Share News

JNTU: జేఎన్‌టీయూ వీసీగా కిషన్‌కుమార్‌రెడ్డి

ABN , Publish Date - Feb 19 , 2025 | 03:36 AM

దాదాపు 16 ఏళ్ల తర్వాత జేఎన్‌టీయూ ప్రొఫెసర్‌నే ఉపకులపతి (వీసీ)గా నియమించడం పట్ల యూనివర్సిటీ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.

JNTU: జేఎన్‌టీయూ వీసీగా కిషన్‌కుమార్‌రెడ్డి

16 ఏళ్ల తర్వాత వర్సిటీ ప్రొఫెసర్‌నే ఉపకులపతిగా నియమించిన సర్కారు

బాధ్యతల స్వీకరణ.. అధికారులతో భేటీ

కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చిన వీసీ

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూ) కొత్త ఉపకులపతిగా ఆచార్య టి.కిషన్‌కుమార్‌రెడ్డి నియమితులయ్యారు. మంగళవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. దాదాపు 16 ఏళ్ల తర్వాత జేఎన్‌టీయూ ప్రొఫెసర్‌నే ఉపకులపతి (వీసీ)గా నియమించడం పట్ల యూనివర్సిటీ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ఇన్‌చార్జి వీసీగా ఉన్న ఉన్నత విద్యామండలి చైర్మన్‌ బాలకిష్టారెడ్డి, వర్సిటీ రెక్టార్‌ విజయకుమార్‌ రెడ్డి, రిజిస్ట్రార్‌ వెంకటేశ్వరరావు నూతన వీసీకి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం వివిధ విభాగాల డైరెక్టర్లు, అనుబంధ కళాశాలల ప్రిన్సిపాళ్లతో వీసీ కిషన్‌కుమార్‌రెడ్డి సమావేశమై.. యూనివర్సిటీ భవిష్యత్తు ప్రణాళికలపై సమీక్షించారు. వర్సిటీ అభివృద్ధికి కలిసి పనిచేద్దామని అధికారులకు వీసీ పిలుపునిచ్చారు. వర్సిటీలో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపర్చేందుకు, పరిశోధనలు, అభివృద్ధికి అనువైన వాతావరణం కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు.


ప్రొఫెసర్‌ టీకేకేగా..

జేఎన్‌టీయూ కొత్త వీసీ టి.కిషన్‌కుమార్‌రెడ్డి వర్సిటీలో ప్రొఫెసర్‌ టీకేకేగా సుపరిచితులు. 1994 నుంచి 2016 వరకు యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌లోని మెకానికల్‌ విభాగంలో ప్రొఫెసర్‌గా సేవలందించారు. వర్సిటీ మెకానికల్‌ విభాగాధిపతిగా, ఆర్‌అండ్‌డీ డైరెక్టర్‌గా, అకడమిక్‌ ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌, రెక్టార్‌గా, ఓఎ్‌సడీగా పనిచేశారు. పదవీ విరమణ అనంతరం గుజరాత్‌లోని పండిట్‌ దీన్‌దయాళ్‌ పెట్రోలియం యూనివర్సిటీ వీసీగా పనిచేశారు. ఏఐసీటీఈలోనూ రెండేళ్లు పనిచేశారు. టీకేకే రెడ్డి 2010లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ ఉపాఽధ్యాయ అవార్డు, 2018లో ఐఏఏఎం పురస్కారాలు అందుకున్నారు. ఉస్మానియా వర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ నుంచి 1978లో బీఈ పూర్తిచేసిన టీకేకే, 1980లో మద్రాస్‌ ఐఐటీ నుంచి థర్మల్‌ పవర్‌ ఇంజనీరింగ్‌లో ఎంటెక్‌ చేశారు. ఆపై అమెరికాలో ఎంఎస్‌, పీహెచ్‌డీ పూర్తిచేశారు.


ఇవి కూడా చదవండి...

తప్పిన పెను విమాన ప్రమాదం.. అసలేం జరిగిందంటే..

భారత్‌లో నియామకాలు ప్రారంభించిన టెస్లా

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 19 , 2025 | 03:36 AM