ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

High Court: బెనిఫిట్‌ షోలు రద్దంటూ.. స్పెషల్‌ షోకు అనుమతులా?

ABN, Publish Date - Jan 11 , 2025 | 04:40 AM

సినిమా బెనిఫిట్‌ షో, స్పెషల్‌ షోలకు అనుమతులు, టికెట్ల రేట్ల పెంపు అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది.

  • ‘గేమ్‌ చేంజర్‌’ అదనపు షోలు, టికెట్ల రేట్ల పెంపునకు ఎలా అనుమతిస్తారు?

  • తెల్లవారు జామున 4 గంటలకు ప్రత్యేక ప్రదర్శనలు అవసరమా..?

  • పునఃసమీక్షించాలంటూ హోంశాఖ ముఖ్య కార్యదర్శికి హైకోర్టు ఆదేశాలు

  • ఇకనైనా సర్కారు కళ్లు తెరవాలంటూ వ్యాఖ్య

  • రాత్రి 12 గంటల తర్వాత సినిమాలు, పబ్బులు ఎందుకని నిలదీత

  • పౌరుల జీవించే హక్కును కాపాడేందుకు ఎంత దూరమైనా వెళ్తామని స్పష్టం

హైదరాబాద్‌, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): సినిమా బెనిఫిట్‌ షో, స్పెషల్‌ షోలకు అనుమతులు, టికెట్ల రేట్ల పెంపు అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. గేమ్‌ చేంజర్‌ సినిమాకు తెల్లవారుజామున 4 గంటలకు స్పెషల్‌ షోతోపాటు అదనపు షోలు వేయడానికి, టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతినిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఇచ్చిన మెమోను పునఃసమీక్షించి మళ్లీ నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. పుష్ప-2 సినిమా తొక్కిసలాట నేపథ్యంలో బెనిఫిట్‌ షోలకు అనుమతివ్వబోమని చెప్పి స్పెషల్‌ షో పేరిట అనుమతివ్వడాన్ని తప్పుబట్టింది. అలాగే ఏ నియమ నిబంధనల ఆధారంగా టికెట్‌ రేట్లు పెంచారని నిలదీసింది. తాము ఇచ్చే ఆదేశాలతో ప్రభుత్వం కళ్లు తెరవాలని వ్యాఖ్యానించింది. అసలు రాత్రి 12 గంటల తర్వాత సినిమాలను, పబ్బులను నిషేధించాలని.. 16 ఏళ్ల లోపు పిల్లలు సినిమాలకు అనుమతించకుండా రూల్స్‌ తేవాలని పేర్కొంది. బెనిఫిట్‌ షోలకు అనుమతి ఇవ్వమని పేర్కొంటూనే గేమ్‌ చేంజర్‌ సినిమాకు అదనపు షోల ప్రదర్శనకు, టికెట్ల రేట్ల పెంపునకు అనుమతినిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి మెమో జారీచేయడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో వేర్వేరు పిటిషన్‌లు దాఖలయ్యాయి. వీటిపై జస్టిస్‌ బీ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది.


చట్ట విరుద్ధంగా మెమో ఇచ్చారు..

సినిమాటోగ్రఫీ చట్టం, జీవో 120 రూల్స్‌కు విరుద్ధంగా తెల్లవారుజామున 4 గంటల షోకు అనుమతించడం చెల్లదని పిటిషనర్ల తరఫున న్యాయవాదులు మామిండ్ల మహేశ్‌, శ్రీనివా్‌సరెడ్డి తదితరులు కోర్టు దృష్టికి తెచ్చారు. లైసెన్సింగ్‌ అథారిటీ కేవలం జిల్లా కలెక్టర్‌లకు, పోలీసు కమిషనర్‌లకు మాత్రమే ఉంటుందని.. అందుకు విరుద్ధంగా అధికార పరిధి కాకపోయినా హోంశాఖ ముఖ్యకార్యదర్శి మెమో జారీ చేశారని.. సదరు మెమోను కొట్టేయాలని విజ్ఞప్తి చేశారు. పుష్ప -2 సినిమా తొక్కిసలాట తర్వాత స్వయంగా సీఎం అసెంబ్లీ వేదికగా బెనిఫిట్‌ షోలకు అనుమతివ్వబోమన్నారని చెప్పారు. అందుకు విరుద్ధంగా బెనిఫిట్‌ షో అని కాకుండా స్పెషల్‌ షో పేరిట తెల్లవారుజామున 4 గంటలకు అనుమతిచ్చారన్నారు. అసెంబ్లీ వేదికగా శాసన వ్యవస్థ జారీ చేసిన ఆదేశాలు కార్యనిర్వాహక వ్యవస్థకు తెలియకపోవడమేంటని.. హోంశాఖ ముఖ్య కార్యదర్శికి అసెంబ్లీలో చర్చల వివరాలు తెలియవా? అని ప్రశ్నించారు. రెండు వ్యవస్థల మధ్య ఉన్న ఈ దూరాన్ని హైకోర్టు సవరించాలని కోరారు. ప్రభుత్వ వైఖరికి విరుద్ధంగా మెమో జారీ అయిందన్నారు.


మళ్లీ ఇలాంటి నిర్ణయమా..?

వాదనలు నమోదు చేసుకున్న అనంతరం కోర్టు స్పందిస్తూ.. ‘హోంశాఖ ముఖ్య కార్యదర్శి నిర్ణయం తీసుకునే ముందు ప్రజాప్రయోజనం, భద్రత, ప్రజారోగ్యం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకోవాల్సింది. తెల్లవారుజామున 4 గంటలకు సినిమా ప్రదర్శన అవసరం ఏముంది? బెనిఫిట్‌ షోలకు అనుమతి లేదని పేర్కొంటూనే మళ్లీ స్పెషల్‌ షోలకు అనుమతివ్వడం ద్వారా బెనిఫిట్‌ షో వద్దన్న నిర్ణయంపై వెనక్కి మళ్లారు. పుష్ప-2 తొక్కిసలాట తర్వాత ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకున్నారు. అర్ధరాత్రి తల్లిదండ్రులతో పాటు సినిమాలకు వెళ్లే పిల్లల పరిస్థితి ఏంటి? రాత్రి 12 గంటల తర్వాత థియేటర్లు, పబ్బులు మూయించాలి. భవిష్యత్తులో నిర్మాతలు పెట్టిన ఖర్చంతా రికవరీ చేయడానికి 24 గంటలు నిర్విరామంగా సినిమా ప్రదర్శించాలని అడుగుతారు.. అలా అనుమతిస్తారా?’ అని ప్రభుత్వాన్ని నిలదీసింది. రాజ్యాంగం ప్రసాదించిన పౌరుల జీవించే హక్కును కాపాడటానికి ఎంతదూరం వరకైనా ఆదేశాలు జారీ చేస్తామని వ్యాఖ్యానించింది. ప్రజాప్రయోజనం, భద్రత, ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని.. భవిష్యత్తులో తెల్లవారు జామున స్పెషల్‌ షోలకు అనుమతివ్వరాదని తేల్చి చెప్పింది. పుష్ప-2 సినిమా టికెట్‌ రేట్ల పెంపును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌తో కలిపి ఈ పిటిషన్లను ఈనెల 24వ తేదీకి వాయిదా వేసింది.

Updated Date - Jan 11 , 2025 | 04:40 AM