Seethakka: లక్ష మంది మహిళలతో భారీ సభ
ABN , Publish Date - Mar 08 , 2025 | 04:04 AM
అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం లక్ష మంది మహిళల తో సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో శనివారం భారీ బహిరంగ సభ నిర్వహించనుంది.

నేడు పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న రాష్ట్ర ప్రభుత్వం
ఇందిరా మహిళాశక్తి మిషన్‌ను ఆవిష్కరించనున్న సీఎం రేవంత్
హాజరుకానున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు
సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సీతక్క
హైదరాబాద్, మార్చి7 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం లక్ష మంది మహిళల తో సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో శనివారం భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళాశక్తి మిషన్-2025ను సీఎం రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా ఆవిష్కరించనున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క ఆధ్యక్షతన జరిగే ఈ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు, అధికారులు పాల్గొననున్నారు. మహిళా సంఘాలు ఏడాది కాలంలో సాధించిన విజయాలతోపాటు మహిళా సాధికారత కోసం ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమాలను ఇందిరా మహిళాశక్తి మిషన్-2025లో పొందుపరిచారు. కాగా ఈ సభకు వివిధ జిల్లాల నుంచి వచ్చే మహిళల కోసం ప్రభుత్వం 600కుపైగా ఆర్టీసీ బస్సులను సెర్ప్ ఆధ్వర్యంలో అందుబాటులో ఉంచారు. మహిళలు ఇంటి నుంచి బయలుదేరినప్పటి నుంచి తిరిగి ఇంటికి సురక్షితంగా చేరుకునేవరకు సమన్వయం చేసుకునేలా ప్రత్యేక అధికారులను నియమించారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సదుపాయాలను కల్పించనున్నారు. దూర ప్రాంతాల నుంచి మహిళలు వచ్చే అవకాశం ఉండటంతో రాత్రి ఏడున్నర గంటలలోపు సభను ముగించేలా సంబంధిత విభాగాలు ఏర్పాట్లు చేస్తున్నాయి.
ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి సీతక్క
పరేడ్ గ్రౌండ్‌లో బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి సీతక్క శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. సభకు వచ్చే మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. తాగు నీరు, విద్యుత్ నిరంతరాయంగా అందేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. సచివాలయంలో జిల్లా డీఆర్డీఏ, జిల్లా మహిళా సమాఖ్య సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి.. మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర మహిళలకు మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు.