Renewable Energy: పునరుత్పాదక విద్యుత్తుకు పెద్ద పీట
ABN, Publish Date - Jan 14 , 2025 | 03:11 AM
రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తి ప్రాజెక్టులను పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు తెలంగాణ సర్కారు చర్యలు తీసుకుంటోంది.
సౌర, పవన, పంప్డ్, వేస్ట్ టు ఎనర్జీ తదితర ప్లాంట్లు ఏర్పాటు చేసే వారికి భారీ ప్రోత్సాహకాలు
50 ఉద్యోగాలిస్తే.. రూ.5 లక్షలు నియామక సాయం
తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ-2025లో స్పష్టం
హైదరాబాద్, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తి ప్రాజెక్టులను పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు తెలంగాణ సర్కారు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా సౌర, పవన, డిస్ర్టిబ్యూటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ, ఎనర్జీ స్టోరేజీ ప్రాజెక్టులు, జియోథర్మల్, గ్రీన్ హైడ్రోజన్, హైబ్రిడ్ వంటి పునరుత్పాదక విద్యుదుత్పత్తి ప్రాజెక్టులను నెలకొల్పే వారికి భారీగా రాయితీలు, ప్రోత్సాహకాలను అందించాలని నిర్ణయించింది. ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన పరికరాలు, యంత్రాల తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేసే వారికీ ఈ ప్రోత్సాకాలను ఇవ్వనుంది. ఇందుకు సంబంధించిన ‘తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ- 2025’ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి తాజాగా ఆవిష్కరించారు. ఈ పాలసీని అమల్లోకి తెస్తూ ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి సందీ్‌పకుమార్ సుల్తానియా ఉత్తర్వులు సైతం జారీ చేశారు. రాష్ట్ర పునరుత్పాదక విద్యుత్ సరఫరా సామర్థ్యం(కాంట్రాక్టెడ్ కెపాసిటీ) ప్రస్తుతం 10,338.20 మెగావాట్లు ఉండగా 2029-30 నాటికి 31,537 మెగావాట్లకు.. 2034-35 నాటికి 50,063 మెగావాట్లకు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. పదేళ్లపాటు ఈ పాలసీ అమల్లో ఉంటుంది.
భారీగా ప్రోత్సాహకాలు..
పాలసీలో భాగంగా డిస్కంలు టారిఫ్ ఆధారిత కాంపిటేటివ్ బిడ్డింగ్ ద్వారా ఈ విద్యుత్ కేంద్రాల నుంచి కరెంటు కొనుగోలుకు బిడ్లను ఆహ్వానించనున్నాయి. బిడ్డింగ్‌లో గెలిచిన సంస్థకు మార్కెట్ రేటులో 10 శాతం లీజు రేటుగా నిర్ణయించి భూములను కేటాయిస్తారు. డెవలపర్లు రాష్ట్రంలో సౌర, పవన విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుని ప్రైవేటు సంస్థలకు ఓపెన్ యాక్సెస్ ద్వారా విద్యుత్ అమ్ముకోవచ్చు. ఎకరాకు రూ.లక్ష ధరతో ఇలాంటి ప్రాజెక్టులకు ప్రభుత్వం 25 ఏళ్లు లేదా ప్రాజెక్టు జీవిత కాలానికి సర్కారు స్థలాలను కేటాయిస్తుంది. నాలా కన్వర్షన్ నుంచి మినహాయింపు ఇవ్వడంతో పాటు టీజీ-ఐపాస్ ద్వారా సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇస్తుంది. భూముల కొనుగోళ్లపై స్టాంప్ డ్యూటీ 100 శాతం తిరిగి చెల్లిస్తుంది. ఆయా ప్రాజెక్టులకు పారిశ్రామిక హోదా కల్పించి రాష్ట్ర పారిశ్రామిక విధానం కింద అందించే అన్ని రకాల ప్రోత్సాహకాలను సర్కారు అందిస్తుంది.
వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టులకు 100 శాతం రాష్ట్ర జీఎస్టీ తిరిగి చెల్లిస్తుంది. సౌర, పంప్డ్ స్టోరేజీ, బ్యాటరీ స్టోరేజీ, ఇతర ప్రాజెక్టులకు 50 శాతం రాష్ట్ర జీఎస్టీ తిరిగి చెల్లింపు ఉంటుంది. అలాగే, సౌర, పవన విద్యుత్ కేంద్రాల పరికరాల తయారీ పరిశ్రమలు స్థాపిస్తే మూలధన పెట్టుబడిలో 25 శాతం.. బ్యాటరీల తయారీ పరిశ్రమలు స్థాపిస్తే 20శాతం పెట్టుబడి రాయితీని.. రూ.30కోట్ల గరిష్ఠ పరిమితికి లోబడి 5 ఏళ్లలో ప్రభుత్వం ఇవ్వనుంది. పరికరాలు, యంత్రాల తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేసి రెండేళ్లలో 50 మంది తెలంగాణ స్థానికులకు ఉద్యోగాలిస్తే రూ.5 లక్షలను రిక్రూట్‌మెంట్ సహాయంగా అందజేయనుంది. ఉత్పత్తులపై ఏడేళ్ల పాటు 100శాతం రాష్ట్ర జీఎస్టీని రీయింబర్స్ చేయనుంది. తెలంగాణ జెన్‌కో, డిస్కంలలో ఇంక్యుబేషన్ సెంటర్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. వినూత్న ఆలోచనలు, స్టార్ట్‌పలను ప్రోత్సహించడానికి రూ.50 కోట్ల ఇంక్యుబేషన్ ఫండ్‌ను ప్రభుత్వం సృష్టించనుంది.
Updated Date - Jan 14 , 2025 | 03:11 AM