Telangana - LRS: ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు నిర్ధారణ..!
ABN , Publish Date - Feb 22 , 2025 | 05:08 AM
ఎల్‌ఆర్‌ఎస్ (లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం) దరఖాస్తుల పరిశీలనలో ఇబ్బందులను అధిగమించేలా మరింత సులభతర విధానాలను అమలు చేయడానికి సర్కారు సిద్ధమైంది.

ప్రభుత్వ భూమి, జలవనరుల సమీపంలోనివి కాకుండా
మిగిలిన దరఖాస్తులన్నింటికీ ‘ఆటోమేటిక్ ఫీ జనరేషన్’
రుసుము సమాచారం నేరుగా దరఖాస్తుదారులకే!
ఒకట్రెండు రోజుల్లో అందుబాటులోకి ప్రత్యేక సాఫ్ట్‌వేర్
నేడు మార్గదర్శకాలు జారీ చేయనున్న సర్కారు
ఫీజు వసూళ్లపై సబ్‌రిజిస్ట్రార్లకు సర్క్యులర్
హైదరాబాద్, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): ఎల్‌ఆర్‌ఎస్ (లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం) దరఖాస్తుల పరిశీలనలో ఇబ్బందులను అధిగమించేలా మరింత సులభతర విధానాలను అమలు చేయడానికి సర్కారు సిద్ధమైంది. ఇప్పటికే దరఖాస్తుదారులకు ఊరట కల్పించేలా ఉత్తర్వులను సవరించి, ఫీజు రాయితీని ప్రకటించిన ప్రభుత్వం.. దరఖాస్తుల పరిశీలననూ సులభతరం చేసేందుకు సన్నద్ధమైంది. ఇందులో భాగంగా ప్రభుత్వ భూములు, జలవనరులకు ఆనుకొని ఉన్న సర్వే నంబర్లకు సంబంధించిన దరఖాస్తులను మినహాయించి.. మిగిలిన వాటన్నింటికీ ఒకేసారి రుసుమును నిర్ధారించనుంది. ఇందుకోసం ఒకట్రెండు రోజుల్లో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిసింది. దీనిపై మరింత స్పష్టత ఇస్తూ శనివారం మార్గదర్శకాలు విడుదల చేయనుంది. ఎల్‌ఆర్‌ఎ్‌సపై కొన్ని సవరణలు చేస్తూ ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులిచ్చింది. వాటికి అనుబంధంగా ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీలనను సులభతరం చేస్తూ మార్గదర్శకాలను జారీ చేయనుంది. ముఖ్యంగా ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌కు 200 మీటర్ల దూరంలో ఉండే ప్లాట్ల విషయంలో నీటిపారుదల శాఖ, రెవెన్యూ, మునిసిపల్ సంయుక్త విచారణ నుంచి మినహాయింపు ఇవ్వడం; ప్రభుత్వ భూములను ఆనుకొని లేని సర్వే నంబర్లలో వేసిన లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు పెట్టిన దరఖాస్తుల విషయంలో కూడా సంయుక్త విచారణ అవసరం లేకుండా మార్పులు చేపట్టారు.
రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన 25.68 లక్షల దరఖాస్తుల్లో జలవనరులు, ప్రభుత్వ భూముల సమీపంలో ఉండే వాటిని మినహాయించి మిగిలిన అన్ని దరఖాస్తులకు ఒకేసారి రుసుము ఖరారు చేసేలా ‘ఆటోమేటిక్ ఫీ జనరేషన్’ విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. రుసుమును నిర్ధారించి, నేరుగా దరఖాస్తుదారునికి సమాచారం పంపేలా సాఫ్ట్‌వేర్‌ను వినియోగించనున్నారు. రుసుము చెల్లించే సమయంలో అవసరమైన పత్రాలను పరిశీలించి, తదుపరి చర్యలు తీసుకునేలా మార్పులు చేశారు. ఎల్‌ఆర్‌ఎస్ కోసం వచ్చిన దరఖాస్తుల్లో సుమారు 13,300 అనధికారిక లేఅవుట్లు ఉన్నాయని, వీటిలో 6 లక్షలకు పైగా అమ్ముడవని ప్లాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అనధికారిక ప్లాట్లు కలిగి, క్రమబద్ధీకరణకు వ్యక్తిగత దరఖాస్తులు పెట్టిన వారు కూడా లక్షల్లో ఉన్నారు. ఇక జగిత్యాల, అచ్చంపేట, నారాయణపేట, కొల్లాపూర్, కల్వకుర్తి, అనపర్తి, మంచిర్యాల, సిద్ధిపేట వంటి ప్రాంతాల్లో లేఅవుట్లు వేసినా 90 శాతం మంది ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు చేసుకోలేదని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఇలా మారుమూల ప్రాంతాల్లోని లేఅవుట్లలో కొనుగోలు చేసిన వారు.. ఆ స్థలాన్ని ఒక పెట్టుబడిగా చూసుకుంటారని, వివిధ అవసరాల కోసం దాన్ని వినియోగించుకునేవారే ఎక్కువ మంది ఉన్నారని పురపాలక అధికారులు చెబుతున్నారు. రుసుములు చెల్లించి లేఅవుట్ క్రమబద్ధీకరణ పొందాలనే ఆలోచన చాలా మందికి ఉండదంటున్నారు. అవసరమైనప్పుడు ఫీజు చెల్లించవచ్చని లేదా అమ్మేస్తే కొనుక్కున్నవాళ్లు చూసుకుంటారన్న ఆలోచనతో ఎక్కువమంది ఉంటారని అంటున్నారు. కాగా, తాజా ఉత్తర్వుల నేపథ్యంలో రిజిస్ట్రేషన్లు పెరుగుతాయని, క్రమబద్ధీకరణకు దరఖాస్తుదారులు స్పందిస్తారని ప్రభుత్వం ఆశిస్తోంది.
ఫీజు వసూళ్లపై సబ్‌రిజిస్ట్రార్లకు సర్క్యులర్
ప్రభుత్వం ఇచ్చిన జీవో 28 ద్వారా ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులు నేరుగా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లి ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు, ఓపెన్‌సైట్ ఫీజు రాయితీ ద్వారా చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకునే వెసులుబాటు ఉంది. ఈ నేపథ్యంలో దరఖాస్తుల నుంచి ఎంత రుసుము వసూలు చేయాలి? ఏ ఫీజులో రాయితీ ఇవ్వాలి? వంటి అంశాలపై స్పష్టతనిస్తూ శనివారం ఎస్‌ఆర్‌వోలకు సర్క్యులర్ జారీ చేయనున్నట్లు తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి...
Scandal Exposed: భర్త వేరే మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య..
BJP: సికింద్రాబాద్‌లో బీజేపీ శ్రేణుల సంబురాలు..
Water Shortage: పట్టణాల్లో నీటికి కటకట
Read Latest Telangana News and Telugu News