Farmers: రుణాల కోసం పాస్‌పుస్తకాలు అడగొద్దు
ABN, Publish Date - Jan 16 , 2025 | 03:43 AM
తెలంగాణ భూభారతి(రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్) చట్టం-2025 గెజిట్ విడుదలయింది. తెలంగాణ భూమి హక్కులు పట్టాదార్ పాస్‌పుస్తకం-2020(ధరణి)ను సవరించి, ఇటీవలే ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తెచ్చిన విషయం విదితమే.
వ్యవసాయేతర, అబాదీ భూములకు ప్రత్యేక పోర్టల్
భూభారతి చట్టం-25 గెజిట్ విడుదల
హైదరాబాద్, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ భూభారతి(రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్) చట్టం-2025 గెజిట్ విడుదలయింది. తెలంగాణ భూమి హక్కులు పట్టాదార్ పాస్‌పుస్తకం-2020(ధరణి)ను సవరించి, ఇటీవలే ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తెచ్చిన విషయం విదితమే. భూభారతి బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ఇది చట్టరూపం దాల్చగా బుధవారం గెజిట్ విడుదలయింది. కొత్త చట్టం ప్రకారం పంట రుణాల కోసం బ్యాంకుల్లో పట్టాదార్ పాస్‌పుస్తకం-టైటిల్ డీడ్ సమర్పించాల్సిన అవసరం లేదు. ఎలకా్ట్రనిక్ రికార్డులను పరిశీలించి, ఆ రికార్డుల్లో బ్యాంకులో పంట రుణం తీసుకున్నట్లు బ్యాంకర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ బ్యాంకర్లు రైతుల నుంచి పట్టాదారు పాస్ పుస్తకాలను అడగొద్దు.
రైతులు పంట రుణం చెల్లిస్తే.. వెంటనే ఆ రికార్డులను నవీకరించాల్సి ఉంటుంది. వ్యవసాయేతర భూముల వివరాలతో పాటు అబాదీ భూముల కోసం ప్రత్యేకంగా పోర్టల్‌ను సిద్ధం చేయనున్నారు. ఇక రైతులు తీసుకున్న పంట రుణాలు కట్టకపోతే.. ఆ రుణం వసూలు కోసం జిల్లా కలెక్టర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. కొత్త చట్టం ప్రకారం.. రికార్డులను ఎలకా్ట్రనిక్ రూపంలోనూ భద్రపరచనున్నారు. రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తారు. ఇక కొత్త చట్టంలో అప్పీల్ వ్యవస్థను పునరుద్ధరించారు. తహసీల్దార్ నిర్ణయాన్ని 60 రోజుల్లోగా ఆర్డీవో, ఆర్డీవో నిర్ణయంపై కలెక్టర్‌కు అప్పీల్ చేసుకునే అవకాశం ఇచ్చారు. ప్రతీ కమతం సరిహద్దులను పక్కాగా కొలిచి.. ఆ హద్దులకు చెందిన వివరాలతో భూదార్ కార్డులు జారీ చేయనున్నారు. ఇక భూభారతి చట్టం అమలు కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంటుంది. నోటిఫై చేసిన రోజు నుంచి ఈ చట్టం అమల్లోకి రానుంది.
Updated Date - Jan 16 , 2025 | 03:43 AM