Sridhar Babu: హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకునేందుకు పోటీ
ABN , Publish Date - Apr 05 , 2025 | 04:12 AM
కొత్త పరిశ్రమలు తెచ్చి హైదరాబాద్‌ను అభివృద్ధి చేయాలని తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే బీఆర్‌ఎస్, బీజేపీలు పోటీ పడి అడ్డుకుంటున్నాయని మంత్రి శ్రీధర్‌బాబు మండిపడ్డారు.

బీఆర్‌ఎస్, బీజేపీ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు
అన్ని జిల్లాల్లోనూ నైపుణ్య శిక్షణ కేంద్రాలు: మంత్రి శ్రీధర్‌బాబు
వరంగల్, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కొత్త పరిశ్రమలు తెచ్చి హైదరాబాద్‌ను అభివృద్ధి చేయాలని తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే బీఆర్‌ఎస్, బీజేపీలు పోటీ పడి అడ్డుకుంటున్నాయని మంత్రి శ్రీధర్‌బాబు మండిపడ్డారు. జంతువులు, పక్షులంటే తమకు మాత్రం ప్రేమ లేదా అని అన్నారు. పర్యావరణం గురించి మాట్లాడుతున్న బీఆర్‌ఎస్ నేతలు 2019లో వరంగల్ అజంజాహిమిల్లులో పెద్ద పెద్ద చెట్లను నరికి పార్టీ సభ పెట్టినప్పుడు గుర్తుకు రాలేదా అని మంత్రి ప్రశ్నించారు. శుక్రవారం హనుమకొండ జిల్లా పరకాలలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్‌మేళాలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర యువత భవిష్యత్తుకు పరిశ్రమలు తీసుకొచ్చి, లక్షలాది మందికి ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే.. అడ్డుకునేందుకు బీఆర్‌ఎస్, బీజేపీలు చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు.
యువతలో నైపుణ్యాన్ని పెంచేందుకు 33 జిల్లాల్లోనూ నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ చదివిన విద్యార్థులు 25 లక్షల నుంచి 30 లక్షల మంది వరకు ఉన్నారని, వారందరికి ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందని వెల్లడించారు. నిరుద్యోగులకు ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ రంగంలో కూడా ఉపాధి కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లో స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారన్నారు. దీంతో పాటు డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. దీనిలో నిరుద్యోగులు తమ అర్హతలతో నమోదు చేసుకుంటే.. వివిధ కంపెనీలు తమకు కావాల్సిన వారిని నేరుగా ఎంపిక చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా పలు కంపెనీలకు ఎంపికైన వారికి ఉద్యోగ నియామక పత్రాలను అందించారు. కార్యక్రమంలో వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు సత్యశారద, ప్రావీణ్య, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, కేఆర్ నాగరాజు, వరంగల్ మేయర్ గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి:
Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌కి మరో దెబ్బ.. అమెరికా వస్తువులపై కూడా 34% సుంకం..
Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..
Loan Charges: ఏప్రిల్‌లో పర్సనల్ లోన్స్‌పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు
Read More Business News and Latest Telugu News