Corruption: ఏసీబీ వలకు చిక్కుతున్న లంచావతరాలు!
ABN , Publish Date - Feb 04 , 2025 | 05:09 AM
ప్రజలతో నేరుగా సంబంధం ఉండే రెవెన్యూ, హోం, మునిసిపల్, విద్యా, ఆర్థిక, పశు సంవర్ధక తదితర విభాగాల్లో అవినీతి పెరిగిపోయినట్లు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వరుస కేసులతో మరోసారి తేటతెల్లమవుతోంది.

జనవరిలోనే 20 అవినీతి కేసుల నమోదు
సోషల్ మీడియాలోనూ ఏసీబీకి ఫిర్యాదులు
హైదరాబాద్, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): ప్రజలతో నేరుగా సంబంధం ఉండే రెవెన్యూ, హోం, మునిసిపల్, విద్యా, ఆర్థిక, పశు సంవర్ధక తదితర విభాగాల్లో అవినీతి పెరిగిపోయినట్లు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వరుస కేసులతో మరోసారి తేటతెల్లమవుతోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచే అవినీతి అధికారులు, సిబ్బందిపై కొరడా ఝళిపించిన ఏసీబీ... జనవరిలో 20 కేసులు నమోదు చేసింది. వీటిలో సగం కేసులు నేరుగా లంచం తీసుకుంటూ పట్టుబడ్డవారివే. వారి నుంచి రూ.1.45 లక్షలు స్వాధీనం చేసుకుంది. కొందరు తెలివిగా ఆలోచించి తమ చేతికి మట్టి అంటకుండా ప్రైవేటు వ్యక్తులను నియమించుకుని లంచం తీసుకుంటున్నారు. ఆయా కేసుల్లో మొత్తం 17 మందిని అరెస్టు చేయగా వారిలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, ప్రైవేటు వ్యక్తులు కూడా ఉన్నారు. గిరిజన సంక్షేమ శాఖలో ఒకరిపై నమోదు చేసిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రూ. 65.50 లక్షల విలువైన స్థిర, చర ఆస్తులను గుర్తించారు.
లంచం డిమాండ్ చేస్తున్న అధికారులు, సిబ్బందిపై గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో ఫిర్యాదులు పెరిగాయి. నేరుగా ఏసీబీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేస్తున్నవారు కొందరైతే, ఆకాశరామన్న ఉత్తరాలు రాసి ఉప్పందిస్తున్నవారు మరికొందరు. ఏసీబీ టోల్‌ఫ్రీ నెంబరు 1064కు ఫిర్యాదులు వస్తున్నాయి. టెక్నాలజీ వాడకం పెరిగిన నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా కూడా ఫిర్యాదులు అందుతున్నాయి. తెలంగాణ ఏసీబీ పేరుతో ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలకు ఫిర్యాదులు, అవినీతి అధికారుల సమాచారం అందుతోందని ఆ శాఖ అధికారులు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై ప్రజలు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదుదారుల వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని వారు భరోసా ఇస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
KTR: రాష్ట్రంలో ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. వేటు తప్పదా..
Gun Firing Case: రూ.333 కోట్లు.. వంద మంది యువతులే టార్గెట్.. వెలుగులోకి ప్రభాకర్ నేరాలు
Supreme Court: తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత కేసు.. సుప్రీంకు కేటీఆర్
Read Latest Telangana News And Telugu News