Ambedkar Jayanti: పండుగలా అంబేడ్కర్ జయంతి
ABN , Publish Date - Apr 14 , 2025 | 03:54 AM
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతిని పండుగలా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఆదివారం అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలను చేపట్టాలని అధికారులను ఆదేశించింది.

నేడు నిర్వహించేందుకు సర్కారు ఏర్పాట్లు
ట్యాంక్‌బండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించనున్న ముఖ్యమంత్రి, మంత్రులు
భావితరాలకు స్ఫూర్తి అంబేడ్కర్: సీఎం రేవంత్‌రెడ్డి
అంబేడ్కర్ వల్లే తెలంగాణ ఏర్పాటు: కేసీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతిని పండుగలా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఆదివారం అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలను చేపట్టాలని అధికారులను ఆదేశించింది. అంబేడ్కర్ జీవిత విశేషాలను తెలిపేలా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని సూచించింది. ఇటు ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న భారీ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించన్నారు. వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహతో పాటు పలువురు మంత్రులూ ఇందులో పాల్గొననున్నారు. అంబేడ్కర్ జయంతి నేపథ్యంలోనే భూభారతి పోర్టల్ ఆవిష్కరణతో పాటు ఎస్సీ వర్గీకరణ జీవోను ప్రభుత్వం అధికారికంగా విడుదల చేయనుంది.
అణగారిన వర్గాల సంక్షేమం కోసం అంబేడ్కర్ చేసిన కృషిని మరువలేనిదని సీఎం రేవంత్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీర్ఘదృష్టితో దేశ భవిష్యత్తును ఊహించి, దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించి భావి తరాలకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. అంబేడ్కర్ ఆశయాలను సాకారం చేయడానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఏర్పాటు కలను సాధ్యం చేసింది అంబేడ్కర్ రాజ్యాంగమేనన్నారు. ఆయన స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల అభ్యున్నతికి కట్టుబడి పనిచేస్తోందని.. ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపు వంటి కీలక నిర్ణయాలతో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని వెల్లడించారు. అణగారిన వర్గాల కోసం జీవితకాలం పోరాడిన దార్శనికుడు అంబేడ్కర్ అని కేసీఆర్ ఓ ప్రకటనలో కొనియాడారు. ముందుచూపుతో ఆయన రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందని పునరుద్ఘాటించారు. రాష్ట్ర సచివాలయానికి ఆయన పేరునే పెట్టామని వివరించారు.
ఎల్లుండి నుంచి జపాన్ పర్యటనకు సీఎం..
సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 16న జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. ఆయనతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రాష్ట్ర అధికారుల ప్రతినిధి బృందం ఈ పర్యటనలో పాలుపంచుకోనుంది. ఈ నెల 22వ తేదీ వరకు వీరు అక్కడే ఉండి ప్రముఖ కంపెనీలు, పారిశ్రామికవేత్తలతో చర్చలు జరుపుతారని సీఎంవో వెల్లడించింది.