TG Farmers: ఉదయం భగ భగలు మధ్యాహ్నం జల్లులు
ABN , Publish Date - Apr 16 , 2025 | 03:31 AM
ఉదయం ఎండ, మధ్యాహ్నం వర్షాలు, అనంతరం మళ్లీ ఎండతో రాష్ట్రంలో వాతావరణం తీవ్రంగా మారింది. కరీంనగర్, నిజామాబాద్, మహబూబాబాద్‌లో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ విషయంలో వడదెబ్బతో ముగ్గురు మృతి చెందారు. కరీంనగర్, మహబూబ్‌నగర్, హైదరాబాద్‌లో ఈదురుగాలులు, ఉరుములతో వర్షాలు కురిసినట్టు వాతావరణ శాఖ తెలిపింది.

ఇందూరు, కరీంనగర్, మానుకోటలో
42 డిగ్రీలు.. వడదెబ్బతో ముగ్గురి మృతి
రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వానలు
నేడు, రేపూ పలు జిల్లాలకు వర్ష సూచన
వడదెబ్బ మృతులకు రూ.4 లక్షల పరిహారం
విపత్తు నిధి నుంచి ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
పగటి పూట దాకా మాడు పగిలేలా ఎండ.. ఆపై ఒక్కసారిగా కమ్ముకొచ్చే మబ్బులు.. చూస్తుండగానే టప టపా చినుకులు.. వాన దంచి కొట్టాక మళ్లీ ఎండ.. ఇలా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి సాయంత్రం దాకా భిన్న వాతావారణం నెలకొంటోంది. మంగళవారం నిజామాబాద్ జిల్లాలో 42.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కరీంనగర్‌లో 42.3, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో 42.2 డిగ్రీల ఉష్ణోగ్రత వచ్చింది. మెదక్, ఆదిలాబాద్, పెద్దపల్లి, జనగామ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 41 డిగ్రీలపైన ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు పలు ప్రాంతాల్లో 39.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక శుక్రవారం నుంచి రాష్ట్రంలో ఎండ తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆ రోజు నుంచి కొన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటే అవకాశం ఉందని పేర్కొంది. బుధ, గురు వారాల్లో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. వడదెబ్బతో మంగళవారం ముగ్గురు చనిపోయారు. మహబూబాబాద్ జిల్లా గార్లకు చెందిన బాదంపుడి సుశీల(57), కొత్తగూడ మండలం వేలుబెల్లిలో బాసాని మల్లమ్మ(65) వడదెబ్బతో మృతి చెందారు. కాళేశ్వరం ఆలయానికి వచ్చి.. పెద్దపల్లి జిల్లా ఎలిగేడుకు చెందిన కాంపెల్లి కనకయ్య(72) చనిపోయాడు.
పలు జిల్లాల్లో మోస్తరు వానలు..
రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం పలు చోట్ల మోస్తరు వర్షం కురిసింది. మహబూబ్‌నగర్ జిల్లాలో మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా.. సాయంత్రం అక్కడక్కడా ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. నవాబ్‌పేట మండలంలోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. సుమారు 180 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. కోయిలకొండ మండలంలో గాలి, వడగళ్ల వానతో కోతకు వచ్చిన వరి పంట నేలవాలింది. రోడ్లపై, కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం నీటిలో కొట్టుకుపోయింది. హన్వాడ మండలం దాచకపల్లిలో పిడుగుపాటుకు రెండు గేదెలు చనిపోయాయి. రంగారెడ్డి జిల్లాలో ఉదయం నుంచి ఎండ దంచి కొట్టగా మధ్యాహ్నం నుంచి పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో వర్షం పడింది. షాద్‌నగర్ పరిధిలోని అయ్యవారి పల్లిలో ఈదురు గాలులకు విద్యుత్ వైర్లు తెగి పడి ఇద్దరు బాలురు గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. యాచారం మండలంలో 200 ఎకరాల్లో వరి, 35 ఎకరాల్లో మామిడి తోటలు దెబ్బతిన్నాయి. మహేశ్వరం, కందుకూరు మండలాల్లో ఈదురు గాలులకు చెట్లు నేలకూలాయి. కొందుర్గు మండలంలోని పలు గ్రామాల్లో ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో 1.4 సెం.మీ, తాళ్లపల్లిలో 1.3 సెం.మీ, మేడ్చల్ మల్కాజిగిరి మండలం ఘట్‌కేసర్‌లో 1 సెం.మీ వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లోని బండ్లగూడ ఇందిరానగర్‌లో 1.7 సెం.మీ, చాంద్రాయణగుట్టలో 1.4 సెం.మీ వర్షపాతం నమోదైంది. నగరంలో మరో రెండు రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
రైతు కోసం.. మేము సైతం
నిత్యం శాంతి భద్రతలను పర్యవేక్షించే పోలీసులు రైతు కష్టం చూసి చలించిపోయారు. అకాల వర్షంతో ధాన్యం తడుస్తుండటం చూసి.. వాహనం దిగి పట్టాలు కప్పి రైతుకు ఆసరాగా నిలిచారు. మంగళవారం సాయంత్రం నల్లగొండ జిల్లా హాలియా మునిసిపాలిటీ పరిధిలోని ఇబ్రహీంపేట శివారులో ఈ ఘటన జరిగింది. నల్లగొండ స్పెషల్ టీం పోలీసులు నిడమనూరు మండలం బొక్కమంతలపాడులో విధులకు వెళ్లి తిరిగి హాలియాకు బయలుదేరారు. అదే సమయంలో చినుకులు పడుతుండటంతో రైతులు ఆందోళన చెంది ధాన్యంపై పట్టాలు కప్పుతుండగా, అటుగా వస్తున్న పోలీసులు అక్కడ ఆగి రైతులకు సహాయం చేశారు.
For AndhraPradesh News And Telugu News