Share News

Supreme Court: సానుభూతి చూపగలం.. న్యాయపరంగా అంగీకరించలేం

ABN , Publish Date - Apr 09 , 2025 | 03:47 AM

దత్తత పేరుతో చట్టవిరుద్ధంగా పిల్లలను కొనుగోలు చేసిన వ్యవహారంలో దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. రెండ్రోజుల పసిగుడ్డును కొనుగోలు చేసి ఎలా దత్తత తీసుకుంటారని, ఇదెక్కడి మానవత్వమని ప్రశ్నించింది.

Supreme Court: సానుభూతి చూపగలం.. న్యాయపరంగా అంగీకరించలేం

మాకున్న విశేషాధికారాలతో అక్రమాన్ని సక్రమమనలేం

  • రెండ్రోజుల పసిగుడ్డును కొన్నారు.. ఇదెక్కడి మానవత్వం

  • దత్తత పేరుతో చట్టవిరుద్ధంగా పిల్లల కొనుగోలు వ్యవహారంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

  • తదుపరి విచారణ మే 7కు వాయిదా

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): దత్తత పేరుతో చట్టవిరుద్ధంగా పిల్లలను కొనుగోలు చేసిన వ్యవహారంలో దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. రెండ్రోజుల పసిగుడ్డును కొనుగోలు చేసి ఎలా దత్తత తీసుకుంటారని, ఇదెక్కడి మానవత్వమని ప్రశ్నించింది. నిజానికి ఆ పిల్లలను దత్తత తీసుకున్నవారిగా భావించలేమని, కొనుక్కున్నారని స్పష్టం చేసింది. ఆ పిల్లలు, పెంపుడు తల్లిదండ్రుల పట్ల సానుభూతి చూపగలమని, అంతేతప్ప న్యాయపరంగా అంగీకరించలేమని పేర్కొంది.


క్లినిక్‌ ముసుగులో పిల్లల విక్రయాలతో..

రాచకొండ మేడిపల్లి పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని పీర్జాదిగూడలో శోభారాణి అనే మహిళ ఓ క్లినిక్‌ ముసుగులో చిన్న పిల్లలను సంతానం లేని దంపతులకు విక్రయించేది. ఈ విషయం తెలిసిన కొందరు విలేకరులు స్టింగ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. ఆ క్లినిక్‌కు వెళ్లి ఓ ఆడ శిశువును తీసుకుంటామని చెప్పి రూ.4.5 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. కొందరు పిల్లల ఫొటోలను తీసుకున్నారు. ఈ వివరాలతో మేడిపల్లి పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అప్పటికే విక్రయించిన 15 మంది చిన్నారులను గుర్తించి శిశుసంరక్షణ కమిటీకి అప్పగించారు. దీనిపై పిల్లల పెంపుడు తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. సింగిల్‌ బెంచ్‌ వారికి అనుకూలంగా ఆదేశాలు ఇవ్వగా, డివిజనల్‌ బెంచ్‌లో వ్యతిరేక తీర్పు వచ్చింది. దీంతో పెంపుడు తల్లిదండ్రులు సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేశారు. దీనిపై మంగళవారం జస్టిస్‌ సుధాంశు దులియా, జస్టిస్‌ కె.వినోద్‌ చంద్రన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. తొలుత పిటిషనర్ల తరపు న్యాయవాది శేషాద్రినాయుడు వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లు పిల్లలు లేకపోవడంతో ఆ శిశువులను దత్తత తీసుకున్నారని, రెండేళ్లలో వారి మధ్య మానసిక అనుబంధం పెరిగిందని వివరించారు. సుప్రీంకోర్టుకు ఉన్న విశేషాధికారాలతో పిల్లలను పెంపుడు తల్లిదండ్రులకు ఇప్పించాలని కోరారు. దీనిపై స్పందించిన ధర్మాసనం తమ విశేషాఽధికారాలతో అక్రమాన్ని సక్రమమని చెప్పలేమని పేర్కొంది. కేసు విచారణను వచ్చే నెల 7కు వాయిదా వేసింది.


ఇవి కూడా చదవండి..

సింహానికి చుక్కలు చూపించిన తేనెటీగలు..

సిట్‌ కస్టడీకి ‘కల్తీ నెయ్యి’ నిందితులు

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Apr 09 , 2025 | 03:47 AM