Share News

Compensation: వడదెబ్బ మృతులకు 4 లక్షల పరిహారం

ABN , Publish Date - Apr 16 , 2025 | 04:20 AM

వడగాల్పులు, వడదెబ్బలతో మరణించిన వారికి రూ.4 లక్షల పరిహారం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఈ పరిహారం ప్రత్యేక విపత్తు నిధి నుంచి మంజూరు చేయనున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు.

Compensation: వడదెబ్బ మృతులకు 4 లక్షల పరిహారం

  • ప్రత్యేక విపత్తు నిధి నుంచి ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): వడగాల్పులు, వడదెబ్బల వల్ల మరణించిన వారికి రూ.4లక్షల చొప్పున పరిహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేసవిలో వడగాల్పులు, ఎండ తీవ్రతకు మృతి చెందే వారిని ప్రత్యేక విపత్తు కేటగిరి కింద పరిగణించి పరిహారం అందించాలని పేర్కొంటూ రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు రాష్ట్రంలో వేడి గాలుల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉన్నందున, ఆ సమయంలో సంభవించిన మరణాలకే ఈ పరిహారం వర్తిస్తుంది. విపత్తు నిర్వహణ శాఖ మార్గదర్శకాల ప్రకారం.. కలెక్టర్‌, వైద్యాధికారులు.. మృతుని మరణానికి కారణాన్ని ధ్రువీకరించిన తర్వాతే బాధిత కుటుంబానికి పరిహారం మంజూరు అవుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రైతు బీమా పథకంలో నమోదైన వారు వడగాల్పుల ప్రభావం వల్ల మరణిస్తే.. ఏ పథకం కింద ఎక్కువ మొత్తం వస్తుందో దానినే అమలు చేస్తామని తెలిపారు. వాతావరణ విభాగం మార్గదర్శకాల ప్రకారం.. 45 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నా, సాధారణ ఉష్ణోగ్రతకు 5 నుంచి 7 డిగ్రీలు అదనంగా ఉష్ణోగ్రతలు నమోదైన సందర్భాల్లోనే వడదెబ్బ మరణాలుగా గుర్తిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Updated Date - Apr 16 , 2025 | 04:22 AM