Share News

CS Shanti Kumari: ‘కంచ గచ్చిబౌలి’పై ఏం చేద్దాం?

ABN , Publish Date - Apr 14 , 2025 | 04:05 AM

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టుకు సమర్పించబోయే నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది.

CS Shanti Kumari: ‘కంచ గచ్చిబౌలి’పై ఏం చేద్దాం?

  • ఢిల్లీలో సీఎస్‌ శాంతికుమారి సమాలోచనలు

  • న్యాయవాదుల బృందంతో సుదీర్ఘ భేటీ

  • 16న సుప్రీంకు సమర్పించాల్సిన నివేదిక, అమికస్‌ క్యూరీ అడిగిన ప్రశ్నలపై చర్చలు

  • కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో ‘బీ ద చేంజ్‌ వెల్ఫేర్‌ సొసైటీ’ పిటిషన్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టుకు సమర్పించబోయే నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి నేతృత్వంలో అటవీ శాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ సహా సుమారు పది మందితో కూడిన అధికారుల బృందం ఢిల్లీలో రెండు రోజుల పాటు సమాలోచనలు చేసింది. శనివారం ఢిల్లీకి చేరుకున్న బృందం ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌ తిరుగు ప్రయాణమైంది. సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీతో పాటు మరికొందరు న్యాయవాదులతో సీఎస్‌ ప్రత్యేకంగా సమావేశమైనట్టు తెలిసింది. కంచ గచ్చిబౌలి భూములను సీఎస్‌ స్వయంగా సందర్శించి, 16వ తేదీలోపు సమగ్ర నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ‘ఈ విషయంలో మా ఆదేశాలు పాటించకపోతే సీఎస్‌ వ్యక్తిగతంగా బాధ్యులవుతారు. ఆ భూముల్లోని చెరువు సమీపంలో తాత్కాలికంగా నిర్మించే జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. అదే కోరుకుంటే ఎవరూ సహాయం చేయలేర’ని సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించిన నేపథ్యంలో నివేదికలో ఏయే అంశాలు పొందుపరచాలి? క్షేత్రస్థాయిలో అసలేం జరిగింది? నివేదిక తర్వాత సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుంది? తదితర అంశాలపై ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు చర్చించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.


గత విచారణ సందర్భంగా అమికస్‌ క్యూరీ లేవనెత్తిన ఐదు ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించగా... వాటిపై కూడా అధికారుల బృందం సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిసింది. ‘అటవీ భూమిగా భావిస్తున్న కంచ గచ్చిబౌలిలో చెట్లను తొలగించి అభివృద్ధి కార్యకలాపాలు అంత హడావుడిగా చేపట్టాల్సిన అవసరమేంటి?, దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ మదింపు ధ్రువీకరణ నివేదిక తీసుకుందా?, చెట్ల నరికివేత కోసం అటవీ అధికారుల నుంచి అవసరమైన అనుమతులు పొందారా? స్థానిక చట్టాలను అమలు చేశారా?, మార్చి 15న అటవీ భూమి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో అటవీ, పర్యావరణ వ్యవహారాల్లో నిపుణులు కాని అధికారులను నియమించాల్సిన అవసరమేంటి? వారికి అడవుల గురించి ఉన్న అనుభవమేంటి?, అక్కడ నరికిన చెట్లతో వచ్చిన కలపను ఏం చేస్తోంది?’ అనే ప్రశ్నలకు ఎటువంటి సమాధానాలు ఇవ్వాలి? సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుంది? అమికస్‌ క్యూరీ లేవనెత్తబోయే తదుపరి ప్రశ్నలేంటి అనే అంశాలపై చర్చించినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా... కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి విచారిస్తుండగా, తమ వాదనలనూ వినాలని ‘బీ ద ఛేంజ్‌ వెల్ఫేర్‌ సొసైటీ’ అనే స్వచ్ఛంద సంస్థ ఈ నెల 9న రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం, అటవీ శాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌, అదనపు కార్యదర్శి, హెచ్‌సీయూ రిజిస్ట్రార్‌, టీజీఐఐసీ డైరెక్టర్‌ సహా మరికొందరిని ప్రతివాదులుగా చేర్చింది. ఈ పిటిషన్‌ కూడా ఈ నెల 16వ తేదీనే జస్టిస్‌ బీఆర్‌ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు రానుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

పులివెందుల అభివృద్ధి పేరుతో జగన్ మోసం

ఏపీలో ఢిల్లీకి మించిన లిక్కర్ స్కామ్..

టీడీపీ కార్యకర్తపై కేసు.. మరికాసేపట్లో అరెస్టు..

For More AP News and Telugu News

Updated Date - Apr 14 , 2025 | 04:06 AM