Caste Survey: ‘కుల గణన’పై ఎవరూ మాట్లాడొద్దు
ABN , Publish Date - Apr 08 , 2025 | 04:56 AM
సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల(ఎస్‌ఈఈఈపీసీ) గణన సర్వేపై ప్రభుత్వం, రాజకీయ నాయకులు, మీడియా ప్రతినిధులు ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని సర్వేపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వతంత్ర నిపుణుల బృందం(ఐఈడబ్ల్యూజీ) సూచించింది.

ప్రభుత్వం, నాయకులు, మీడియాకు.. స్వతంత్ర నిపుణుల బృందం సూచన
హైదరాబాద్, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల(ఎస్‌ఈఈఈపీసీ) గణన సర్వేపై ప్రభుత్వం, రాజకీయ నాయకులు, మీడియా ప్రతినిధులు ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని సర్వేపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వతంత్ర నిపుణుల బృందం(ఐఈడబ్ల్యూజీ) సూచించింది. ఇండిపెండెంట్ ఎక్స్‌పర్ట్స్ వర్కింగ్ గ్రూపు చైర్మన్ జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం(ఎంసీహెచ్‌ఆర్‌డీ)లో బృందం సమావేశమైంది.
తాము కుల గణన వివరాలను సమగ్రంగా సమీక్షించి, విశ్లేషించే వరకు సర్వేపై అనుకూలంగా లేదా వ్యతిరేకంగా వ్యాఖ్యానించవద్దని బృందం హెచ్చరించింది. ఈ మేరకు కుల గణన సర్వేను బృందం సమీక్షించింది. సర్వేకు అనుసరించిన విధానం, శాస్త్రీయ పద్ధతిని బృందం అభినందించింది. కాగా, సర్వే డేటాను అధ్యయనం చేయడం, విశ్లేషించడంలో కృత్రిమ మేధ(ఏఐ) సాధనాల వినియోగంపై రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్.. ఆయన బృందం ఎక్స్‌పర్ట్స్ గ్రూపునకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించింది.