SC Reservation: ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ
ABN , Publish Date - Apr 15 , 2025 | 04:45 AM
సుప్రీం కోర్టు తీర్పు తర్వాత దేశంలో ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సగర్వంగా ప్రకటించారు.

వర్గీకరణపై మాట్లాడిన పార్టీలన్నీ తీర్మానాలకే పరిమితం
ఇకపై ఇచ్చే అన్నినోటిఫికేషన్లకు ఎస్సీ రిజర్వేషన్ల వర్తింపు
మీడియాతో మంత్రులు ఉత్తమ్, దామోదర, పొన్నం
హైదరాబాద్, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): సుప్రీం కోర్టు తీర్పు తర్వాత దేశంలో ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సగర్వంగా ప్రకటించారు. ఎస్సీ వర్గీకరణ జీవోను విడుదల చేసి, మొదటి ప్రతిని సీఎం రేవంత్‌కు అందజేసిన అనంతరం.. మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్‌లతో కలిసి సోమవారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. వర్గీకరణపై గతంలో అసెంబ్లీలో అన్ని పార్టీల నేతలూ మాట్లాడేవారని.. కానీ, ఆ పార్టీలన్నీ ఈ అంశంపై శాసనసభలో తీర్మానానికి మాత్రమే పరిమితమయ్యాయని ఉత్తమ్ గుర్తుచేశారు. తమ ప్రభుత్వం ఏర్పడగానే ఎస్సీ వర్గీకరణకు ప్రయత్నాలు మొదలుపెట్టామని.. సుప్రీం తీర్పు రాగానే ఆ ప్రక్రియను వేగవంతం చేసి, మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసుకుని, వివిధ రాష్ట్రాల్లో పర్యటించి ముందుకెళ్లామని చెప్పారు.
రాజకీయాలకు చోటు లేకుండా న్యాయబద్ధంగా ఎస్సీ రిజర్వేషన్లు అమలు చేయడానికి వన్‌మ్యాన్ జ్యుడీషియల్ కమిషన్ పనిచేసిందని ఆయన పేర్కొన్నారు. సోమవారం (ఏప్రిల్ 14) నుంచే.. ప్రకారం ఎస్సీ వర్గీకరణ అమలవుతుందని, అన్ని శాఖల్లోని ఖాళీల లెక్కలూ తీసి, త్వరలో ఎస్సీ వర్గీకరణ ప్రకారం వాటి భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తామని మంత్రి చెప్పారు. అయితే.. గత ఏడాది ఆగస్టు ఒకటో తేదీకి ముందు ఇచ్చిన నోటిఫికేషన్లకు ఈ రిజర్వేషన్లు వర్తించవని, సుప్రీం కోర్టు తీర్పుకు లోబడి రిజర్వేషన్లు వర్తిస్తాయని ఉత్తమ్ వివరించారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా సామాజిక స్ఫూర్తితో ఎస్సీ వర్గీకరణను ప్రకటించామని ఆయన పేర్కొన్నారు. ఇక.. దళితుల్లో సామాజిక, ఆర్థిక వ్యత్యాసాలు ఉండకూడదని మంత్రి దామోదర రాజనర్సింహ అభిప్రాయపడ్డారు. ఆ ఉద్దేశ్యంతోనే మంత్రి ఉత్తమ్ అధ్యక్షతన కేబినెట్ కమిటీ ఏర్పాటు చేసుకుని.. వేల సంఖ్యలో వచ్చిన విజ్ఞప్తులపై అధ్యయనం చేశామని ఆయన వెల్లడించారు. విద్య, ఉద్యోగాల్లో ఇకపై ఇచ్చే నోటిఫికేషన్లకు ఎస్సీ వర్గీకరణ అమలవుతుందని.. భారీ స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నామని ఆయన స్పష్టంచేశారు. ఎస్సీ వర్గీకరణ 20ఏళ్ల పోరాటమని గుర్తు చేశారు.