అభ్యంతరాలుంటే పార్టీ వేదికలపై మాట్లాడాలి
ABN, Publish Date - Feb 06 , 2025 | 03:58 AM
తీన్మార్ మల్లన్న సంగతి పార్టీ చూసుకుంటుందని చెప్పారు. గాంధీభవన్‌లో బుధవారం జరిగిన ‘మంత్రితో ముఖాముఖీ’ కార్యక్రమంలో పాల్గొన్న సీతక్క.. పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజల నుంచి వచ్చిన వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు.

బహిరంగంగా మాట్లాడటమేంటి?
తీన్మార్ మల్లన్న తీరుపై సీతక్క
పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవు
మహేశ్‌కుమార్ గౌడ్ హెచ్చరిక
హైదరాబాద్/ సరూర్‌నగర్/ ఏఎ్‌సరావునగర్/ హనుమకొండ టౌన్/ రామాయంపేట/ నర్సాపూర్/ హసన్‌పర్తి, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): కులగణన సర్వే సరిగా లేదంటూ తీన్మార్ మల్లన్న మాట్లాడటం సరికాదని మంత్రి సీతక్క అన్నారు. కులగణన సర్వేపై ఏమైనా అభ్యంతరాలుంటే పార్టీ వేదికలపై మాట్లాడాలి కానీ బహిరంగంగా మాట్లాడమేంటని ఆమె పేర్కొన్నారు. తీన్మార్ మల్లన్న సంగతి పార్టీ చూసుకుంటుందని చెప్పారు. గాంధీభవన్‌లో బుధవారం జరిగిన ‘మంత్రితో ముఖాముఖీ’ కార్యక్రమంలో పాల్గొన్న సీతక్క.. పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజల నుంచి వచ్చిన వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ, బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన సమగ్ర కుటుంబ సర్వే అశాస్త్రీయంగా, అసంబద్ధంగా ఉందని, లింకా బుక్ ఆఫ్ రికార్డు కోసం ఒక్క రోజులో సర్వే పూర్తిచేశారని ఆరోపించారు. తాము చేపట్టిన కులగణ సర్వేను బహిష్కరించాలని పిలుపునిచ్చిన బీఆర్‌ఎ్‌సకు ఇప్పుడు కులగణన లెక్కలు అడిగే హక్కు లేదని అన్నారు.
బీఆర్‌ఎస్ అధ్యక్ష పదవి ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారని, ఆ పార్టీలో ఎదిగిన ఆలె నరేంద్ర, ఈటల రాజేంద్ర వంటి బీసీ నేతలను అవమానించి బయటికి పంపేశారని విమర్శించారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్ కులగణనలో ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. కులగణనలో ఎక్కడా లెక్క తప్పలేదని, ఆయా సామాజిక వర్గాల లెక్కలు పక్కాగా తేలాయని చెప్పారు. గడిచిన 30 ఏళ్ల ఎస్సీ వర్గీకరణ పంచాయితీని తెంచి ఎవరి వాటాను వారికి పంచామని సీతక్క పేర్కొన్నారు. తీన్మార్ మల్లన్న ఓ అవకాశవాది అని, రాజకీయ పార్టీలను బెదిరించి లబ్ధి పొందడమే ఆయన పని అని తెలంగాణ రెడ్డి జేఏసీ ప్రతినిధులు ఆరోపించారు. తీన్మార్ మల్లన్న బీసీల యుద్ధభేరి సభలో రెడ్ల గురించి చేసిన వ్యాఖ్యలు అసభ్యంగా, అభ్యంతరకరంగా ఉన్నాయని, ఆయనపై చర్యలు తీసుకోవాలని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, పార్టీ లైన్ దాటితే ఎవరైనా సరే చర్యలు తప్పవని టీపీసీసీ అఽధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. అలాంటి వారిపై క్రమశిక్షణా కమిటీ చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.
Updated Date - Feb 06 , 2025 | 03:58 AM