Vikarabad: గిరిజన వసతి గృహంలో విద్యార్థి మృతి
ABN , Publish Date - Feb 14 , 2025 | 04:48 AM
ప్రభుత్వ గిరిజన బాలుర వసతి గృహంలో ఓ విద్యార్థి గురువారం అనుమానాస్పద స్థితిలో మరణించాడు. వికారాబాద్ జిల్లా కులకచర్లలోని ప్రభుత్వ గిరిజన బాలుర వసతి గృహంలో ఈ ఘటన జరిగింది.

బాలుడి మృతిపై అనుమానాలు
తోటి విద్యార్థులతో కలిసి రాత్రి నిద్రించిన పదో తరగతి విద్యార్థి
తెల్లవారేసరికి మంచంపై అచేతనస్థితిలో గుర్తింపు
పరిగి/కులకచర్ల, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ గిరిజన బాలుర వసతి గృహంలో ఓ విద్యార్థి గురువారం అనుమానాస్పద స్థితిలో మరణించాడు. వికారాబాద్ జిల్లా కులకచర్లలోని ప్రభుత్వ గిరిజన బాలుర వసతి గృహంలో ఈ ఘటన జరిగింది. దేవేందర్(15) అనే బాలుడు తాను నిద్రించిన మంచంపైనే మరణించాడు. మృతికి గల కారణంపై స్పష్టత లేకపోవడంతో ఈ ఘటన కలకలం రేపింది. వికారాబాద్ మండలం మద్గుల్‌చిట్టెంపల్లి పరిధి టేకులబీడ్‌తండాకు చెందిన చందర్‌నాయక్, సోనిబాయి దంపతుల రెండో కుమారుడు దేవేందర్.. వసతి గృహంలో ఉంటూ కులకచర్ల పదో తరగతి చదువుతున్నాడు. బుధవారం రాత్రి భోజనం చేసిన దేవేందర్.. రాత్రి 10.30 గంటల తర్వాత తోటి విద్యార్థి విశాల్‌తో కలిసి మంచంపై నిద్రపోయాడు. విద్యార్థులంతా ఉదయం నిద్ర లేచి పాఠశాలకు సిద్ధమవుతుండగా ఏం చేసినా దేవేందర్ నిద్ర లేవడం లేదు. తోటి విద్యార్థులు వసతి గృహం వాచ్‌మెన్ హన్మంత్, టీచర్ రాజేందర్‌కు సమాచారమిచ్చారు. వారు ప్రయత్నించినా దేవేందర్‌లో స్పందన లేకపోవడంతో 108 అంబులెన్స్‌ను పిలిపించి పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
పరీక్షించిన వైద్యులు దేవేందర్ ప్రాణాలతో లేడని ప్రకటించారు. విషయం తెలుసుకున్న దేవేందర్ తల్లిదండ్రులు కుమారుడి మృతదేహం వద్ద కన్నీటిపర్యంతమయ్యారు. దేవేందర్ మృతిపై అనుమానాలున్నాయని, బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, దేవేందర్ తల్లిదండ్రులు పరిగి ఆస్పత్రి వద్ద గిరిజన సంఘాల నేతలతో కలిసి ఆందోళనకు దిగారు. న్యాయం జరిగే వరకు పోస్టుమార్టం జరగనివ్వమని అడ్డుకున్నారు. ఆయా సంఘాల నేతలు, పోలీసుల మధ్య జరిగిన వాగ్వాదం వల్ల ఉద్రిక్తత నెలకొంది. మృతుడి కుటుంబానికి ఉద్యోగంతోపాటు, రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. వారితో చర్చించిన కులకచర్ల తహసీల్దార్, పరిగి సీఐ, గిరిజన సంక్షేమ శాఖ జిల్లా అధికారి కమలాకర్‌రెడ్డి తదితరులు దేవేందర్ కుటుంబానికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగంతోపాటు, ఎస్టీ శాఖ నుంచి 80ు రాయితీపై రుణ వసతి కల్పిస్తామని హామీ ఇవ్వడంతో గిరిజన సంఘాల నేతలు ఆందోళన విరమించారు. అనంతరం దేవేందర్ మృతదేహనికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీలకు అప్పగించారు.