Hyderabad: గోదావరి-బనకచర్ల చేపట్టొద్దు

ABN, Publish Date - Apr 08 , 2025 | 05:09 AM

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపడుతున్న గోదావరి-బనకచర్ల అనుసంధానంపై తెలంగాణ మరోసారి అభ్యంతరం వ్యక్తం చేసింది. బచావత్‌ ట్రైబ్యునల్‌ తీర్పునకు విరుద్ధంగా పోలవరం ప్రాజెక్టును విస్తరించి.. ఈ అనుసంధానం చేపడుతున్నారని తప్పుబట్టింది.

Hyderabad: గోదావరి-బనకచర్ల చేపట్టొద్దు
  • పోలవరం విస్తరణతో అనుసంధానం చేస్తున్నారు

  • గోదావరి బోర్డు సమావేశంలో తెలంగాణ అభ్యంతరం

  • ప్రాజెక్టు డీపీఆర్‌ను తెలంగాణకు ఇచ్చేందుకు ఏపీ ఓకే

  • పెద్దవాగు ఆధునికీకరణ పనులకు ఏపీ సమ్మతి

  • ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించబోమన్న 2 రాష్ట్రాలు

  • బోర్డు సభ్యకార్యదర్శిపై విచారణ కమిటీ: బోర్డు నిర్ణయం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపడుతున్న గోదావరి-బనకచర్ల అనుసంధానంపై తెలంగాణ మరోసారి అభ్యంతరం వ్యక్తం చేసింది. బచావత్‌ ట్రైబ్యునల్‌ తీర్పునకు విరుద్ధంగా పోలవరం ప్రాజెక్టును విస్తరించి.. ఈ అనుసంధానం చేపడుతున్నారని తప్పుబట్టింది. 1980లో బచావత్‌ ట్రైబ్యునల్‌ ఇచ్చిన తీర్పు ప్రకారం 10 వేల క్యూసెక్కుల (283 క్యూమెక్కుల) సామర్థ్యంతో పోలవరం కుడి, ఎడమ కాలువల నిర్మాణానికే అనుమతి ఉందని గుర్తు చేసింది. కానీ, ట్రైబ్యునల్‌ తీర్పునకు విరుద్ధంగా, ఎలాంటి సహేతుకత లేకుండా 2019లో 141వ టెక్నికల్‌ అడ్వయిజరీ కమిటీ (టీఏసీ)లో ఒక్కో కాలువ సామర్థ్యాన్ని 17,500 క్యూసెక్కుల (496 క్యూమెక్కుల)కు పెంచారని తెలిపింది. తాజాగా గోదావరి-బనకచర్ల అనుసంధానంలో భాగంగా 40 వేల క్యూసెక్కులకు పోలవరం కుడి ప్రధాన కాలువ పనులు చేపడుతున్నారని ఆక్షేపించింది. ఈ మేరకు సోమవారం జలసౌధలో జరిగిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) సమావేశంలో తెలంగాణ అధికారులు తమ అభ్యంతరాలను లేవనెత్తారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమవుతున్నందున.. తాడిపూడి ఎత్తిపోతల పథకాన్ని 2004-05లో చేపట్టారని, పోలవరం పూర్తయ్యాక దీనిని మూతపెట్టాలనేది ఒప్పందమని గుర్తు చేశారు. కానీ, తాడిపూడి కెనాల్‌ సామర్థ్యాన్ని 1400 క్యూసెక్కుల నుంచి 17 వేల క్యూసెక్కులకు పెంచే పనులు చేస్తున్నారని తెలిపారు. అయితే గోదావరి-బనకచర్ల అనుసంధానం (జీబీ లింక్‌) ప్రతిపాదనల దశలోనే ఉందని, ఇంకా డీపీఆర్‌ సిద్ధం కాలేదని ఏపీ అధికారులు చెప్పగా.. జీబీ లింక్‌లో భాగంగానే 2016లో చేపట్టిన పల్నాడు డ్రౌట్‌ మిటిగేషన్‌ ప్రాజెక్టును మళ్లీ చేపట్టారని తెలంగాణ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే రూ.1000 కోట్లకు పైగా పనులు పూర్తి చేశారని అన్నారు.


పెద్దవాగు ఆధునీకరణ చేపట్టాలి..

గోదావరిపై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగు శాశ్వత పునరుద్ధరణ కోసం రూ.92.50 కోట్లు అవుతాయని, ఈలోగా తాత్కాలిక మరమ్మతులకు రూ.15 కోట్లు అవసరమని తెలంగాణ గుర్తు చేసింది. దీంతో ఈ ప్రాజెక్టు కింద ఆయకట్టు ఉన్న మేరకు నిష్పత్తిని అనుసరించి నిధులు చెల్లించడానికి ఏపీ సుముఖత వ్యక్తం చేసింది. ఇక గోదావరి బేసిన్‌ పరిధిలో ఉన్న ప్రాజెక్టులను జీఆర్‌ఎంబీకి అప్పగించేందుకు తెలుగు రాష్ట్రాలు మరోసారి నిరాకరించాయి. షరతుల్లేకుండా ప్రాజెక్టులను అప్పగించే అంశాన్ని ఏమైనా పరిశీలిస్తారా అని ఏపీని బోర్డు చైర్మన్‌ ఏకే ప్రధాన్‌ కోరగా... అటువంటి ప్రసక్తే లేదని తెలిపింది. తెలంగాణ మాత్రం ఉమ్మడి ప్రాజె క్టు పెద్దవాగును మాత్రమే అప్పగిస్తామని చెప్పింది. ఇక అనుమతి లేని ప్రాజెక్టుల జాబితాలో తెలంగాణలో 11, ఏపీలో 4 ఉన్నాయని, డీపీఆర్‌లను ఎప్పట్లోగా దాఖలు చేస్తారని బోర్డు ప్రశ్నించింది. అయితే తాము ఇప్పటికే రెండు ప్రాజెక్టులను తొలగించాలని కోరామని తెలంగాణ తెలిపింది. 9 ప్రాజెక్టుల డీపీఆర్‌లను దాఖలు చేశామని, ఐదింటికి టీఏసీ అనుమతి వచ్చిందని, ఒకటి పరిశీలనలో ఉందని వివరించింది.


నిజ నిర్ధారణకు త్రిసభ్య కమిటీ..

గోదావరి బోర్డు సభ్యకార్యదర్శి అళగేషన్‌ వ్యవహార శైలిపై తెలుగు రాష్ట్రాల అధికారులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఉత్తర ప్రత్యుత్తరాల్లో ఆయన భాష, మహిళా ఉద్యోగినుల పట్ల అనుచిత వైఖరిపై విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీంతో వాస్తవాలు తెలుసుకునేందుకు తెలంగాణ, ఏపీ అంతరరాష్ట్ర వ్యవహారాల చీఫ్‌ ఇంజనీర్లతోపాటు బోర్డుకు చెందిన ఒక సభ్యుడితో త్రిసభ్య కమిటీని వేయాలని జీఆర్‌ఎంబీ నిర్ణయించింది. సభ్య కార్యదర్శి వ్యవహారశైలితోపాటు పాలన వ్యవహారాలు, ఆర్థిక అంశాలపై కూడా ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. బోర్డు చైర్మన్‌ ఏకే ప్రధాన్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ఈఎన్‌సీ(జనరల్‌) జి.అనిల్‌కుమార్‌, అంతరరాష్ట్ర విభాగం చీఫ్‌ ఇంజనీర్‌ మోహన్‌కుమార్‌, గోదావరి బేసిన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ సుబ్రమణ్యం ప్రసాద్‌, ఏపీ ఈఎన్‌సీ (ఇరిగేషన్‌) ఎం.వెంకటేశ్వరరావు, అంతరరాష్ట్ర విభాగం చీఫ్‌ ఇంజనీర్‌ సుగుణాకర్‌రావు హాజరయ్యారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అభయాంజనేయస్వామిని దర్శించుకున్న మంత్రి లోకేష్

దొంగల్లా సభకు వచ్చి సంతకాలు పెట్టి వెళుతున్నారు..

మరో ఆరుగురికి నోటీసులు.. విచారణ...

For More AP News and Telugu News

Updated Date - Apr 08 , 2025 | 05:09 AM