Sitarama Lift Irrigation: సీతారామ పై ఉన్నతస్థాయి కమిటీ
ABN , Publish Date - Apr 16 , 2025 | 04:29 AM
సీతారామ ఎత్తిపోతల పథకం నిర్మాణాల ధృడత్వాన్ని పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నలుగురు సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. 15 రోజుల్లోగా నివేదిక అందించాల్సి ఉన్న ఈ కమిటీ, పిల్లర్ కూలిన ఘటనపై విచారణ చేపడుతుంది

నలుగురు సభ్యులతో ధృడత్వ పరిశీలన
ఓ పిల్లర్ కూలిపోయిన నేపథ్యంలోనే..
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం.. ఆదేశాలు జారీ
15 రోజుల్లోగా నివేదిక ఇవ్వనున్న కమిటీ
హైదరాబాద్, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): సీతారామ ఎత్తిపోతల పథకం/సీతమ్మసాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టులోని అన్ని కాంపోనెంట్‌లలోని నిర్మాణాల ధృడత్వాన్ని, నాణ్యతను పరిశీలించేందుకు నలుగురు సభ్యులతో ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు చీఫ్ ఇంజనీర్ (సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్) మోహన్‌కుమార్, సీఈ (క్వాలిటీ కంట్రోల్) వెంకటకృష్ణ, సీఈ (మైనర్ ఇరిగేషన్) రఘునాథరావు, ఎస్‌ఈ (టెక్నికల్) బస్వరాజులతో కమిటీ వేసినట్లు ఈఎన్‌సీ (జనరల్) జి.అనిల్ కుమార్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. సీతారామ ఎత్తిపోతల పథకంలో పూసుగూడెం-కమలాపురం పంప్‌హౌ్‌సకు వెళ్లే కాలువ మార్గంలో మాదారంవద్ద 48.309 కి.మీ. వద్ద కాలువ పైన వరద నీరు వెళ్లడానికి వీలుగా సూపర్ పాసేజ్ నిర్మాణం చేపట్టగా... దీనికి సపోర్టుగా ఉండటానికి నాలుగు పిల్లర్లు కట్టారు. అయితే గత నెల మార్చిలో సాగర్ ఆయకట్టు స్థిరీకరణ కోసం ప్యాకేజీ-4లో భాగంగా కెనాల్ 39.926 కి.మీ. నుంచి 44.650 కి.మీ. మధ్యలో నీటిని విడుదల చేయగా.. పిల్లర్ కింది భాగంలో మట్టి అంతా కొట్టుకుపోయి... పిల్లర్ కింద పడిపోయినట్లు ప్రాథమిక నివేదికలో తేల్చారు. ఇది జరిగి... రెండు వారాలు పూర్తవుతున్నా ఉన్నతస్థాయి అధికారులకు సమాచారం ఇవ్వలేదు.
అయితే, ఈ విషయం సీఎం ఎ.రేవంత్‌రెడ్డి దృష్టికి వెళ్లగా... ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కట్టుడు... కూలుడేనా...? నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించరా...? పదికాలాల పాటు ఉండాల్సిన నిర్మాణాలు ప్రాజెక్టు సిద్ధం కాకముందే కూలడమేంటీ...?’ అని అధికారులను నిలదీశారు. దాంతో ఈ పథకంలోని అన్ని కాంపోనెంట్ల నిర్మాణాల్లో ధృడత్వాన్ని, నాణ్యత ప్రమాణాలు పాటించే నిర్మాణాలు చేపట్టారా...? లేదా...? అన్న అంశాన్ని కమిటీ పరిశీలించి, 15 రోజుల్లోగా నివేదిక అందించనుంది. ఆ నివేదిక ఆధారంగా నిర్మాణ పనుల్లో నాణ్యతను పాటించలేదని తేలితే అధికారులపై తదుపరి చర్యలకు ఉపక్రమించనున్నారు.
For AndhraPradesh News And Telugu News