించిన వైద్యులను నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.బీరప్ప ప్రశంసించారు. నిమ్స్ ఆస్పత్రిలో తొలి రోబోటిక్ మూత్రపిండ మార్పిడిని విజయవంతంగా నిర్వహించిన వైద్యులను ఆరోగ్య మంత్రి దామోదర్ రాజ నరసింహ అభినందించారు.
ఈ ఏడాది ఇప్పటికే 41 కిడ్నీ మార్పిళ్లు
నిమ్స్‌లో రెండేళ్లుగా కిడ్నీ మార్పిడి చికిత్సలు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రతి నెలా 15 నుంచి 20 కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్స్ జరుగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే నిమ్స్ యూరాలజీ విభాగం 41 కిడ్నీ మార్పిడి చికిత్సలు చేయడం గమనార్హం. కొవిడ్ కారణంగా 2020లో తప్ప.. గడిచిన దశాబ్దకాలంగా నిమ్స్‌లో ఏటా 100కు పైగా కిడ్నీ మార్పిడి చికిత్సలు జరుగుతున్నాయి. ఆ ఆస్పత్రిలో ఇప్పటిదాకా 1758 కిడ్నీ మార్పిళ్లు జరిగాయి. ఏటా 11వేలకు పైగా యూరలాజికల్ శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు. కిడ్నీ మార్పిడికి సంబంధించి ఇప్పుడు రోబోటిక్ టెక్నాలజీని కూడా ప్రవేశపెట్టడం వల్ల శస్త్రచికిత్సల కచ్చితత్వం పెరుగడమే కాక.. పేషెంట్లు కోలుకునే సమయం తగ్గుతుందని, మరింత మెరైగన ఫలితాలు వస్తాయని డాక్టర్ రాహుల్ తెలిపారు.
Updated Date - Mar 26 , 2025 | 03:11 AM