Women Empowerment: మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Apr 16 , 2025 | 05:25 AM
మహిళా సాధికారతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. ప్రతి ఏడాది రూ.20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలతో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్నదే లక్ష్యమన్నారు

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ఽధ్యేయం
ప్రతి ఏటా మహిళలకు రూ.20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు
మహిళా సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి): కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మంగళవారం నగరంలోని తాజ్‌దక్కన్ హోటల్‌లో హైదరాబాద్ సిటీ పోలీస్, హైదరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో మహిళా సాఽధికారత, సమానత్వంపై ‘స్త్రీ సమ్మిట్ 2.0’ కార్యక్రమం జరిగింది. దీనికి భట్టి విక్రమార్క, సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ లావణ్య, హెచ్‌సీఎస్సీ జనరల్ సెక్రటరీ శేఖర్‌రెడ్డి, ఉమెన్స్ పోరం జాయింట్ సెక్రటరీ గీతా గోటితో కలిసి వారు జ్యోతి ప్రజ్వలన చేసిన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. స్త్రీ సమ్మిట్ అనేది కేవలం మాట్లాడుకోవడానికి ఏర్పాటు చేసి కార్యక్రమం కాదని, మహిళల గౌరవం, సమానత్వం, సాధికారత కోసం ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండేలా నిర్ణయం తీసుకోవాల్సిన వేదిక అని అన్నారు. మహిళా సాధికారత సమాజం ప్రతీ ఒక్కరి కలని, అది సాఽధించడానికి మనందరం కలిసి నడవాల్సిన అవసరం ఉందన్నారు. మహిళా అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. స్వయం సహాయక సంఘాలకు ఇప్పటివరకు రూ.21 వేల కోట్ల వడ్డీ లేని రుణాలను అందించామని, వచ్చే నాలుగేళ్లలో ప్రతి ఏటా రూ.20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలను అందిస్తామని భట్టి చెప్పారు.
నూతన హరిత ఇంధన విధానంలో మహిళలకు భాగస్వామ్యం కల్పించామని, మహిళా సంఘాలు ఉత్పత్తి చేసిన విద్యుత్తును ప్రభుత్వమే కొనుగోలు చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నామని ఆయన పేర్కొన్నారు. సీపీ ఆనంద్ మాట్లాడుతూ.. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో లింగ వివక్ష కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా సాధికారత సమానత్వం అనేది ఇంటి నుంచి ప్రారంభమై, ప్రతి పని ప్రదేశంలో అమలు చేసినప్పుడే సాధ్యమవుతందన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖతో కలిసి పనిచేయడానికి హెచ్‌సీఎస్సీ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ఉమెన్స్‌ఫోరం ప్రతినిధులు ప్రకటించారు. ఈ మేరకు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.