Share News

Ambedkar Jayanti: అంబేడ్కర్‌ జయంతి సాక్షిగా వర్గీకరణ అమల్లోకి..

ABN , Publish Date - Apr 15 , 2025 | 04:31 AM

వర్గాల వారీగా కేటాయించిన రిజర్వేషన్ల అమలు విధానం ఎలా ఉంటుంది, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అమలు విధానం సహా పలు అంశాలను వాటిలో సవివరంగా వెల్లడించింది.

Ambedkar Jayanti: అంబేడ్కర్‌ జయంతి సాక్షిగా వర్గీకరణ అమల్లోకి..

  • 4 ఉత్తర్వులు విడుదల చేసిన సర్కారు

  • ఇక అన్ని ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీకి

  • వర్గీకరణ ప్రకారమే ఎస్సీ రిజర్వేషన్లు

  • 2-3 వారాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు!

  • పరీక్షలకు సిద్ధం కండి

  • యువతకు మంత్రి దామోదర పిలుపు

  • ఆయనకు మాదిగ, ఉపకులాల సంఘాల నేతల కృతజ్ఞతలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ జయంతి సాక్షిగా.. ఎస్సీ వర్గీకరణ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం పచ్చ జెండా ఊపింది. వర్గీకర ణపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన 9 నెలల కాలంలోనే ఆ ప్రక్రియను చేపట్టి, అసెంబ్లీలో తీర్మానం చేసి, దానికి చట్టబద్ధత కూడా కల్పించిన రాష్ట్ర సర్కారు.. వర్గీకరణ అమలుకు నాలుగు ఉత్తర్వులను సోమవారం విడుదల చేసింది. వాటిలో న్యాయశాఖ జీవో ఎం.ఎస్‌ నంబరు 33ను విడుదల చేయగా.. ఎస్సీ సంక్షేమ శాఖ జీవో ఎం.ఎస్‌ 9, 10, 99 నంబర్లతో మూడు ఉత్తర్వులను విడుదల చేసింది. వర్గాల వారీగా కేటాయించిన రిజర్వేషన్ల అమలు విధానం ఎలా ఉంటుంది, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అమలు విధానం సహా పలు అంశాలను వాటిలో సవివరంగా వెల్లడించింది. ఉద్యోగ భర్తీల్లో రోస్టర్‌ పాయింట్ల కేటాయింపును కూడా పొందుపరిచింది. ఇక నుంచి ప్రభుత్వం ప్రకటించబోయే అన్ని ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీలకూ వర్గీకరణ ప్రకారం కేటాయించిన రిజర్వేషన్లు ఎస్సీలకు వర్తిస్తాయని పేర్కొంది. అంటే.. రాష్ట్రంలో ఇప్పటివరకూ ఎస్సీలకు గంపగుత్తగా అమలైన 15శాతం రిజర్వేషన్లు ఇక నుంచి వర్గీకరణ ప్రకారం అమలుకానున్నాయి. సర్కారు ఇచ్చిన జీవోల్లో ఏం ఉందంటే..


జీవో నంబరు 33: శాసనసభ, మండలిలో ఆమోదం పొందిన ఎస్సీ వర్గీకరణ తీర్మానం ఏప్రిల్‌ 8న గవర్నర్‌ ఆమోదం పొందింది. ఆ విషయాన్ని తెలుపుతూ.. ఎస్సీ రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ చట్టం (15) 2025ను తెలుగు, ఇంగ్లిష్‌, ఉర్దూలో గెజిట్‌లో ప్రచురించినట్టు న్యాయశాఖ పేర్కొంది. జీవో నంబరు 9లో.. తెలంగాణ షెడ్యూల్డు కులాల(రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ) చట్టం-2025’ ఏప్రిల్‌ 14 నుంచి అమల్లోకి వస్తున్నట్టు పేర్కొంది.

జీవో నంబరు 99: ‘తెలంగాణ షెడ్యూల్డు కులాల(రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ) చట్టం-2025’ మేరకు ఉద్యోగ నియామకాల్లో అనుసరించాల్సిన రోస్టర్‌ పాయింట్లను వర్గీకరించింది. ఈమేరకు తెలంగాణ రాష్ట్ర సబార్డినేట్‌ సర్వీస్‌ రూల్స్‌-1996ను సవరించారు. వంద పోస్టులను భర్తీ చేయాలనుకున్నప్పుడు... షెడ్యూల్డు కులాలన్నింటికీ కలిపి ఇదివరకు 15 రోస్టర్‌ పాయింట్లు అమలయ్యేవి. తాజాగా ఈ పాయింట్లను గ్రూపులవారీగా వర్గీకరించారు. గ్రూపు-1కు 7వ నెంబరు, గ్రూపు-2కు 2, 16, 27, 47, 52, 66, 72, 87, 97, గ్రూపు-3కి 22, 41, 62, 77, 91 రోస్టర్‌ పాయింట్లు అమలవుతాయని పేర్కొన్నారు.


జీవో నంబరు 10: రిజర్వేషన్‌లో ఒక గ్రూపు కోసం నోటిఫై చేసిన పోస్టులు, భర్తీకాని ఖాళీలను తదుపరి ప్రాధాన్య గ్రూపులోని అభ్యర్థులతో భర్తీ చేయాలని సూచించింది. దీని ప్రకారం.. గ్రూప్‌-1లో గుర్తించిన కులాల వారితో ఉద్యోగ ఖాళీలు భర్తీకాకపోతే.. వాటిని తదుపరి ప్రాధాన్య గ్రూప్‌-2లోని కులాల ద్వారా భర్తీ చేయాలని.. అలా కూడా భర్తీ కానివాటిని ఆ తరువాత ఉన్న గ్రూప్‌-3లోని కులాల వారి ద్వారా భర్తీ చేయాలని సూచించింది. ఒకవేళ ఈ మూడు గ్రూపుల్లో తగిన అభ్యర్థులు లేకపోతే భర్తీ చేయని ఖాళీలను (మహిళా అభ్యర్థులతో సహా) క్యారీ ఫార్వర్డ్‌ చేయాలని పేర్కొంది. అంతే తప్ప, ఇతర కులాల అభ్యర్థులతో భర్తీ చేయొద్దని స్పష్టతనిచ్చింది. ఇప్పటికే ప్రకటించిన ఉద్యోగ ప్రకటనలకు ఈ రిజర్వేషన్లు వర్తించవని పేర్కొంది. ఏప్రిల్‌ 14, 2025 నుంచి వచ్చే ఉద్యోగ ప్రకటనలకే ఇది వర్తించనున్నట్టు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్రం ఆధీనంలోని విద్యా సంస్థల్లో పోస్టులు, ప్రవేశాలకు వర్గీకరణ నిబంధనలు వర్తించవు. కాగా.. ఈ జీవోలో గ్రూపులవారీగా వర్తించే రోస్టర్‌ పాయింట్ల వివరాలను కూడా పేర్కొన్నారు.

  • విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ఉద్యోగ భర్తీల్లో గ్రూపులవారీగా కేటాయించిన రిజర్వేషన్‌ ప్రకారం నిబంధనలు వర్తిస్తాయి. గ్రూపు-1కు 1 శాతం, గ్రూపు-2కు 9శాతం, గ్రూపు-3కు 5శాతం చొప్పున రిజర్వేషన్లు అమలుకానున్నాయి.

  • మహిళలకు ప్రస్తుతం అమల్లో ఉన్న 33.1/3 శాతం ప్రకారమే ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు అమలవుతాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

Raj Kasireddy: రాజ్ కసిరెడ్డి కోసం హైదరాబాద్‌లో గాలింపు

Gutkha Khaini: గుట్కా తయారీలో వాడేవి ఇవే.. తింటే డైరెక్ట్‌గా అక్కడికే..

Kancha Gachibowli: కంచ గచ్చిబౌలిపై సుప్రీంలో అఫిడవిట్.. తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పిందంటే..

New Delhi: విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆ టెర్మినల్‌లోకి నో ఎంట్రీ

UPI Transactions: ఫోన్‌పే, గూగుల్‌పే చేస్తున్నారా ఈ 12 అంకెల యూటీఆర్ చరిత్ర తెలుసా

For AndhraPradesh News And Telugu News

Updated Date - Apr 15 , 2025 | 04:31 AM