40-50 కిలోమీటర్లకో టోల్‌ప్లాజా
ABN , Publish Date - Jan 21 , 2025 | 05:49 AM
రీజినల్ రింగు రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్) దక్షిణ భాగాన్ని సకల హంగులతో, అత్యంత భద్రతతో, సౌకర్యవంతంగా తీర్చిదిద్దనున్నారు. రహదారి నిర్మాణ ఆకృతి, రహదారి మార్గంలో విద్యుత్ స్తంభాలు, పైపు లైన్లు, టెలిఫోన్ లైన్లు తొలగించి, తిరిగి అమర్చడంపై ‘సమగ్ర ప్రాజెక్టు నివేదిక’ను రూపొందించేందుకు సలహా సంస్థల(కన్సల్టెంట్లు) ఎంపిక కోసం ప్రభుత్వం ఇటీవల టెండర్లను పిలిచింది.

అక్కడే రోడ్డుకు ఇరు వైపులా రెస్ట్‌రూమ్‌లు
ఐదేసి ఎకరాల్లో ప్రయాణికులకు సౌకర్యాలు
రెస్టారెంట్లు, భారీ వాహనాలకు పార్కింగ్
పెరిగే ట్రాఫిక్ దృష్ట్యా అండర్‌పా్‌సలు
సకల హంగులతో ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగం
189 కి.మీ.కు బదులు 200 కి.మీ. రోడ్డు
డీపీఆర్ తయారీకి సిద్ధమైన ప్రభుత్వం
ఆర్‌ఆర్‌ఆర్ కొత్త అలైన్‌మెంటుకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం ప్రయత్నం
హైదరాబాద్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): రీజినల్ రింగు రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్) దక్షిణ భాగాన్ని సకల హంగులతో, అత్యంత భద్రతతో, సౌకర్యవంతంగా తీర్చిదిద్దనున్నారు. రహదారి నిర్మాణ ఆకృతి, రహదారి మార్గంలో విద్యుత్ స్తంభాలు, పైపు లైన్లు, టెలిఫోన్ లైన్లు తొలగించి, తిరిగి అమర్చడంపై ‘సమగ్ర ప్రాజెక్టు నివేదిక’ను రూపొందించేందుకు సలహా సంస్థల(కన్సల్టెంట్లు) ఎంపిక కోసం ప్రభుత్వం ఇటీవల టెండర్లను పిలిచింది. టెండర్ నోటీసులో సలహా సంస్థలకు చేసిన పలు సూచనల ద్వారా ఆర్‌ఆర్‌ఆర్ స్వరూపం ఎలా ఉండబోతోందో తెలుస్తోంది. దాని ప్రకారం ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణభాగం రహదారి చౌటుప్పల్-ఆమనగల్-సంగారెడ్డి మధ్య 200 కిలోమీటర్ల పొడవున ఉండనుంది. ఇందులో 40 లేదా 50 కిలోమీటర్ల దూరానికి ఒకటి చొప్పున 4 నుంచి 5 టోల్ ప్లాజాలు వస్తాయి. టోల్ ప్లాజాల దగ్గరే రోడ్డుకు ఇరువైపులా ఐదేసి ఎకరాల్లో వాహనదారుల కోసం రెస్ట్‌రూమ్ సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు. వే సైడ్ ఎమినిటీ్‌సగా పేర్కొనే ఈ సౌకర్యాల్లో భాగంగా చిన్న వాహనాల పార్కింగ్, పెద్ద వాహనాల పార్కింగ్, విశ్రాంతి గదులు, రెస్టారెంట్లు ఉంటాయి. టోల్‌ప్లాజాలు, వేసైడ్ ఎమినిటీస్ ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలో కన్సల్టెంట్లు సూచించాల్సి ఉంటుంది.
భవిష్యత్‌లో పెరగబోయే ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకొని టోల్‌ప్లాజాల ఏర్పాటు ప్రాంతాలను ఖరారు చేస్తారు. చేయాల్సి ఉంటుంది. టోల్ ప్లాజాల దగ్గర ఎక్స్‌ప్రెస్ వే మీదకు వాహనాలు ఎక్కి దిగేందుకు వీలుగా నిర్మించాల్సిన సర్వీస్ రోడ్ల డిజైన్‌ను కూడా కన్సల్టెంట్లు సూచించాల్సి ఉంటుంది. గ్రామాల నుంచి వచ్చే వాహనాలు క్షేమంగా ఎక్స్‌ప్రెస్ వే మీదకు వచ్చి ట్రాఫిక్‌లో సురక్షితంగా కలిసిపోయే విధంగా సర్వీస్ రోడ్లు డిజైన్ చేయాల్సి ఉంటుంది. కంచె వేయాల్సిన అవసరం ఉన్న ప్రాంతాలను సలహా సంస్థ సూచించాలి. ఆర్‌ఆర్‌ఆర్ పొడవునా అండర్ పాస్‌లు, కల్వర్టులు, వంతెనలకు సంబంధించి భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అంచనాలు రూపొందించాలి. వీటి విషయంలో చిన్న పొరపాటు జరిగినా తరువాత చాలా ఇబ్బందులు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. రోడ్డు పైకి ఎక్కి దిగే చోట నిర్మించే మేజర్ రోడ్లు, క్రాసింగ్‌ల మధ్య కనీస దూరం ఐదు కిలోమీటర్లు ఉంటుంది.
ఇంటర్ ఛేంజ్‌ల ఆకృతులను బట్టి ఎంత భూమి అవసరమవుతుందో అంచనా వేసి సేకరించాల్సిన భూమి వివరాలను కూడా సలహా సంస్థే చెప్పాలి. రహదారి మధ్యలో వచ్చే కొండలు, గుట్టలు, ఇతరత్రా వివరాలను 3డీ రూపంలో ఇవ్వాలి. రహదారి మార్గం(అలైన్ మెంట్) దగ్గరి నుంచి రోడ్డు నిర్మాణ విధానం సహా పలు అంశాలన్నీ సమగ్ర ప్రాజెక్టు నివేదికలో తేలనున్నాయి. అండర్ పాస్, రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, క్రాసింగ్, జంక్షన్‌ల లెక్క డీపీఆర్‌లోనే తేలుతుంది. రహదారి వెళ్లే మార్గంలో గ్రామాలుంటే ఎన్ని ఇళ్లు తొలగించాలి? వాటిలో ఎంతమంది నివసిస్తున్నారు? చెరువులు, కుంటలు ఎన్ని? సాగు చేసుకుంటున్న భూములు? అటవీభూములు లెక్కలు వేయాలి. సేకరిస్తున్న భూముల వివరాలతో పాటు నిర్మాణ వ్యయ అంచనాలు కూడా పేర్కొంటారు,. రహదారిని ఏ పద్ధతిలో నిర్మించాలి, ఏ విధానంలో నిర్మిస్తే లాభదాయకం చర్చిస్తారు. నివేదిక వచ్చాక డీపీఆర్‌ను ఖరారు చేసేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే.
రాష్ట్ర ప్రభుత్వమే ఎందుకు?
రాష్ట్రానికి రీజినల్ రింగు రోడ్డు మంజూరైనప్పుడు కేంద్రం దానిని ఉత్తర, దక్షిణ భాగాలుగా విభజించింది. ఉత్తరభాగం నిర్మాణానికి అనుమతులు ఇవ్వడమే కాకుండా నిర్మాణానికి టెండర్లు కూడా పిలిచింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత దక్షిణ భాగాన్ని తామే నిర్మించాలని భావించింది. మళ్లీ ఆ నిర్ణయాన్ని మార్చుకుని దక్షిణభాగం పనులనూ చేపట్టండంటూ కేంద్రానికి లేఖ రాసింది. దాని ప్రకారం డీపీఆర్ సహా అన్నీ కేంద్రమే చూసుకోవాలి. అయితే, రాష్ట్ర ప్రభుత్వమే డీపీఆర్ తయారీకి సలహా సంస్థల ఎంపికకు టెండర్లు పిలిచింది. తొలుత కేంద్రం ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగం ప్రాథమిక అలైన్‌మెంట్‌ను ఖరారు చేసినపుడు చౌటుప్పల్- ఆమనగల్- సంగారెడ్డి మధ్య 189 కిలోమీటర్ల పొడవున నిర్మించాలని నిర్ణయించారు.
రాష్ట్ర ప్రభుత్వం తానే చేపట్టాలని నిర్ణయించినపుడు ప్రాథమిక అలైన్‌మెంట్‌లో కొన్ని మార్పులు చేసింది. 11 కిలోమీటర్లు పెరిగి 200 కిలోమీటర్లు అయ్యింది. తాజా టెండర్లలో 200 కిలోమీటర్లనే పేర్కొన్నారు. డీపీఆర్‌ను రూపొందించి, కేంద్రానికి ఇచ్చి దాన్నే ఖరారు చేయాలని, దాని ప్రకారమే రోడ్డు నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయనుంది. అందుకోసమే డీపీఆర్ టెండర్లు పిలిచారు. బిడ్‌లను ఫిబ్రవరి 11న తెరుస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసి ఇచ్చిన డీపీఆర్‌ను కేంద్రం ఆమోదిస్తుందా? మొదటగా నిర్ణయించిన 189 కిలోమీటర్ల అలైన్‌మెంట్ ప్రకారమే ముందుకు వెళ్తుందా? అన్నది తెలియాల్సి ఉంది.