Water Shortage: పట్టణాల్లో నీటికి కటకట
ABN , Publish Date - Feb 21 , 2025 | 05:38 AM
ఇంట్లో పొద్దున లేచింది మొదలు ఒకటే ఆలోచన! చాయ్ తాగేందుకు పాలు ఎలా అని కాదు.. వంట కోసం కూరలు, పప్పులు ఎలా అనీ కాదు. గొంతు తడుపుకోవడానికి, ఇతర అవసరాలకు నీళ్లు ఎలా అనే! కుళాయిల్లో నిండుగా వచ్చే ధార బాగా సన్నబడింది.. నల్లానీరు వదిలే టైమూ తగ్గిపోయింది.

తాగునీరు, ఇతర అవసరాలకు సమస్యలు.. ఎండాకాలం రాకముందే తీవ్ర నీటి ఎద్దడి
సన్నగా కుళాయి నీరు.. వట్టిపోయిన బోర్లు.. 18 జిల్లాల్లో పడిపోయిన భూగర్భజలాలు
వేసవిలో మాదిరిగా ట్యాంకర్లకు డిమాండ్.. లీకేజీలతో నల్లాల నుంచి కలుషిత నీరు
ప్రభుత్వానికి మాత్రం తాగునీటి సమస్య లేదంటూ నివేదికలిస్తున్న అధికారులు
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్): ఇంట్లో పొద్దున లేచింది మొదలు ఒకటే ఆలోచన! చాయ్ తాగేందుకు పాలు ఎలా అని కాదు.. వంట కోసం కూరలు, పప్పులు ఎలా అనీ కాదు. గొంతు తడుపుకోవడానికి, ఇతర అవసరాలకు నీళ్లు ఎలా అనే! కుళాయిల్లో నిండుగా వచ్చే ధార బాగా సన్నబడింది.. నల్లానీరు వదిలే టైమూ తగ్గిపోయింది. ఏదో మొక్కుబడిగా వస్తున్న ఆ నీళ్లూ రోజు విడిచి రోజు వదులుతుండటంతో గృహ అవసరాలకు ఏమాత్రం సరిపోతాయి? స్నానం చేసేందుకు బకెట్ నీళ్ల కోసం ఆలోచించాల్సి వస్తోందటే నీటి కొరత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. బోరు ఆన్ చేసినా మోటారు తిరుగుతోంది తప్ప పైకి చుక్కనీరు రావడం లేదు. డబ్బులు పోతే పోనీ అనుకొని నీళ్ల ట్యాంక రైనా బుక్ చేసుకోవచ్చు అనుకున్నా ఏం లాభం? ఈ రోజు ఫోన్ చేసి బుక్ చేస్తే రెండ్రోజుల దాకా ట్యాంకర్ రావడం లేదు. నీళ్ల ట్యాంకర్లకూ డిమాండ్ పెరిగిపోయింది. రోడ్ల మీద ఎక్కడ చూసినా వచ్చీపోయే నీళ్ల ట్యాంకర్లే కనిపిస్తున్నాయి. ఇదీ రాష్ట్రంలో మునిసిపాలిటీల్లో ఎక్కువ చోట్ల ప్రస్తుతం ఉన్న పరిస్థితి. ఇంకా ఎండాకాలం మొదలవ్వనేలేదు.. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నీటి కొరత ఏర్పడింది. చిత్రం ఏమిటంటే.. రాష్ట్రంలో తాగునీటి సమస్యే లేదని.. ఇప్పటి వరకు ఎక్కడా నీటి ఎద్దడి ఎదురుకాలేదంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సంబంధిత విభాగం లెక్కలు పంపుతున్నా.. వాటికి, క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతనే లేదు. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే ఎండలు దంచికొట్టే ఏప్రిల్, మే నెలల్లో నీటి సమస్య ఏ స్థాయిలో ఉండనుందో అన్న ఆలోచనే తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కామారెడ్డి పట్టణ ప్రజల నీటి కష్టాలు అన్నీఇన్నీ కావు. గట్టిగా నాలుగు బిందెలు దొరికితే అదే భాగ్యం అన్నట్టుగా పరిస్థితి తయారైంది.
ఈ పట్టణ ప్రజలకు శివారులోని పెద్ద చెరువు నుంచి, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి, బోరుబావుల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. అయితే పెద్ద చెరువు దాదాపు ఎండిపోయింది. ఎస్సారెస్పీ పైపులైన్ నుంచి మునుపు వారానికి రెండురోజులు నీళ్లు వదిలితే ఇప్పుడు వారానికి ఒక రోజే వదులుతున్నారు. భూగర్భజలాలు పడిపోవడంతో బోరుబావుల్లోంచి నీరు రావడం లేదు. ఫలితంగా కామారెడ్డి ప్రజల అవసరాల కోసం 18 ఎంఎల్డీ (మిలియన్ లీటర్స్ పర్ డే) నీటిని సరఫరా చేయాల్సి ఉండగా కేవలం 10 ఎంఎల్డీ నీటినే అందిస్తున్నారు. ఆదిలాబాద్‌లోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. ఈ మునిసిపాలిటీలో 30 ఎంఎల్డీ నీటిని సరఫరా చేయాల్సి ఉండగా ప్రస్తుతం 18 ఎంఎల్డీ నీటినే సరఫరా చేస్తున్నారు. నిర్మల్ పట్టణ శివార్లలో మిషన్ భగీరథ పైప్‌లైన్ పనులు పూర్తికాకపోవడంతో అక్కడ తాగునీటికి తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయి. ఖానాపూర్ మునిసిపాలిటీ పరిధిలోని సుభా్‌షనగర్, రాజీవ్‌నగర్, శాంతినగర్, శ్రీరామ్ నగర్, గాందీనగర్, ఇందిరానగర్, కరీం కాలనీ, టవర్ కాలనీల్లో తాగునీటి సమస్య నెలకొంది. సంగారెడ్డి జిల్లా తూప్రాన్ పట్టణంలో నెలరోజులుగా తాగునీటి సరఫరా తగ్గిపోయింది. ఉమ్మడి తూప్రాన్ మండలానికి సరఫరా అయ్యే నీటిని 30-40 మేర తగ్గించారు. కొన్ని వాటర్ ట్యాంకులు ఖాళీగా ఉంటున్నాయని నీటి సరఫరా విభాగం అధికారులే చెబుతున్నారు. గోదావరిలో సరిపడా నీళ్లు లేకపోవడంతో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నీటి సమస్య నెలకొంది. ఈ సమునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 70 ఎంఎల్డీల నీరు అవసరం ఉండగా 40 ఎంఎల్డీలు మాత్రమే సరఫరా చేస్తున్నారు.
సల్తానాబాద్ మునిసిపాలిటీ పరిధిలో మిషన్ భగీరథ పైప్‌లైన్లు కాకుండా పాత పైప్‌లైన్లే ఉపయోగించడం.. లీకేజీ సమస్య కారణంగా నీరు వృథాగా పోతుండటంతో మంచినీటి సరఫరా అస్తవ్యస్తంగా తయారైంది. ధర్మపురి పట్టణంలో లీకేజీ సమస్య కారణంగా మిషన్ భగీరథ గ్రిడ్ ద్వారా సరఫరా నిలిపివేశారు. నారాయణపేట జిల్లా కోస్గి మునిసిపాలిటీలో 3.68 ఎంఎల్డీ నీరు అవసరపడుతుండగా 1.09 ఎంఎల్డీ నీటినే సరఫరా చేస్తున్నారు. గద్వాల మునిసిపాలిటీలో 15 ఎంఎల్డీ నీరు అవసరపడుతుండగా 12.6 ఎంఎల్డీ నీరు, అయిజ మునిసిపాలిటీలో 7.5 ఎంఎల్డీకి 5.4 ఎంఎల్డీ నీరే ఇస్తున్నారు. వనపర్తి జిల్లాలోని ఆత్మకూరు, అమరచింత, పెబ్బేరులో జనం తాగునీటి అవసరాలకు బోరుబావుల మీదే ఆధారపడుతుండటం, అక్కడ భూగర్భజలాలు పడిపోవడంతో తీవ్ర తాగునీటి సమస్య నెలకొంది. యాదాద్రి జిల్లా భువనగిరి మునిసిపాలిటీలో రెండ్రోజులకోసారి నీటి సరఫరా అవుతోంది. కొత్తగూడెం జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో మంచినీటి తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. నీటి లభ్యత ఉన్నప్పటికీ యంత్రాంగం పనితీరులో లోపాల కారణంగా రెండు, మూడు రోజులకోసారి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. పాతలైన్లే ఉండటంతో లీకేజీల కారణంగా మరుగునీరు కలుస్తుండటంతో నీళ్లు కలుషితమవుతున్నాయి. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రజల అవసరాల మేరకు నీరు సరఫరా కావడం లేదు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు 3.61 ఎంఎల్డీ నీరు అవసరం కాగా మిషన్‌భగీరథ ద్వారా 1.67 ఎంఎల్డీ మాత్రమే సరఫరా అవుతోంది. పరిగిలోని భవానీనగర్, తిరుమల రెసిడెన్సీ, మైత్రినగర్, శ్రీనివాస హిల్స్, తుంకులగడ్డ, వేంకటేశ్వర కాలనీల్లో తీవ్ర సాగునీటి సమస్య నెలకొంది.
18 జిల్లాల్లో పడిపోయిన భూగర్భ జలాలు
గత నెల జనవరిలో రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భ జలాల సగటు నీటి మట్టం 7.46 మీటర్లుగా ఉంది. గత ఏడాది జనవరి (7.72 మీటర్లు)తో పోల్చితే 0.74 మీటర్ల మేర భూగర్భజలాలు పడిపోయాయి. నిరుటితో పోల్చితే 18 జిల్లాలో భూగర్భజలాలు పడిపోయాయి. సాధారణ వర్షపాతం కన్నా తక్కువ వర్షపాతం నమోదైన జిల్లాల్లో నీటి మట్టం పడిపోయింది. ఈ ప్రాంతాల్లో నీటి సంరక్షణ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోనూ భూగర్భజలాలు పడిపోయి.. బోరుబావులు పనిచేయకపోవడంతో తాగునీటి సమస్య ఏర్పడినట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర సగటు భూగర్భజలాల మట్టం కన్నా ఎక్కువగా యాదాద్రి జిల్లాలో 2.71 మీటర్లు, మేడ్చల్‌లో 1.83 మీటర్లు, సిద్దిపేటలో 1.64 మీటర్లు, సంగారెడ్డిలో 1.29 మీటర్లు, ములుగులో 1.6 మీటర్లు, రంగారెడ్డిలో 1.05 మీటర్లు, నల్లగొండలో 0.62 మీటర్లు, కరీంనగర్‌లో 0.34 మీటర్లు, నిజామాబాద్‌లో 0.03 మీటర్ల మేర నీటిమట్టాలు పడిపోయాయి.
మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: ఈసీ కన్నా జగన్ గొప్పవాడా?
Also Read: ఎమ్మెల్యేకి తీవ్ర అనారోగ్యం.. ఆసుపత్రిలో చేరిక
Also Read: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కీలక మార్పులు..
Also Read: గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష.. హైకోర్టు కీలక తీర్పు
Also Read: రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆప్ ఎంపీ ప్రత్యక్షం
For Telangana News And Telugu News