Hyderabad Metro: రెండు డీపీఆర్‌లు ఒకేసారి ఇవ్వండి
ABN , Publish Date - Apr 15 , 2025 | 05:37 AM
హైదరాబాద్ నగరంలో మెట్రో రెండోదశ పార్ట్-బీలోని మూడు కారిడార్లకు(జేబీఎ్‌స-మేడ్చల్, జేబీఎస్- శామీర్‌పేట్, శంషాబాద్ ఎయిర్‌పోర్టు- ఫోర్త్‌సిటీ) సంబంధించిన డీపీఆర్‌లను ఒక్కొక్కటిగా కాకుండా రెండింటినీ ఒకేసారి సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం మెట్రో అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.

మెట్రో రెండో దశ పార్ట్-బీ కారిడార్లపై మెట్రో అధికారులకు ప్రభుత్వం ఆదేశం!
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 14(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నగరంలో మెట్రో రెండోదశ పార్ట్-బీలోని మూడు కారిడార్లకు(జేబీఎ్‌స-మేడ్చల్, జేబీఎస్- శామీర్‌పేట్, శంషాబాద్ ఎయిర్‌పోర్టు- ఫోర్త్‌సిటీ) సంబంధించిన డీపీఆర్‌లను ఒక్కొక్కటిగా కాకుండా రెండింటినీ ఒకేసారి సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం మెట్రో అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. జేబీఎ్‌స-మేడ్చల్, జేబీఎ్‌స-శామీర్‌పేట్ కారిడార్లు రెండింటికి కలిపి అధికారులు నార్త్ సిటీ పేరిట ఒక డీపీఆర్‌ను, ఎయిర్‌పోర్టు-ఫోర్త్ సిటీ కారిడార్‌కు మరో డీపీఆర్‌ను రూపొందిస్తున్నారు. నార్త్ సిటీ కారిడార్ల డీఆపీఆర్ రూపకల్పన 80ు పూర్తైందని ఇటీవల సమీక్ష సందర్భంగా మెట్రో అధికారులు ప్రభుత్వానికి తెలియజేయగా.. ఫోర్త్ సిటీ మెట్రో డీపీఆర్‌ను కూడా రూపొందించి, రెండింటిని కలిపి తీసుకురావాలని ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు సమాచారం. అప్పుడే క్యాబినెట్ సమావేశంలో రెండింటిపై చర్చించి ఆమోదిస్తామని చెప్పడంతో అధికారులు ఆ దిశగా చర్యలు ప్రారంభించినట్లు తెలిసింది.
హడావుడిగా డీపీఆర్‌లను తయారు చేయొద్దని, ఒకటికి రెండు సార్లు ఆలోచించి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని రూపొందించాలని ప్రభుత్వ పెద్దలు మెట్రో అధికారులకు సూచించారు. ప్రధానంగా ఫోర్త్‌సిటీకి వెళ్లే మెట్రోపై స్థానిక పరిస్థితులు, అవసరాలపై అధ్యయనం చేయాలని, జనసాంద్రత కలిగిన ప్రదేశాల్లోనే స్టేషన్లను నిర్మించాలన్నారు. ఇదిలా ఉండగా, మెట్రో రైలు సంస్థలో పదవి విరమణ చేసి కాంట్రాక్టుపై పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో 28 మంది సీనియర్లను తొలగించారు. ఈ నేపథ్యంలో పార్ట్-బీ కారిడార్ల డీపీఆర్‌ల తయారీ, వివిధ రకాల పనులకు అవసరపడే సీనియర్ అధికారులకు మళ్లీ అవకాశం కల్పించాలని హెచ్‌ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రభుత్వ పెద్దలకు విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. కీలక అధికారుల సర్వీసును పొడిగిస్తే మే నెలలోగా రెండు డీపీఆర్‌లను పూర్తి చేసి సమర్పిస్తామని చెప్పినట్లు సమాచారం. ఫలితంగా 8-10 మందికి సర్వీస్ రెన్యువల్ అయ్యే అవకాశాలున్నాయి.