Financial Survey: పన్ను వసూళ్లలో తెలంగాణ నం.1
ABN , Publish Date - Feb 01 , 2025 | 05:17 AM
పన్ను వసూళ్లలో సొంత పన్నుల సొమ్ములు సగానికిపైగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. తెలంగాణలో సొంత పన్ను వసూళ్లు 88 శాతం వరకు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

రాష్ట్ర ఎంఎ్‌సఎంఈ విధానం భేష్
సాగునీరు అందే భూములు 86 శాతం
దేశంలోనే నాలుగో స్థానం
మహిళల్లో యాజమాన్య స్ఫూర్తిని పెంచే ‘వీ-హబ్’: ఆర్థిక సర్వే
న్యూఢిల్లీ, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): పన్ను వసూళ్లలో సొంత పన్నుల సొమ్ములు సగానికిపైగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. తెలంగాణలో సొంత పన్ను వసూళ్లు 88 శాతం వరకు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మొత్తం పన్ను రాబడుల్లో సొంత పన్నుల వసూళ్లు సగానికి పైగా ఉన్న రాష్ట్రాలు దేశంలో 15 ఉన్నాయని.. వాటిలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని శుక్రవారం పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే(2024-25) వెల్లడించింది. గత సెప్టెంబరులో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రకటించిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎ్‌సఎంఈ) విధానాన్ని ఆర్థిక సర్వే ప్రత్యేకంగా ప్రశంసించింది. చిన్న ఉత్పత్తిదారులు తమ వస్తువులను అమ్ముకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కామర్స్ హబ్‌లను నెలకొల్పాలని భావిస్తోందని, తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో ఇప్పటికే కొత్త ఎంఎ్‌సఎంఈ విధానాన్ని ప్రకటించిందని తెలిపింది.
దీనివల్ల ఓపెన్ నెట్‌వర్క్ డిజిటల్ కామర్స్ పోర్టల్, ప్రభుత్వ ఈ మార్కెట్‌ప్లేస్ పోర్టళ్లతో విక్రయదారులను ప్రోత్సహించడం ద్వారా ఎంఎ్‌సఎంఈల్లో ఈ-కామర్స్ ప్రవేశించేందుకు అవకాశం కలుగుతుందని సర్వే పేర్కొంది. ప్రజలకు రక్షిత తాగునీరిచ్చేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన జల్ జీవన్ మిషన్‌ను నూటికి నూరు శాతం అమలు చేస్తున్న 8 రాష్ట్రాల్లో తెలంగాణ ఉందని ఆర్థిక సర్వే వెల్లడించింది. ఇక సేవల రంగంలో ప్రత్యేకతను ప్రదర్శిస్తున్న రాష్ట్రాల్లో ఐటీ సేవలతో కర్ణాటక, తెలంగాణ ముందున్నాయని తెలిపింది. తెలంగాణలో స్థూల రాష్ట్ర అదనపు విలువనందించే సేవల (జీఎ్‌సవీఏ)లో మూడో వంతు రియల్ ఎస్టేట్ నుంచి లభిస్తున్నాయంది. ఐటీతోపాటు హైదరాబాద్‌లో ఆర్థిక సేవలందించే ఫిన్‌టెక్‌లు కేంద్రీకృతమవడం వల్ల కార్యాలయాలు, నివాస స్థలాలకు గిరాకీ పెరిగిందని వెల్లడించింది. తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు పట్టణాల్లో సేవల ఆధారిత ఆర్థిక వ్యవస్థలపై ఎక్కువగా ఆధారపడినట్లు విశ్లేషించింది.
డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్లు, మందులు..
డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్లు, మందులను సరఫరా చేసేందుకు ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) 2021 సెప్టెంబరులో వికారాబాద్ జిల్లాలో తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి సహకారంతో అమలు చేస్తున్న ప్రాజెక్టు ఆసియాలోనే ప్రప్రథమమని ఆర్థిక సర్వే తెలిపింది. అంతేకాక భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) ప్రవేశపెట్టిన ఐ-డ్రోన్ ప్రాజెక్టు కింద డ్రోన్ల ద్వారా తెలంగాణలో టీబీ నమూనాలను రవాణా చేస్తున్నారని తెలిపింది. మహిళల్లో యాజమాన్య స్ఫూర్తిని పెంపొందించేందుకు ప్రభుత్వం ఎలా దోహదపడుతుందో చెప్పేందుకు తెలంగాణలో అమలు చేస్తున్న వీ-హబ్ (విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ హబ్) చక్కటి ఉదాహరణ అని సర్వే ప్రశంసించింది. తెలంగాణలో ప్రథమంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో మహిళా యజమానులకు ఇన్‌క్యుబేటర్ ఏర్పరిచారని వెల్లడించింది. దీనివల్ల వారికి సాంకేతిక, ఆర్థిక, ప్రభుత్వ విధానపరమైన మద్దతు లభిస్తుందని, అంతర్జాతీయ మార్కెట్‌లో అవకాశాలు లభిస్తాయని తెలిపింది.
కాగా, చైనా తర్వాత అత్యధిక పరిమాణంలో సిమెంట్‌ను ఉత్పత్తి చేస్తున్న దేశం భారత్ అని.. 13 రాష్ట్రాల్లో 87 శాతం సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయని, వీటిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయని సర్వే పేర్కొంది. దేశంలో 2016-21 సంవత్సరాల్లో వ్యవసాయ భూములకు సాగునీటి వసతి పెరిగిన రాష్ట్రాల్లో తొలి మూడు స్థానాల్లో పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఉండగా.. తెలంగాణ నాలుగో స్థానంలో ఉందని తెలిపింది. రాష్ట్రంలో 86 శాతం భూములకు సాగు నీరందుతోందని సర్వే వెల్లడించిందిది. ఉత్పాదకత, పరిజ్ఞానం, సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించే వ్యవసాయ విస్తరణ విద్యా కేంద్రాలు తెలంగాణతో పాటు హరియాణా, గుజరాత్, అసోంలలో పనిచేస్తున్నాయని చెప్పింది. విద్యార్థులు ఒకరి నుంచి మరొకరు నేర్చుకునే ప్రేరణ విద్యా నమూనాలు శిక్షణా ఫౌండేషన్ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో అమలు అవుతున్నాయని ఆర్థిక సర్వే వెల్లడించింది.
ఇవీ చదవండి:
సచిన్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం.. ఈ అవార్డు చాలా స్పెషల్
ఒకే రోజు ముగ్గురు స్టార్ల సెంచరీలు మిస్.. ఇది ఊహించలేదు
చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆసీస్‌కు బిగ్ షాక్.. అసలైనోడు దూరం
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి